
ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్ చేసే ప్రసంగం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగం అనే విషయం భారత రాజ్యాంగ వ్యవస్థ గురించి ఎరిగిన వారెవరికైనా తెలిసిన విషయమే. ఆ ప్రసంగంలో గవర్నర్ వ్యక్తిగతమైన అంశాలకు తావులేకుండా కేవలం ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి. ఆ ప్రసంగానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందిగానీ, గవర్నర్ బాధ్యత వహించరు. గవర్నర్ తన స్వంతంగా ఒక్క పదాన్ని కూడా మార్చకూడదు. కాబట్టి, ప్రసంగ పాఠంలోని కొన్ని భాగాలను ఉద్దేశ్యపూర్వకంగానే చదవకుండా గవర్నర్ ఆర్టికల్ 176కు విరుద్ధంగా వ్యవహరించారు.
ఈనెల 9వ తేదీన తమిళనాడు అసెంబ్లీలో శాసనసభ్యులను ఉద్దేశించి సాంప్రదాయంగా చేయాల్సిన తన మొదటి ప్రసంగ పాఠంలో గవర్నర్ ముఖ్యమైన, రాజ్యాంగ ప్రాధాన్యతగల ఒక పేరాను చదవకుండా దాటేయడంతో వివాదం చెలరేగింది. ఆ పేరా తమిళనాడులో రాజకీయ, సాంస్కృతిక ప్రాధాన్యతగల ద్రవిడ నమూనా పాలనను సూచించింది. ప్రస్తుత గవర్నర్‌కు, ద్రవిడ నమూనా పాలన లేదా రాజకీయ లేదా దాని గత సాంస్కృతిక భావనకు ఎలాంటి భావోద్వేగపూరితమైన సంబంధం లేదు. అది ఆయన ఉపన్యాసాలు, పరిశీలనల ద్వారా స్పష్టంగా అర్థవుతుంది. ఇక్కడ సమస్య, ఒక ప్రత్యేకమైన రాజకీయ భావజాలం లేదా సాంస్కృతిక సాంప్రదాయం పట్ల గవర్నర్ ఇష్టాయిష్టాల గురించి కాదు కానీ...రాజ్యాంగ అధికారం తన రాజ్యాంగ సంబంధిత బాధ్యతల్ని నిర్వర్తించే క్రమంలో బాగా స్థిరపడిపోయిన, తప్పనిసరిగా పాటించాల్సిన రాజ్యాంగబద్ధమైన ఆచరణలను ఉల్లంఘిస్తుందా అన్నదే సమస్య.
పూర్తి ప్రసంగం...
రాజ్యాంగం లోని ఆర్టికల్ 176 ప్రకారం, ప్రతి సంవత్సరం శాసనసభ మొదటి సమావేశాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులను ఉద్దేశించి గవర్నర్ తప్పకుండా ప్రసంగించి, సమావేశ పిలుపునకు గల కారణాలను వారికి తెలియజేయాలి. ఈ ప్రసంగంలో సూచించబడిన అంశాలను శాసనసభ చర్చించాలని రెండవ నిబంధన చెపుతుంది. ఇక్కడ ''ప్రసంగం'' అంటే పూర్తి ప్రసంగం. దాటవేయగా పోను మిగిలిన భాగం కాదు. అందువలన, శాసనసభ్యుల ముందు గవర్నర్ చదివేదే పూర్తి ప్రసంగం. దానిలో పేర్కొన్న అంశాలు మొత్తం సభలో సభ్యులందరూ తప్పకుండా చర్చించాలి.
ఇక్కడ, గవర్నర్ ప్రసంగంలోని అంశాలు మొత్తం చర్చించడానికి తగిన సమయం కలిగి ఉండే విధంగా మన రాజ్యాంగం శాసనసభకు నిర్దిష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఆర్టికల్ 176 ప్రకారం, గవర్నర్ ప్రసంగం కాకుండా వేరే ఇతర నిర్దిష్టమైన అంశాలను చర్చించడానికి అవసరమైన సమయం కోసం నిబంధనలు రూపొందించాలని రాజ్యాంగం ఎక్కడా చెప్పకపోయిన అంశం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. గవర్నర్ ప్రసంగానికి ఉండే అలాంటి ప్రాధాన్యతను రాజ్యాంగం నొక్కి చెప్తుంది.
గవర్నర్ శాసనసభను ఉద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభ్యులు హాజరు కావాలని కోరవచ్చని చెప్పే ఆర్టికల్ 175ను పరిగణ లోకి తీసుకుంటే మనకు ఇంకా స్పష్టమవుతుంది. ఆర్టికల్ 175 ప్రకారం తన ప్రసంగానికి హాజరు కావాలని గవర్నర్ కోరే అంశం, ఆర్టికల్ 176 వలె సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అంశం కాదు. ఆర్టికల్ 175 ప్రసంగం లోని అంశాలను చర్చించాల్సిన అవసరం లేదు కానీ, ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్ చేసిన ప్రసంగంలోని అంశాలపై ఖచ్చితంగా సభలో చర్చ జరగాలి. ఒకే రాజ్యాంగం ప్రకారం జరిగే రెండు ప్రసంగాల మధ్య ఉండే తేడాను మన రాజ్యాంగం కలిగి ఉండడం వెనుక ఉన్న కారణం ఏమంటే ఆర్టికల్ 176 ప్రకారం చేసే ప్రసంగంలో శాసనసభకు జవాబుదారీగా ఉండే ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, దాని కార్యక్రమాల గురించి ఉంటాయి. ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులకు కార్యనిర్వాహక వర్గం జవాబుదారీగా ఉండడం అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ముఖ్య సారం.
కాబట్టి, ప్రతి సంవత్సరం జరిగే శాసనసభ మొదటి సమావేశంలో శాసన సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తప్పకుండా చేసే ప్రసంగం ద్వారా ప్రభుత్వం, ఆ సంవత్సరం తలపెట్టే ప్రధానమైన శాసనసభా కార్యక్రమాలు, గత సంవత్సరం తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాల రూపురేఖల వివరాలను తెలియజేస్తుంది. ప్రభుత్వం తన కార్యక్రమాలు, విధానాలను గవర్నర్ ద్వారా శాసనసభకు తెలియజేస్తుంది. ఆ విధంగా ఆర్టికల్ 176 అంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.
గవర్నర్ ప్రసంగానికి రాజ్యాంగం అంతటి ప్రాధాన్యత ఇస్తుంటే గవర్నర్ దానిని తిరస్కరిస్తూ...ప్రసంగ పాఠంలోని కొన్ని భాగాలను చదవకుండా దాటేసి, తన స్వంత అభిప్రాయాలను జోడించవచ్చా?
ప్రసంగంలోని పేరాలను దాటేయడం అంటే గవర్నర్ ప్రభుత్వ ఆలోచనలను, భావనలను ఆమోదించడం లేదని అర్థం. ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్ చేసే ప్రసంగం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగం అనే విషయం భారత రాజ్యాంగ వ్యవస్థ గురించి ఎరిగిన వారెవరికైనా తెలిసిన విషయమే. ఆ ప్రసంగంలో గవర్నర్ వ్యక్తిగతమైన అంశాలకు తావులేకుండా కేవలం పభుత్వ విధానాలు, కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి. ఆ ప్రసంగానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందిగానీ, గవర్నర్ బాధ్యత వహించరు. గవర్నర్ తన స్వంతంగా ఒక్క పదాన్ని కూడా మార్చకూడదు. కాబట్టి, ప్రసంగ పాఠంలోని కొన్ని భాగాలను ఉద్దేశ్యపూర్వకంగానే చదవకుండా గవర్నర్ ఆర్టికల్ 176కు విరుద్ధంగా వ్యవహరించారు. శాసనసభ్యులు సృష్టించే అలజడి, గందరగోళం కారణంగా గవర్నర్ ప్రసంగ పాఠాన్ని పూర్తిగా చదవలేక పోవడం వేరు. ప్రసంగంలో పేర్కొన్న అంశాలను విభేదించి, తన వ్యక్తిగత అభిప్రాయాలను చేర్చేందుకు రాజ్యాంగం గవర్నర్‌ను అనుమతించదు కాబట్టి ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలను ఉద్దేశ్యపూర్వకంగా దాటేయకూడదు.
కొన్ని ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో గవర్నర్ల చర్యలు తరచుగా విమర్శలకు గురవుతున్నాయి. రాష్ట్ర శాసనసభ తీర్మానించిన బిల్లును ఎటూ తేల్చకుండా తొక్కి పట్టడం, రాజ్యాంగం కల్పించిన ఎంపికల (ఆప్షన్స్)పై ఎలాంటి కసరత్తు చేయకపోవడం, మొత్తం శాసనసభ కసరత్తును నిలిపివేయడం అనేది రాజ్యాంగ ఉల్లంఘనే అని స్పష్టం అవుతుంది. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను తొక్కిపట్టే అనుమతిని రాజ్యాంగం గవర్నర్‌కు కల్పించలేదు. బిల్లుల ఆమోదం కోసం గవర్నర్లకు ఎలాంటి కాలపరిమితిని నిర్దేశించకపోవడం వల్ల ఆర్టికల్ 200లో ఉన్న ఏ ఎంపికలను పరిగణలోకి తీసుకోకుండా బిల్లును తొక్కి పట్టవచ్చనే భావనలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది రాజ్యాంగ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుంది. ఆర్టికల్ 200 ప్రకారం, గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలుపవచ్చు. లేదా ఆమోదాన్ని నిలిపివేయవచ్చు. లేదా బిల్లును వెనక్కి తిప్పి పంపవచ్చు. తిప్పి పంపించబడిన బిల్లును ఎలాంటి మార్పులు చేయకుండా మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేస్తే గవర్నర్ ఆ బిల్లును ఆమోదాంచాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం కూడా పంపవచ్చు. ఆ విధంగా, గవర్నర్ బిల్లులను తొక్కిపట్టి, అసెంబ్లీ చేసే శాసనాల కసరత్తును నిలిపివేయకూడదని ఆర్టికల్ 200 స్పష్టంగా తెలియజేస్తుంది. బ్రిటన్‌లో పార్లమెంటు తీర్మానించిన బిల్లుల ఆమోదాన్ని నిలిపి ఉంచడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య.
ఇప్పుడొక బహిరంగ సవాల్ ...
రాజ్యాంగ స్థానాలను ప్రశ్నించడానికి, సవాల్ చేయడానికి చేసిన ప్రయత్నాల కారణంగానే ఈ సమస్యలన్నీ ఉత్పన్నం అవుతున్నాయి. గవర్నర్లు అకస్మాత్తుగా ముఖ్యమంత్రులను, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం మొదలుపెట్టారు. కొందరు గవర్నర్లు ఆఖరికి ముఖ్యమంత్రులపై దాడి చేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్‌లు కూడా నిర్వహిస్తున్నారు. గవర్నర్లకు సంబంధించిన అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం అవుతుంది. ఏ నిర్ణయాలు చేయక రాజ్‌భవన్ లలో బిల్లులు కుప్పలు కుప్పలుగా పేరుకొని పోతున్నాయి. షంషేర్ సింగ్ (1974) నుండి నబమ్ రిబియా (2016) వరకు, గవర్నర్లు కేవలం మంత్రిమండలి సలహా సంప్రదింపులపై మాత్రమే తమ బాధ్యతలు నిర్వహించాలని, ఎన్నికైన ప్రభుత్వాన్ని లక్ష్యపెట్టకుండా స్వతంత్రంగా ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలను చెలాయించలేరని సుప్రీంకోర్టు పేర్కొంది. ''...ఇలా నియమించబడిన వ్యక్తి రాష్ట్ర శాసనసభలను ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధులపై, ముఖ్యమంత్రి నాయకత్వం వహించే మంత్రి మండలి కింద పని చేసే ప్రభుత్వ కార్యనిర్వాహక వర్గంపై అధికారాన్ని చెలాయించ కూడద''ని నబమ్ రిబియా కేసులో కోర్టు పేర్కొంది. మనం అనుకుంటున్న విధంగా, రాజ్యాంగం సూత్రబద్దంగానే ఉండాలని భావిస్తే... పూర్తిగా రాజ్యాంగబద్ధమైన గవర్నర్‌గా రాష్ట్రాల పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకునే ఎలాంటి అధికారం లేదని బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్‌లో అన్నారు. మంత్రి మండలి సలహాకు వ్యతిరేకంగా వెళ్లేవిధంగా గవర్నర్లను అనుమతించడం ద్వారా రాష్ట్రంలో ఒక సమాంతర పాలనను సమకూర్చే లక్ష్యం మన రాజ్యాంగానికి లేదని-షంషేర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మన వ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడాలనుకుంటే ఇలాంటి వివేకవంతమైన వ్యాఖ్యానాలను ఆలకించాలి. రాజ్యాంగ అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా హద్దులు దాటి, వ్యవస్థను దెబ్బ తీయాలని అనుకుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.
(వ్యాసకర్త : లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్)
(''ద హిందూ'' సౌజన్యంతో)
పి.డి.టి. ఆచారి