
రబీ ధాన్యం సేకరణపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. రైతు పండించిన ప్రతి గింజకూ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఇచ్చి తీరతామని ప్రతిన బూనిన సర్కారు ఏప్రిల్ నాల్గవ వారం గడుస్తున్నా రబీ ధాన్యం సేకరణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడాన్ని బట్టి ప్రభుత్వ బాసలను శంకించాల్సి వస్తోంది. కొన్ని జిల్లాల వారీగా తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంత పరిమాణంలో ధాన్యాన్ని కొంటారో టార్గెట్‌పై స్పష్టత లేదు. ఇలాగైతే కొనుగోళ్లు ఎలా సాగుతాయి? రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లో కొనుగోలు కేంద్రాలంటున్నా చాలా చోట్ల ప్రారంభం కాలేదు. ఒకటీఅరా ప్రారంభించినా అవసరమైన మౌలిక సదుపాయాల్లేవు. కాగా వేసవిలో అకాల వర్షాల భయం అన్నదాతలను వెంటాడుతోంది. అందుకే రైతులు సర్కారీ కొనుగోలు కేంద్రాలను నమ్ముకోకుండా వచ్చినకాడికి పంటను తెగనమ్ముకుంటున్నారు. ఇదే సందని మిల్లర్లు, వ్యాపారులు, దళారులు రైతులను అందినకాడికి దోచుకుంటున్నారు. ఎంఎస్‌పిలో బస్తాపై రూ.వంద రెండొందలు తక్కువ ఇస్తున్నారు. వరి కోతల ప్రారంభ దశలోనే పరిస్థితులు ఇలా ఉంటే, ఇక కోతలు ముమ్మరమై విరివిగా ధాన్యం మార్కెట్‌కొస్తే దోపిడీ ఇంకెంతగా ఉంటుందో ఊహించవచ్చు. మరోవైపు 'బోండాలు' రకం ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వక పోవడంతో ఆ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
ఖరీఫ్‌లో ధాన్యం రైతులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇ-క్రాప్, ఇ-కెవైసి, ఆధార్ బేస్డ్ బ్యాంక్ పేమెంట్స్, ల్యాండ్ రికార్డ్స్, ముందస్తు రిజిస్ట్రేషన్లు... నిబంధనలతో రైతులు విసిగివేసారి పోయారు. కౌలు రైతులైతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల గుమ్మం తొక్కలేకపోయారు. తగినన్ని గోనె సంచులను సైతం ప్రభుత్వం అందుబాటులో ఉంచలేకపోయింది. తేమ శాతం, నాణ్యతా ప్రమాణాల పేరుచెప్పి మిల్లర్లు రైతులను దోచుకున్నారు. ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు తోలేందుకు అయ్యే రవాణా, హమాలీ ఛార్జీలను ప్రభుత్వం భరిస్తుందనగా, ఆ పేమెంట్స్ రైతులకు కాకుండా మిల్లర్లకు అందాయి. అన్ని అవాంతరాలనూ దాటుకొని ధాన్యం తోలితే, నిర్ణీత గడువు మూడు వారాల్లోపు సొమ్ము చెల్లించాల్సి ఉండగా, నెలల పర్యంతం చెల్లింపులు ఆగిపోయాయి. ధాన్యం ఇచ్చి రొక్కం కోసం ఎదురు చూపులు చూడాల్సిన దైన్యం రైతులది. ఇప్పటికీ ఖరీఫ్ పేమెంట్స్ జరగని ఉదంతాలున్నాయి. రబీ వచ్చినా అక్కడక్కడ రైతుల వద్ద ఖరీఫ్ ధాన్యం ఉంది. ఈ అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వం రబీ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, ఇంకా కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై ఆచితూచి అడుగులేయడం రైతుల పట్ల ప్రభుత్వ నిలువెత్తు నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం.
రబీలో వరి సాగు తగ్గింది. సాధారణ సాగు 19.52 లక్షల ఎకరాలు కాగా 16.40 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఎకరానికి 37 బస్తాలొస్తాయని (బస్తాకు 75 కిలోలు) అంచనా వేశారు. సుమారు 50 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుంది. రబీ ధాన్యం సేకరణ అంతకంతకూ తగ్గుతోంది. 2019-20లో 34.73 లక్షల టన్నులు, ముందటేడు 37.24 లక్షల టన్నులు సేకరించగా, నిరుడు 26.24 లక్షల టన్నులే సేకరించారు. ఈ పూర్వరంగంలో ఈ తడవ ఎంత మేరకు సేకరిస్తారో తెలీదు. ఖరీఫ్‌లో 37 లక్షల టన్నులు సేకరించాలనుకొని టార్గెట్‌లో లక్షన్నర టన్నులు సేకరించలేదు. ప్రభుత్వం సేకరణ తగ్గించినపక్షంలో వ్యాపారులు, దళారులు ఇంకా రైతుకు ధరలు దిగ్గోస్తారు. ప్రస్తుతం సర్కారు ప్రకటించిన ఎంఎస్‌పి క్వింటాకు 'ఎ' గ్రేడు రకానికి రూ.2,060, సాధారణ రకానికి 2,040. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోకపోతే రైతులు అంతకంటే తక్కువకు అమ్ముకొని నష్టపోతారు. ఒక్క వరి ధాన్యమే కాదు పప్పుశనగ, పసుపు, మిరప, మొక్కజొన్న పంటలు కొనే దిక్కు లేక రైతులు ఆగమాగమవుతున్నారు. ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి మార్కెట్‌లో జోక్యం చేసుకొని ప్రభుత్వం రైతుల నుంచి పంటలు కొనుగోలు చేసి ఆదుకోవాలి. మార్కెట్‌లో జోక్యం పథకాలకు కేంద్రం బడ్జెట్‌లో నిధులివ్వలేదు. వరి ధాన్యం సేకరణను కేంద్రం కుదిస్తోంది. రాష్ట్రం కేంద్రంపై పోరాడాలి. రాష్ట్రానికి రావాల్సిన ఆహార భద్రతా చట్టం నిధుల సాధనకు కేంద్రంపై ఒత్తిడి చేయాలి. అప్పుడే రాష్ట్ర రైతు, ప్రజల ప్రయోజనాలు కాపాడబడతాయి.