Jul 05,2022 06:38

ఆరోగ్య భత్యంతో కూడిన జీతం రూ.21 వేలు ఇవ్వండి. లేదా 11వ పిఆర్‌సి జీతాలు ఇవ్వండి. అలాగే సి.యం గారు చెప్పిన సమాన పనికి సమాన వేతనం, పర్మినెంట్‌, ఇతర డిమాండ్లను జులై 10 లోగా పరిష్కరించండి. లేదంటే జులై 11 నుండి సమ్మె తప్పదని జెఎసి నాయకత్వం చెప్పేసింది.

రోగ్య భత్యం, సమాన పనికి సమాన వేతనం, పర్మినెంట్‌, సిబ్బంది పెంపు, పనిముట్లు, రక్షణ పరికరాలు తదితర సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌తో పాటు పర్మినెంట్‌ కార్మికులు జులై 11 నుండి నిరవధిక సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు ఇప్పటికే సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో గేట్‌ మీటింగులు, జనరల్‌ బాడీల ద్వారా కార్మికులను సమాయత్తం చేస్తున్నారు.
 

                                                                  సమ్మె డిమాండ్లు

మున్సిపల్‌ రంగం లోని సిఐటియు, ఎఐటియుసి, ఇతర స్వతంత్ర సంఘాలు జూన్‌ 23న విజయవాడలో సమావేశం జరుపుకొని మున్సిపల్‌ కార్మిక, ఉద్యోగ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జెఎసి)గా ఏర్పడ్డాయి. సిఐటియు అనుబంధ సంఘం జూన్‌ 6న, ఎఐటియుసి అనుబంధ సంఘం జూన్‌ 14న విడి విడిగా సమ్మె నోటీసులు ఇచ్చాయి. కాగా జెఎసి సమావేశంలో జులై 11 నుండి ఐక్యంగా నిరవధిక సమ్మెను నిర్వహించాలని అన్ని సంఘాలు తీర్మానించాయి.
     రాష్ట్ర ప్రభుత్వం 29 వేల మంది పబ్లిక్‌ హెల్త్‌ కార్మికులకు...ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్సు (ఆరోగ్య భత్యం)ను నెలకు రూ. 6000 చొప్పున 2019 ఆగస్టు నుండి చెల్లిస్తోంది. 2022 జనవరి నుండి ఆరోగ్య భత్యం చెల్లింపులు నిలిపివేసింది. పైగా పారిశుధ్య కార్మికులకు ఆ విధంగా పరిమితితో సంబంధం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న హామీకి తూట్లు పొడిచి మున్సిపల్‌ కార్మికులను సంక్షేమ పథకాలు (అమ్మ ఒడి, విద్యా దీవెన, చేయూత, వికలాంగుల పెన్షన్‌ మొదలైనవి) అమలును నిలిపేసింది. వీటికి తోడు కార్మికుల పైన ప్రభుత్వం పని భారం రెట్టింపు చేస్తోంది. ఇద్దరు చేయాల్సిన పనిని ఒకరితో చేయిస్తోంది. పట్టణాల విస్తరణ మేరకు కార్మికుల సంఖ్యను పెంచడం లేదు. కార్మికులను బలవంతంగా సచివాలయాలకు బదలాయించి ఒక్కో కార్మికుడి పైన 8 మంది అజమాయిషీ అధికారులను పెంచింది. పైగా కార్మికులకు పనిముట్లు కూడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. ఫలితంగా ఒక్కో కార్మికుడు, కార్మికురాలు నెలకు రూ. 200 నుండి రూ. 250 పనిముట్లు కోసం వెచ్చించాల్సి వస్తోంది.
    ఇంజనీరింగ్‌ విభాగంలో కార్మికులతో పని చేయించుకునేటప్పుడు సర్టిఫికెట్లతో సంబంధం లేకుండా చాకిరీ చేయించుకుంటున్నారు. తీరా జీతాల చెల్లింపుకు వచ్చేసరికి టెక్నికల్‌ సర్టిఫికెట్లకి ముడిపెట్టి దశాబ్దాలుగా శ్రమ దోపిడీ చేస్తున్నారు. హెల్త్‌ విభాగానికి చెందిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, పార్కులు, మలేరియా కార్మికులతో పాటు డ్రైవర్లకు ఆరోగ్య భత్యం చెల్లించడం లేదు. అత్యంత ప్రమాదకరమైన విధులు నిర్వహించే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వకుండానే కాల్వ లోకి దించి పని చేయిస్తున్నారు. ఈ మధ్యనే తిరుపతిలో ఇరువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరికి తెలిసిందే. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం కోసం శవాలను రోడ్డుపైన పెట్టి పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. మున్సిపల్‌ స్కూల్‌ స్వీపర్లతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. పేరుకే పార్ట్‌టైమ్‌ కానీ, రోజుకి 8 నుండి 9 గంటలు చాకిరీ చేస్తున్నారు. ఈ కార్మికులు రోజూ ఇంటి నుండి తాము పనిచేసే స్కూల్‌కి రావడానికి నెలకు రూ. 2000 నుండి రూ.2,500 ఖర్చువుతోంది. వీరికిచ్చేది నాలుగు వేల రూపాయలు! పెద్ద వయసైతేనో చనిపోతేనో వారి స్థానంలో వారి కూతురునో లేకపోతే కోడలినో వచ్చి పని చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వీరికి నెలకు రూ. 18 వేలు జీతం చెల్లిస్తామన్న హామీని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి అటకెక్కించారు. గత మూడేళ్లలో వీరికి ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదు. ఎస్‌ఎంఆర్‌ లకు టైం స్కేల్‌, కరువు భత్యం అమలు చేయాలి. కాని వీరికి నెలకు రూ.13 వేలు జీతంగా చెల్లించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటున్నది.
     పర్మినెంట్‌ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 010 ద్వారా జీతాలు చెల్లిస్తోంది. కానీ, వీరికి 3 నుండి 4 నెలల జీతాలు పెండింగ్‌ పెడుతున్నారు. సరెండర్‌లీవ్స్‌ చెల్లింపులు 8 నెలలు గడుస్తున్నా నేటికీ చెల్లించడం లేదు. జిపిఎఫ్‌ అకౌంట్లు ప్రారంభించడం లేదు. హెల్త్‌ కార్డులు ఇవ్వడం లేదు. పెన్షనర్లకు రిటైర్మెంట్‌ బెనిఫిట్లను ఏళ్ల తరబడి చెల్లించడం లేదు. విజయవాడ నగరంలో 470 మందికి 5 ఏళ్లుగా చెల్లించలేదు. బెనిఫిట్లు అందుకోకుండానే 40 మంది పెన్షనర్లు చనిపోయారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు.
 

                                                                   ఆప్కాస్‌ పేరిట దగా

ఒప్పంద కార్మికులను, కాంట్రాక్ట్‌ కార్మికులను వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వచ్చాక పర్మినెంట్‌ చేస్తామని వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక 'ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్సింగ్‌ సర్వీసెస్‌' (ఆప్కాస్‌)ను ఏర్పాటు చేశారు. దీనివల్ల మున్సిపల్‌ కార్మికులకు మేలు కంటే కీడు ఎక్కువ జరిగింది. 'ఆప్కాస్‌'లో మున్సిపల్‌ కార్మికులను ఎంప్లాయీస్‌'గా నమోదు చేశారు. కానీ, ఎంప్లాయీస్‌కు ఉండే ఏ ప్రయోజనాలను వీరికి వర్తింపచేయడం లేదు. కానీ 60 ఏళ్లు దాటిన 2,500 మందిని బలవంతంగా ఉద్యోగాల నుండి తొలగించారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్ల కింద చిల్లిగవ్వ చెల్లించలేదు. దీర్ఘకాలికంగా అనారోగ్యంపాలై... తమ బిడ్డలకు ఉపాధి కల్పించి తమ కుటుంబాలను పస్తుల నుండి కాపాడమని సుమారు 2,000 మంది కార్మికులు గత రెండున్నర సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు.
    గతం నుండి కొనసాగుతున్న ఇపిఎఫ్‌, ఇఎస్‌ఎ విధానాన్ని 'ఆప్కాస్‌' పేరుతో కొత్త సాఫ్ట్‌వేర్‌ లోకి మారుస్తున్నామంటూ గత రెండు సంవత్సరాలుగా చెబుతున్నారు. కానీ పాత, కొత్త కలయికల ఖాతా నెంబర్లను కార్మికులకు ఇవ్వడం లేదు. కార్మికుల వేతనాల నుండి కోత పెడుతున్నా... వాటాల నిధులు ఆయా ఖాతాలలో జమ అవుతున్నదీ లేనిదీ కార్మికులకు సమాచారం ఇవ్వడం లేదు. దీనితో ఇపిఎఫ్‌ పైన రుణాలు తెచ్చుకోవడానికి సాధ్యంకాక బయట వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అనారోగ్యం పాలైనవారు లక్షల రూపాయలు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది.
 

                                                      వేతన సవరణలో కార్మికులకు ద్రోహం

రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సవరణ కమిటీ అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను బయట పెట్టకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ప్రకారం 'ఆప్కాస్‌' పరిధి లోని, వివిధ కేటగిరీల వారికి రూ.12,000-రూ.15,000, రూ.15,000-18,500, రూ.17,500-21,500లకు జీతాలు పెంచుతూ జీవో.ఎం.ఎస్‌ నెం.7 ను జారీ చేసింది. కానీ, అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ నివేదికలో జీతం రూ. 20 వేలతో పాటుగా కరువు భత్యం సైతం ఒప్పంద కార్మికులకు చెల్లించాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను అమలు చేసి ఉంటే ఒక్కో కార్మికుడికి నెలకు రూ. 22 వేల నుండి రూ. 24 వేల వరకు జీతం వచ్చేది. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి నెలకు రూ. 7 వేల నుండి రూ. 9 వేల వరకు కోత పెట్టి ఈ కార్మికులు కుటుంబాలకు అన్యాయం చేసింది.
    పైగా మున్సిపల్‌ కార్మికులకు రూ.12 వేల నుండి రూ. 15 వేలకు జీతం పెరిగింది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 'ఆరోగ్య భత్యానికి ఎగనామం పెట్టేందుకు సిద్ధమైంది. గత జనవరి నుండి ఆరోగ్య భత్యం చెల్లించడం లేదు. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడంతో, నెలకు రూ. 18 వేలు జీతం మున్సిపాలిటీలే చెల్లించాలంటూ 'ఆప్కాస్‌' ద్వారా బిల్లులు తయారు చేయించి మున్సిపాలిటీలకు పంపించింది.
    అనంతపురం, కడప, గుంటూరు వంటి కొన్ని జిల్లాల్లోని కొద్ది మున్సిపాల్టీల్లో కార్మికులకు రూ.18 వేల జీతం (అంటే ఇపిఎఫ్‌, ఇఎస్‌ఎ వాటాలు పోగా రూ.15,915) వారి బ్యాంకు అకౌంట్లలో వేశారు. మిగిలిన జిల్లాలు రూ.18 వేలు జీతం చెల్లింపుకు ప్రభుత్వ నిబంధనలు కావాలని కోరడంతో సమస్య జఠిలంగా మారింది. కార్మిక సంఘాలు ఆరోగ్య భత్యం, ఇతర సమస్యలపై సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రూ.18 వేలు తీసుకున్న వారి నుండి రూ. 3 వేలు రికవరీకి పూనుకుంటున్నది.
 

                                                           ప్రభుత్వ సన్నాయి నొక్కులు

జూన్‌ 24న మున్సిపల్‌ మంత్రి గారికి జెఎసి నాయకత్వం సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు...'ఎవరికీ జీతాలు పెరగనప్పుడు పారిశుధ్య కార్మికులకు రూ. 18 వేలు చేశాం. మరలా 2024 ఎన్నికల్లో మా ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు మరలా మీకు జీతాలు పెంచుతాం. ముఖ్యమంత్రి గారు మీపట్ల సానుకూలంగా ఉన్నారు. కాబట్టి 'సమ్మె ఆలోచనను విరమించండి' అని చెప్పారు. కానీ...'ఆరోగ్య భత్యంతో కూడిన జీతం రూ.21 వేలు ఇవ్వండి. లేదా 11వ పిఆర్‌సి జీతాలు ఇవ్వండి. అలాగే సియం గారు చెప్పిన సమాన పనికి సమాన వేతనం, పర్మినెంట్‌, ఇతర డిమాండ్లను జులై 10 లోగా పరిష్కరించండి. లేదంటే జులై 11 నుండి సమ్మె తప్పద'ని జెఎసి నాయకత్వం చెప్పేసింది.

/ వ్యాసకర్త : ఎ.పి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి /
కె.ఉమామహేశ్వరరావు

కె.ఉమామహేశ్వరరావు