Jul 26,2022 06:54

తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం జీవో 350 ప్రకారం ఆలస్యమైనందుకు అదనంగా పరిహారం పెంచి ఇవ్వాలి. అంతేకాకుండా 2019 ఎన్నికల ముందు వైసిపి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్యాకేజితో పాటు మరో రూ.5 లక్షలు అదనంగా ఇస్తామని జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. కాని నేటికీ నెరవేరలేదు. తక్షణమే ప్రతి మండలంలో ప్రత్యేక బృందాలను నియమించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలి. అప్పటి వరకు కుటుంబానికి రూ.10 వేలు నగదు, 3 నెలల పాటు ఆహార దినుసులు, పంట వేసి మునిగిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం, పడిపోయిన ఇళ్ళకు పక్కా గృహాలు, దెబ్బతిన్న ఇళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి.

గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు మునిగిపోయి...వేలాది గిరిజన కుటుంబాలు సర్వం కోల్పోయాయి. తినడానికి తిండి లేక, చుట్టూ సముద్రాన్ని తలపించేలా నీరున్నా తాగడానికి గుక్కెడు మంచి నీళ్లు లేవు. పసి పిల్లలకు పాలు లేక అరణ్య రోదన చేస్తున్నారు. 14 రోజులుగా కరెంటు లేక చీకటిలో అడవి మృగాలు, విషపురుగులతో కలిసి జీవనం కొనసాగిస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన గిరిజనులు, ఇతర పేదలను కాపాడాల్సింది పోయి... నిలువునా గిరిజనులను గోదాట్లో ముంచారు. జాతీయ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మాదే అని నిధులు ఇవ్వకుండా రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బిజెపి ప్రభుత్వాన్ని వదిలేసి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
      గోదావరికి ఇప్పుడు వచ్చిన వరదల కంటే 1986లో వచ్చిన వరదే పెద్దది. ఆనాడు భద్రాచలం దగ్గర 75.6 అడుగులు ఎత్తులో నీరు ప్రవహించినా ఇంత భారీ నష్టం జరగలేదు. కాని ఇప్పుడు వచ్చిన వరద 71.5 అడుగులే. అయినా వందలాది గ్రామాలు మునిగి, వేలాది కుటుంబాలు భారీ ఎత్తున నష్టపోయాయి. వందల ఇళ్ళు కూలిపోయాయి. వేలాది పశువులు గల్లంతయ్యాయి. ఏడు (ఎటపాక, కూనవరం, చింతూరు, వి.ఆర్‌.పురం, దేవిపట్నం, వేలేరుపాడు, కుక్కునూరు) మండలాల్లో సుమారు 193 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. జులై 11న వరదలు ప్రారంభమైతే 13 నాటికి అన్ని గ్రామాలు మునిగిపోయాయి. ఈ మండలాలకు పూర్తిగా రోడ్డు మార్గం తెగిపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా రద్దయ్యింది. 11వ తేదీ నుండి పూర్తిగా విద్యుత్‌ సౌకర్యం ఆగిపోయింది. పేదలు రాత్రి వేళలో చీకటిలోనే విష పురుగులు, దోమలతో సహవాసం చేస్తున్నారు. ఇప్పటికీ ఏజెన్సీలో సరైన వైద్య సదుపాయాలు లేక అనేకమంది చనిపోతున్నారు. ప్రాథమిక వైద్య కేంద్రాలు మునిగిపోయాయి.
     ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి ఉంటే ఈ నష్టం జరిగేది కాదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు విమర్శిస్తుంటే మరో పక్క దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని సహాయం మేం చేశాం కాబట్టే ప్రాణ నష్టం భారీగా జరగకుండా కాపాడగలిగామని వైసిపి చెబుతోంది. ఈ ప్రాజెక్టు వల్ల ఏడు మండలాలు సుమారు 276 గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. వీరికి పునరావాసం కల్పించి అక్కడి నుండి తరలించాలంటే నేడు సుమారు రూ.33 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్టుకు 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరించాలి. కాని కేంద్ర బిజెపి ప్రభుత్వం పోలవరానికి నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నది. ఆనాడు ఉన్న తెలుగుదేశం, ఇప్పుడున్న వైసిపి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా, నిధులు రాబట్టకుండా...తమకున్న బలహీనతల వల్ల బిజెపి ప్రభుత్వానికి భయపడి నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా గాలికొదిలేశాయి. గతంలో పాలించిన, నేడు పాలిస్తున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుండి నిధులు రాబట్టకుండా అమాయకులైన అడవి బిడ్డలను గోదాట్లో ముంచే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగమే నేడు సుమారు 193 గ్రామాలు మునిగిపోవడం.
      పోలవరం నిర్వాసితులకు పూర్తి పరిహారం ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. నేను (వ్యాస రచయిత) ఈ నెల 18 నుండి 22 తేదీ వరకు ముంపు ప్రాంతాలు ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను. ప్రభుత్వ అంచనాల ప్రకారం మొదటి కాంటూరు దగ్గర కూనవరం మండలంలో బొజ్జరాయిగూడెం మాత్రమే మునిగిపోతుందని అంచనా వేశారు. కాని కూనవరం మండలంలో 64 గ్రామాలకు గాను 58 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. గోదావరికి 33,96,363 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా కేవలం 98 గ్రామాలు మాత్రమే మునిగిపోతాయని ప్రభుత్వ నివేదికలో చెప్పారు. కాని ఈసారి గోదావరికి 23 లక్షల క్యూసెక్కులు మాత్రమే నీరు వచ్చాయని చెబుతున్నారు. ఈ లెక్కన ఏ ఒక్క గ్రామం మునిగి పోరాదు. 7 మండలాల్లో కూనవరం, వి.ఆర్‌.పురం, దేవిపట్నం పూర్తిగాను, మిగిలిన మండలాలు సగానికి పైగాను మునిగిపోయాయి. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వ లెక్కలకి, క్షేత్ర స్థాయిలో వాస్తవాలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు ఈ సమయంలో పై ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరికి మాత్రమే వరద వచ్చింది. శబరి నదికి భారీగా వరద రాలేదు. దీని వల్ల కొన్ని గ్రామాలు మాత్రమే మునిగాయి. గోదావరి లాగా శబరికి వరద వచ్చి ఉంటే పాత భద్రాచలం డివిజన్‌ మొత్తం సర్వనాశనం అయ్యుండేది.
      రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లేె తక్కువ ప్రాణ నష్టంతో బయటపడ్డామని చెబుతోంది. మంచిదే! కాని ఈనెల 11 రాత్రికే వరదలు ప్రారంభమయ్యాయి. వైసిపి ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ బలిష్టంగా ఉందని చెబుతుంది. కాని గోదావరి వరదలు వస్తున్న విషయం 48 గంటల ముందే తెలిసినా ముంపు గ్రామాల ప్రజలకు సమాచారం లేదు. గోదావరి పొంగి గ్రామాల మీద పడేవరకు ప్రజలకు తెలియదు. కట్టు బట్టలతో బతుకు జీవుడా అంటూ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు. ప్రభుత్వం పేదలను హెచ్చరించడానికి ఒక్క మైక్‌ ప్రచారం లేదు. వాహనాల ఏర్పాట్లు లేవు. చివరకు మునిగిపోయిన గ్రామాల ప్రజలను రక్షించడానికి కనీసం రెండు బోట్లు కూడా ఏర్పాటు చేయలేదు. గ్రామాలు మునిగిపోయినా ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌తో ఏరియల్‌ సర్వే చేశారు తప్ప గిరిజన ప్రాంతాలకు ఒక్క ప్రజా ప్రతినిధి రాలేదు. కనీసం ముంపు గ్రామాలకు బోట్లలో వెళ్ళి భోజనం సదుపాయం కల్పించలేదు. ఈ సమయంలో సిపియం, వామపక్ష కార్యకర్తలు, ప్రజా సంఘాలు మినహా ఎవ్వరూ వరద ప్రాంతాల్లో కనీసం పేదలకు ధైర్యం చెప్పేవారు కూడా లేరు. వరదల వల్ల అనేక గ్రామాలలో 200 నుండి 300 పశువులు కోట్టుకుపోయాయి. పేదల ఇళ్ళు కూలిపోయాయి. వస్తువులన్ని మునిగి పనికి రాకుండా పోయాయి. ఉదాహరణకు రేగులపాడు గ్రామంలో రైతు వెంకటేశ్వరరావుకు సంబంధించిన రెండు ట్రాక్టర్లు, 15 క్వింటాళ్ళ వరి ధాన్యం, 4 ఆయిల్‌ ఇంజన్లు, 15 బస్తాల మినుములు, లక్ష విలువ చేసే సామానులు మొత్తం కలిపి 10 లక్షలు నష్టం జరిగిందని చెప్పాడు. ఈ లెక్కన నష్టం అంచనా వేస్తే ప్రతి మండలంలో సుమారు రూ.300 కోట్ల నుండి రూ.500 కోట్లు జరిగినట్లు ప్రజలు చెబుతున్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి రూ.2 వేలు, బియ్యం, పప్పు, ఉప్పు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. ఇదికాదు నిర్వాసితులకు కావాల్సింది. శాశ్వత పరిష్కారం కావాలి.
     తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం జీవో 350 ప్రకారం ఆలస్యమైనందుకు అదనంగా పరిహారం పెంచి ఇవ్వాలి. అంతేకాకుండా 2019 ఎన్నికల ముందు వైసిపి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్యాకేజితో పాటు మరో రూ.5 లక్షలు అదనంగా ఇస్తామని జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. కాని నేటికీ నెరవేరలేదు. తక్షణమే ప్రతి మండలంలో ప్రత్యేక బృందాలను నియమించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలి. అప్పటి వరకు కుటుంబానికి రూ.10 వేలు నగదు, 3 నెలల పాటు ఆహార దినుసులు, పంట వేసి మునిగిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం, పడిపోయిన ఇళ్ళకు పక్కా గృహాలు, దెబ్బతిన్న ఇళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల్ని కలుపుకొని...పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం నిధులివ్వకుండా ద్రోహం చేస్తున్న బిజెపి పై ఒత్తిడి పెంచి నిధులు రాబట్టాలి. తక్షణమే నిర్వాసితులకు పూర్తిగా పరిహారం చెల్లించి ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తేనే రాష్ట్రానికి, నిర్వాసితులకు న్యాయం చేసినవారమవుతాం.

/ వ్యాసకర్త : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెల్‌ : 94900 98980 /
వి. వెంకటేశ్వర్లు

వి. వెంకటేశ్వర్లు