Oct 08,2023 15:36

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :  ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రత నేడు ప్రమాదంలో పడింది. వాస్తవానికి  ఏదేశ అభివృద్ధి అయినా ఆ దేశ పౌరుల  ఆరోగ్యం మీద ఆధార పడి ఉంటుందని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పాయి. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కచ్చితంగా ఆరోగ్య హక్కు చట్టం చేయాలని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్  టి. కామేశ్వరరావు డిమాండ్ చేశారు.. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ హాల్ లో జనవిజ్ఞాన వేదిక , ప్రజారోగ్య వేదిక , ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ సంయుక్త నిర్వహణలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు.  1948 లో ప్రకటించబడిన మానవ హక్కుల చార్టర్ (యునివర్సల్ డిక్లరేషన్)ఆరోగ్యం అనేది మనిషి ఒక గౌరవప్రదమైన జీవితం జీవించే హక్కులో ఒక భాగం అని పేర్కొనబడిందని అన్నారు. 1966 లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం  ఆరోగ్యం అనేది పౌరుల ప్రాధమిక హక్కు గా గుర్తించిందని గుర్తుచేసారు. భారత రాజ్యాంగం లో ఆర్టికల్ 21 అనేది పౌరునికి జీవించే హక్కుని కల్పించడమే కాకుండా జీవించడం అంటే కేవలం ఏదో విధంగా జీవించడం కాదని  ఆరోగ్యవంతమైన  గౌరవప్రదమైన జీవితం గా వుండాలని రాజ్యాంగం నిర్దేసించిదని, కాబట్టి రాజ్యాంగం లోని  ఆదేశిక సూత్రాల ఆదేశానుసారం దేశ పౌరుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని  , అందుకు అనుగుణంగా తగు చర్యలను తీసుకోవాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొని ప్రజల ఆరోగ్య హక్కు సాధన కోసం జరిగే భవిష్యత్తు కార్యాచరణకు మద్దతు ప్రకటించారు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఎం వి ఎన్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎపిఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు  జె.మురళి , యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జివిఎస్ఎన్ మూర్తి, ఎస్టీయు జిల్లా అధ్యక్షులు శ్యామ్ , ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సుధారాణి , రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు , ప్రజారోగ్య వేదిక జిల్లా కన్వీనర్ ఎస్ లక్ష్మణరావు , మెడికల్ రిప్రజంటేటివ్స్ యూనియన్ నాయకులు సూర్యభగవాన్ జర్నలిస్ట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు , సమతా రాష్ట్ర కన్వీనర్ జి. నిర్మల, జనవిజ్ఞాన వేదిక జిల్లా నాయకులు కె. మురళీబాబు తదితర ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పి రమణప్రభాత్ ఆరోగ్య హక్కు చట్టం ఆవస్యకత పై తీర్మానం ప్రవేశపెట్టి భవిష్యత్తు కార్యాచరణ ప్రవేశపెట్టగా ప్రజా సంఘాల ప్రతినిధులు దానిని ఏకగ్రీవంగా ఆమోదించారు.