Mar 25,2023 07:25

డు రోజుల పాటు పార్లమెంటరీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిన తర్వాత, బడ్జెట్‌ సమావేశాల రెండో భాగాన్ని కుదించాలని ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది. పద్దులను గిలెటిన్‌ చేయడం ద్వారా, ఎలాంటి చర్చ లేకుండా ద్రవ్య బిల్లును ఆమోదించడం ద్వారా సమావేశాలను కుదించడానికి ప్రయత్నిస్తోంది.
    విదేశాల్లో వుండగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారతదేశంలో ప్రజాస్వామ్య స్థితిగతుల గురించి చేసిన వ్యాఖ్యలకుగాను...ఆయన క్షమాపణ చెప్పాలంటూ...మార్చి 13 నుండి పార్లమెంట్‌ ఉభయసభల కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది పాలక పార్టీనే. పై చర్య దీని నుంచి ఉద్భవించినదే.
        అదానీ-హిండెన్‌బర్గ్‌ అంశంపై ఎలాంటి చర్చ జరగకుండా నివారిస్తూ, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి ఇదంతా కేవలం ఒక సాకేనని అర్ధమైపోతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో, బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం నుండి అదానీ గ్రూపునకు సంబంధించి వెలువడిన హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చ జరగాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షం గట్టిగా పట్టుబడుతూనే వుంది. అప్పటి నుండి, వివిధ షెల్‌ కంపెనీల్లో గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ పాత్ర గురించి, అలాగే అంబుజా సిమెంట్‌-ఎసిసి కంపెనీల్లో ప్రమోటర్‌-ఇన్వెస్టర్‌గా ఆయన కార్యకలాపాల గురించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదానీ గ్రూపులో కీలక పెట్టుబడిదారైన ఎలారా అనే విదేశీ సంస్థ ఒక రక్షణ సంబంధమైన కంపెనీలో అదానీతో సహ యజమానిగా వుందనే దిగ్భ్రాంతికరమైన అంశం బైటపడింది. ఈ విషయాలన్నింటిపైన పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిన అవసరం వుంది. వివరించాల్సి వుంది. కానీ, అందుకు బదులుగా, రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభం రోజునే జరిగిన దాడికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వం వహించడం మనం చూశాం. ఎలారా వంటి కంపెనీ భారత్‌లో ఒక రక్షణ సంస్థకు అదానీతో కలిసి సహ యజమానిగా ఎలా మారిందనే కీలకమైన ప్రశ్నపై సమాధానం చెప్పకుండా దాటేయడానికి పన్నిన ఎత్తుగడేనా ఇది? రాహుల్‌ గాంధీకి సంబంధించినంత వరకు, ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని, మోడీ ప్రభుత్వం దాన్ని అణచివేస్తోందంటూ ఆయన చేసిన విమర్శలన్నీ దాదాపు ప్రతిపక్ష నేతలందరూ చేసే విమర్శలే. అయితే విదేశీ గడ్డపై ఆయన ఇలా విమర్శ చేయడం దేశభక్తి కాదంటూ చేస్తున్న ఆరోపణలు బూటకమైనవి. ఎందుకంటే ప్రభుత్వ పాత్రను విమర్శించడం, ఒక దేశంపై దాడి చేయడం ఒకటి కాదు. కేంబ్రిడ్జిలో చేసిన ప్రసంగంలో అమెరికన్‌ ప్రజాస్వామ్యాన్ని అమాయకంగా ప్రశంసించడంతో సహా బ్రిటన్‌లో రాహుల్‌ గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నింటినీ ఎవరైనా సమర్ధించాల్సిన అవసరం లేదు. కానీ దేశ విదేశాల్లో ఎక్కడైనా గానీ ప్రభుత్వ నిరంకుశవాద ధోరణిని విమర్శించే హక్కు విడదీయరానిది.
         అదానీ అంశంపై బిజెపి వ్యవహారం ఆశ్చర్యం గొలుపుతోంది. ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా పలు ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఉభయ సభల్లో జరిగిన చర్చకు సమాధానమిచ్చే సమయంలో అదానీ పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించకుండానే ప్రధాని నరేంద్ర మోడీ గంటల తరబడి మాట్లాడిన తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇది చూస్తుంటే హారీపోటర్‌ పుస్తకాల్లోని అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన పాత్ర లార్డ్‌ వాల్డ్‌మార్ట్‌ గుర్తుకు వస్తుంది. 'అస్సలు పేరు చెప్పకూడని వ్యక్తి'గా చాలామంది అతడిని ప్రస్తావిస్తారు. ఇక మోడీ, అదానీల మధ్య సంబంధాల గురించి బయటపడకూడదంటే...నరేంద్ర మోడీ, బిజెపికి సంబంధించింత వరకు... గౌతమ్‌ అదానీ అటువంటి 'అస్సలు పేరు చెప్పకూడని వ్యక్తి'.
     పార్లమెంట్‌లో ప్రస్తుతం అమలవుతున్న ఎత్తుగడలు చూస్తుంటే, అదానీ గ్రూపుపై పార్లమెంటరీ సమీక్ష జరగకుండా నివారించేందుకు మోడీ ప్రభుత్వం, బిజెపి ఎంత దూరమైనా వెళతాయని రుజువవుతోంది. ఇన్నేళ్ళ పాటు రెగ్యులేటరీ అధికారుల నోరు మూయించడమే కాకుండా, ఇప్పుడు అదానీ సామ్రాజ్యం గురించి, దాన్ని నిర్మించిన తీరు గురించి ప్రశ్నలు తలెత్తకుండా పార్లమెంట్‌ నోరు కూడా నొక్కేస్తున్నారు. చట్టానికి సంబంధించిన విధి విధానాల ఉల్లంఘనలపై వివరణ ఇవ్వడానికి, ద్వంద్వ ప్రయోజనాలకు ఉపయోగించిన కొన్ని రుణాలను వదిలిపెట్టడానికి, హిండెన్‌బర్గ్‌ ఉదంతం బయటపడినప్పటి నుండి సంభవించిన నష్టాల్లో కొన్నింటినైనా భర్తీ చేసుకోవడానికి...అదానీకి, కంపెనీకి కొంత సమయం ఇవ్వాలన్నది మోడీ ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అదానీని రక్షించడంతో పోలిస్తే పార్లమెంట్‌ను స్తంభింప చేయడమనేది పెద్ద విషయమే కాదు.
        పార్లమెంట్‌ను అదేపనిగా కించపరచడం, దాని ప్రాధాన్యత లేకుండా చేయడం అనేది అదానీ వ్యవహారంలో పాలక పార్టీ మరింత వేగంగా చేసింది.
 

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)