Oct 21,2022 07:13

ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్‌, అమెరికా దేశాల నుండి వంటనూనెల ఉత్పత్తులు మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వంట నూనెల స్వయంసమృద్ధి సాధించాలంటే పామాయిల్‌ వంటి పంటల సాగు చేస్తున్న రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాల్సి ఉంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా టన్ను గెలలకు రూ.18 వేలు ధర అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.

పామాయిల్‌ గెలల ధర ప్రతి నెలా తగ్గించి వేస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలలో టన్ను గెలల ధర రూ.23,365 ఉంటే సెప్టెంబర్‌లో రూ.13,058కి పడిపోయింది. రూ.10,307 తగ్గించివేశారు. మే నెలలో పామాయిల్‌ గెలల ధర పెరగడంతో ఆనందంగా ఉన్న రైతులకు నేడు కన్నీరు వస్తోంది. గెలల సేకరణ ధర పెరగడంతో కౌలు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో ఎకరాకు రూ.50 వేలు నుండి రూ.60 వేలు కౌలు రేట్లు ఉంటే ప్రస్తుతం రూ. లక్ష నుండి రూ.లక్షా 20 వేలుకు పెరిగాయి. గెలల సేకరణ ధర మరింత తగ్గుతున్నట్లు అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యాలు చెబుతున్నాయి. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి చందంగానే పామాయిల్‌ రైతుల పరిస్థితి ఉంది. వంట నూనె ధరలు పెరిగిపోతున్నాయి. రైతుల నుండి పామాయిల్‌ గెలల సేకరణ తగ్గించి వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న లక్షా 50 వేల మంది పామాయిల్‌ రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌ రైతుల గోడు పట్టించుకోవడం లేదు.
            పామాయిల్‌ సాగు విస్తీర్ణం రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో పామాయిల్‌ తోటలు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దిగుబడి 17.22 లక్షల టన్నులు కాగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 21 లక్షల దిగుబడి అంచనా వేశారు. రాష్ట్రంలో గంటకు 450 టన్నుల ఆయిల్‌ తీసే సామర్థ్యం కలిగిన కంపెనీలు 13 ఉన్నాయి. పెరుగుతున్న విస్తీర్ణాలకు అనుగుణంగా పామాయిల్‌ ప్రాసెసింగ్‌ కంపెనీల సామర్థ్యం పెరగడం లేదు. కొత్తగా ఫ్యాక్టరీల నిర్మాణం జరగడం లేదు. ఏలూరు జిల్లా పెదవేగిలో ఉన్న ఏకైక ఆంధ్రప్రదేశ్‌ ఆయిల్‌ ఫెడ్‌ కర్మాగారాన్ని ఆధునీకరించడం లేదు. మిషన్‌ పామాయిల్‌ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.11,040 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. అయినా పామాయిల్‌ రైతులకు ప్రభుత్వాల నుండి ప్రోత్సాహం లేదు. గతంలో పామాయిల్‌ గెలలకు సరైన ధర లేకపోవడం వలన పెంచిన చేతులతోనే రైతులు తోటలు తొలగించేవారు. ప్రస్తుతం ఇతర పంటలలో తగిన ఆదాయం లేక నష్టాలు వస్తున్న క్రమంలో...స్థిరమైన ఆదాయం ఉంటుందని మరలా పామాయిల్‌ సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. రైతుల అవసరాల మేరకు మొక్కలను అందించేందుకు తగిన ప్రణాళికలు, చర్యలు లేవు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఆయిల్‌ ఫెడ్‌ నిర్ణయించిన ఆయిల్‌ రికవరీ శాతానికి తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ నిర్ణయించిన ఆయిల్‌ రికవరీ శాతానికి 2 శాతం వ్యత్యాసం ఉండడంతో ఐదు సంవత్సరాల పాటు మన రాష్ట్ర రైతులు నష్టపోయారు. ఆ నేపథ్యంలో పామాయిల్‌ రైతుల ఆందోళనల మేరకు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తెలంగాణతో సమానంగా ధర ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 19.22 ఆయిల్‌ రికవరీని నిర్ణయిస్తూ జీవో జారీ చేసింది. అయినా ప్రతి నెల తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌ కు ధరలలో వ్యత్యాసం ఉంటున్నది. తెలంగాణలో ఆయిల్‌ ఫెడ్‌ ప్రతి నెలా మొదటి వారంలోనే ఆ నెల ధర ప్రకటిస్తూ అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం నెల ఆఖరున ధర ప్రకటిస్తున్నది. ధర ముందుగా నిర్ణయించకపోవడం వలన ఏ ధర ఉంటుందో రైతులకు అర్థం కావడం లేదు. తెలంగాణ మాదిరిగా నెల మొదటిలోనే ధర నిర్ణయించాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఆయిల్‌ ఫెడ్‌ పెదవేగి కర్మాగారాన్ని ఆధునీకరిస్తామని రైతులకు మేలు చేస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదు.
        గెలల సేకరణలో ప్రైవేటు పామాయిల్‌ కంపెనీల మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఫ్యాక్టరీల పరిధిలో ఉన్న రైతుల నుండి గెలలు సేకరించకుండా ఇతర ప్రాంతాలు, జిల్లాల నుండి తమ జోన్‌ పరిధి దాటి గెలలు సేకరిస్తున్నారు. తమ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న కాటాలను మూసివేస్తున్నారు. తోటల్లో పక్వానికి వచ్చిన గెలల నరికివేత ఆగిపోవడంతో ఫ్రూట్‌ రాలిపోయి రైతులు నష్టపోతున్నారు. రాలిపోయిన ఫ్రూట్‌ సేకరణకు అదనంగా కూలీ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. పక్వానికి వచ్చిన ఫ్రూట్‌ మాత్రమే సేకరణ పేరుతో, కాటాలు వద్ద గెలలు ఏరివేత పేరుతో రైతులను ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గతంలో లేని కొత్త నిబంధనలు తీసుకువచ్చి రైతులకు నష్టాలను కలిగిస్తున్నాయి. ప్రైవేట్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీల ఇష్టారాజ్యంగా తయారైంది. రైతులు మాత్రం ఫ్యాక్టరీ జోన్‌ పరిధి దాటి గెలలు అమ్ముకోవడానికి ఫ్యాక్టరీ యాజమాన్యాలు అభ్యంతరం చెబుతున్నాయి. గతంలో కొన్ని ఫ్యాక్టరీ యాజమాన్యాలు రైతులపై పోలీసు కేసులు కూడా బనాయించాయి. తమ ఫ్యాక్టరీ సిబ్బందితో పామాయిల్‌ గెలలు తీసుకెళుతున్న రైతుల వాహనాలను అడ్డుకున్నారు. తమ సమస్యలు పట్టించుకోకపోవడంతో ఇటీవల ఏలూరు జిల్లా పరిధిలోని చింతలపూడి మండలం చింతంపల్లి గోద్రెజ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ దగ్గర, జంగారెడ్డిగూడెం లోని నవభారత్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. అయినా ఫ్యాక్టరీ యాజమాన్యాలు రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్‌ కంపెనీల మోసాలపై ప్రభుత్వాల జోక్యం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. ఎప్పుడైనా రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే అప్పుడు మాత్రమే ఫ్యాక్టరీ యాజమాన్యాలు, రైతులతో జాయింట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఆ సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు ఉండడం లేదు. ఉద్యాన శాఖ అధికారులకు రైతులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా 'యాజమాన్యాలు మా మాట వినడం లేద'ంటూ చేతులెత్తేస్తున్నారు.
           మరోవైపు ప్రభుత్వాలు వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యాలు నిర్దేశిస్తుంటాయి. ఆ లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణ ఉండడం లేదు. ఏటా రూ.70 వేల కోట్ల విలువ విలువ గలిగిన వంట నూనె ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాము. ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్‌, అమెరికా దేశాల నుండి వంటనూనెల ఉత్పత్తులు మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వంట నూనెల స్వయంసమృద్ధి సాధించాలంటే పామాయిల్‌ వంటి పంటల సాగు చేస్తున్న రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాల్సి ఉంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా టన్ను గెలలకు రూ.18 వేలు ధర అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో మాదిరిగా పామాయిల్‌ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందించాలి. పెరుగుతున్న పామాయిల్‌ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా కొత్తగా కర్మాగారాలు నిర్మాణం చేయాలి.

/వ్యాసకర్త: ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం
ఏలూరు జిల్లా కార్యదర్శి, సెల్‌ :9490098574/
కె.శ్రీనివాస్‌

కె.శ్రీనివాస్‌