
న్యూఢిల్లీ : కీలకమైన బిల్లులను ఆమోదించకుంఆ వాయిదా వేస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్ర గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గవర్నర్లు కొంచమైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా వ్యాఖ్యానించింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన పంజాబ్, తమిళనాడు, కేరళ మరియు తెలంగాణలు న్యాయపరమైన జోక్యం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
''ఇది మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన తీవ్రమైన అంశం. గవర్నర్లు విధులు నిర్వరించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించాలి. మనది ప్రజాస్వామ్య దేశం. ఇవి గవర్నర్లు, ముఖ్యమంత్రులు పరిష్కరించుకోవాల్సిన అంశాలు'' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. '' గవర్నర్లకు ఆత్మపరిశీలన అవసరం. వారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల కాదన్న విషయాన్ని గ్రహించాలి. గవర్నర్ రాజ్యాంగానికి లోబడి ఉండేలా చూస్తాము'' అని ధర్మాసనం పేర్కొంది.
ఆర్థిక, రాష్ట్ర అనుబంధ కళాశాలలు సహా ఏడు కీలక బిల్లులను ఆమోదించడంలో జాప్యంపై పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.