
మొఘలులంటే, ముస్లింలంటే మండి పడే ఆరెస్సెస్-బిజెపిలు, తక్షణం గుజరాత్ పేరు మార్చుకోవాలి కదా? ఎందుకంటే, ఆ ప్రాంతాన్ని గుర్తించి, దానికి ఆ పేరు పెట్టినవాడు అక్బర్ చక్రవర్తి. ఆ ప్రాంతంలో ఉన్న గుర్జర్ల-గుజ్జర్ల జనాభాకు ప్రాధాన్యమిచ్చి ఆ పేరుకు రూపకల్పన చేయడమే కాకుండా, దాన్ని ఒక ప్రత్యేక పరగణాగా కూడా ప్రకటించాడు. హిందూ రాజులు ఆ నాటి మొఘల్ చక్రవర్తులతో సత్సంబంధాలు నెలకొల్పుకుని, తమ ఆడబిడ్డల్ని వారికిచ్చి పెళ్లి చేయడానికి ఉత్సాహపడ్డవారే. గతాన్ని శాశ్వతంగా పాతి పెట్టడం ఏ ప్రభుత్వాల తరమూ కాదు. ప్రభుత్వాలు తాత్కాలికం! చరిత్ర శాశ్వతం!!
గుర్జర్లు లేదా గుజ్జర్లు నివసించే ప్రాంతమే గుజరాత్ అయ్యింది. పశుపాలన, వ్యవసాయం ఒకప్పుడు వీరి వృత్తి. గుర్జర్లు అనేది ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు. వివిధ మతాల వివిధ భాషల సమూహం. వీరిలో హిందువులు, ముస్లింలు, సిక్కులూ ఉన్నారు. వీరు గోజ్రి, గుజరాతి, హిందీ, కాశ్మీరీ, పంజాబి, ఉర్దూ, పాస్తో, హరియాణీ, సింధి, భోజ్‌పూరి, మరాఠీ, బెలూచి వంటి అనేక భాషలు మాట్లాడుతారు. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లోకి వ్యాపించారు. వీరిలో రాజపుత్రులు, జాట్‌లు, ఆహిర్లు, ఇండో ఆర్యన్లు కలగా పులగంగా ఉన్నారు. ఇప్పుడు రాజస్థాన్ ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు (సా.శ.570) గుర్జర్ల రాజ్యం ఉండేది. ఈ గుర్జర్ అనే పదం మొట్టమొదట బాణుడి హర్ష చరిత్ర (సా.శ.630)లో కనిపిస్తుంది హర్ష చక్రవర్తి కాలంలో భారత్‌లో పర్యటించిన చీనీ యాత్రికుల రచనల ప్రకారం ఆ రోజుల్లో ఆ ప్రాంతాన్ని 'బుద్ధదేశ్' అని పిలిచేవారు. కాలక్రమంలో అక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాధారణ శకం (సా.శ) ప్రారంభం నుంచే అక్కడ 'భిన్నత్వంలో ఏకత్వం' ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, ఇప్పుడేమిటీ ఈ గుజరాతీ దేశ నాయకులు భిన్నత్వాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారూ?
భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల జాబితా చూస్తే, మొదట మనకు తైమూర్ కనిపిస్తాడు. అతని కొడుకు బాబర్, బాబర్ కొడుకు హుమయూన్, హుమయూన్ కొడుకు-అక్బర్ ద గ్రేట్. అక్బర్ తర్వాత జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, బహద్దూర్ షా జాఫర్‌లు ఈ దేశాన్ని పరిపాలించారని చిన్నప్పుడు మనం చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం. రాబోయే తరాలు ఈ విషయాలు తెలుసుకోగలరో లేదో తెలియదు. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లోని విషయాలు మార్చేస్తోంది. అసలు మొఘలుల చరిత్రే ఎవరూ చదువుకోకూడదన్నది వారి ఉద్దేశం. గుజరాత్ వారు గతంలో కొన్ని శతాబ్దాల పాటు ముస్లిం పాలకుల ఏలుబడిలో ఉన్నారు. ముస్లిం పాలకులు వీరిని పీడించిన విషయం చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదు.
సరే, ఈ విషయాలు అలా ఉండనిచ్చి మొఘలుల వివరాల్లోకి వెళితే, ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అందరిలోకి అక్బర్-అక్బర్ ద గ్రేట్ అనిపించుకున్నాడు. ఎందుకంటే ఆయన పాటించిన పరమత సహనం, హిందూ రాజపుత్ర స్త్రీని వివాహమాడటం, హిందువుల ఆధ్యాత్మిక రచనలు ఉర్దూ లోకి అనువదింపజేసుకుని విషయాలు తెలుసుకోవడం - అలాగే భారతీయ సంస్కృతిలో భాగమైన 'భిన్నత్వంలో ఏకత్వాన్ని' కాపాడడానికి ఇతోధికంగా కృషి చేయడం - వంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
ఇక గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర చూద్దాం... గుజరాత్ జునాగఢ్ శిలాఫలకాల వల్ల - సా.శ. 4-5 శతాబ్దాలలో ఇది బౌద్ధుల రాజ్యం అని తేలింది. తర్వాత సా.శ. 8-9 శతాబ్దాల నాటికి అది గుర్జర ప్రతీహారుల పాలన కిందికి వచ్చింది. తర్వాత సోలంకి, వాఘేలా వంశపు రాజులు పాలిస్తూ వచ్చారు. 1299 సా.శ.లో ఢిల్లీ సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీ, అప్పటి వాఘేలా రాజును ఓడించి, గుజరాత్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుండి అంటే 13వ శతాబ్దం నుండి అది ముస్లింల పాలన కిందే ఉండిపోయింది. తర్వాత 1411లో అహ్మద్ షా అనే రాజు తన పేర అహ్మదాబాద్ నగరం ఏర్పాటు చేసుకుని, అక్కడి నుండి పాలించాడు. 16వ శతాబ్దం చివరి నాటికి ఆ ప్రాంతమంతా మొఘలుల ఆధీనంలోకి వచ్చింది. 18వ శతాబ్దపు మధ్యలో మరాఠీలు ఏదో కొద్దికాలం స్వాధీనం చేసుకున్నారు. కానీ, 1818 నాటికి గుజరాత్ ప్రాంతం బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గుజరాత్ ప్రావిన్స్‌ను బొంబాయి స్టేట్‌లో కలిపారు. 1956లో కచ్, సౌరాష్ట్రలు కూడా అందులో కలిశాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1960 మే 1న బొంబాయి స్టేట్ విడిపోయి గుజరాత్, మహారాష్ట్రలుగా ఏర్పడ్డాయి.
మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలిస్తున్న సమయంలో ఈ 'గుజరాత్' అనే పదం రూపుదిద్దుకుందని 'జహంగీర్ నామా'లో ఉంది. దీని హిందీ అనువాదం మున్షీదేవీ ప్రసాద్ కృత్ చేశారు. అందులోని 51వ పేజీలో పూర్తి వివరాలు ఉన్నాయి. జహంగీర్ చక్రవర్తి మాత్రమే కాదు, రచయిత కూడా! ఆయన తన ఆత్మకథను ''తుజుక్ ఎ-జహంగీరి'' పేరుతో రాసుకున్నాడు. అదే 'జహంగీర్ నామా'గా ప్రసిద్ధి పొందింది. దీని ఇంగ్లీష్ అనువాదం వీలర్ యం. తాక్‌స్టన్ చేశారు. జహంగీర్ నామాలో అక్బర్ ప్రసక్తి, ఆయన కట్టించిన కోట ప్రసక్తీ ఉన్నాయి. అక్బర్ ఒకసారి కాశ్మీర్‌కు ప్రయాణమైపోతూ మార్గమధ్యం లోచీనాబ్ నది ఒడ్డుకు వచ్చాడు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణానికి పరవశించిపోయి, అక్కడ ఒక ఖిల్లా (కోట) కట్టించుకుంటే బావుంటుందనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అక్కడ కోట కట్టించాడు. ఆ ప్రాంతంలో గుర్జర్ల / గుజ్జర్ల జనాభా అధికం కాబట్టి దాన్ని ఆయన గుజరాత్ అన్నాడు. కొన్ని శతాబ్దాలు గడిచిన తర్వాత, ఆ ప్రాంతంలో దారి దోపిళ్ళకు పాల్పడే వారిని 'గుజ్జర్లు' అనేవారు. అక్బర్ కట్టించిన ఆ కోట, పరిసర ప్రాంతాలు గుజ్జర్లు తల దాచుకోవడానికి పనికొచ్చింది. అయితే ఇండియా-పాకిస్తాన్‌ల విభజన సమయంలో ఆ కోటా ఆ పరిసర ప్రాంతాలూ పాకిస్తాన్‌లోకి వెళ్ళిపోయాయి. మిగిలిన గుజరాత్, భారత్‌లో మహారాష్ట్రలో కలిసి ఉండేది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విడిపోయినప్పుడు గుజరాత్- మహారాష్ట్ర విడిపోయాయి.
మొఘలులంటే, ముస్లింలంటే మండి పడే ఆరెస్సెస్-బిజెపిలు, తక్షణం గుజరాత్ పేరు మార్చుకోవాలి కదా? ఎందుకంటే, ఆ ప్రాంతాన్ని గుర్తించి, దానికి ఆ పేరు పెట్టినవాడు అక్బర్ చక్రవర్తి. ఆ ప్రాంతంలో ఉన్న గుర్జర్ల-గుజ్జర్ల జనాభాకు ప్రాధాన్యమిచ్చి ఆ పేరుకు రూపకల్పన చేయడమే కాకుండా, దాన్ని ఒక ప్రత్యేక పరగణాగా కూడా ప్రకటించాడు. హిందూ రాజులు ఆనాటి మొఘల్ చక్రవర్తులతో సత్సంబంధాలు నెలకొల్పుకుని, తమ ఆడబిడ్డల్ని వారికిచ్చి పెళ్లి చేయడానికి ఉత్సాహపడ్డవారే. గతాన్ని శాశ్వతంగా పాతి పెట్టడం ఏ ప్రభుత్వాల తరమూ కాదు. ప్రభుత్వాలు తాత్కాలికం! చరిత్ర శాశ్వతం!!
మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది - కుతంత్రా లకు, దోపిడీకి మరో పేరు గుజరాత్ అనేది రుజువైంది. ఇక్కడ లాలూప్రసాద్ యాదవ్ ప్రకటన పరిగణనలోకి తీసుకోవాలి. ఆయన అంటాడూ... ''అరవైయేళ్లుగా ఒక్క గాంధీ ఈ దేశం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకుని పారిపోలేదు. కానీ, ఎని మిది సంవత్సరాలలో ముగ్గురు గుజరాతీ మోడీలు ఈ దేశం నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకుని పారిపోయారు'' అని!!
గుర్జర్లు లేదా గుజ్జర్లు అంటే - విద్రోహ చర్యలకు పాల్పడే వారు-అని బ్రిటిష్ రచయితలు చరిత్రలో నమోదు చేశారు. బహుశా 1857 నాటి తిరుగుబాటులో వీరు చురుకుగా పాల్గొన్నందుకు ఆ పేరు అలా పడిపోయిందేమోనని అనుకుందాం. కానీ, వందేళ్ల తర్వాత కూడా గుజ్జర్‌లను 'క్రిమినల్ ట్రైబ్స్' అని ముద్ర వేశారు. కుట్రలు, కుతంత్రాలు, మోసపూరితమైన చర్యలకు పాల్పడే నేర ప్రవృత్తి గలవారు అని రాస్తూనే ఉన్నారు. గుజరాత్ నేపథ్యం గురించి, ఆ ప్రాంత వాసుల గురించి చరిత్రనంతా నేను తవ్వితీసింది ఇందుకే. గుజరాత్ పౌరులంతా మోసకారులని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఆ మాటకొస్తే మహాత్మా గాంధీ గుజరాత్ వాడే. మోసాలు చేసేవారిని మాత్రమే క్షమించరాదన్నది నా ఉద్దేశం. ఈ 'క్రిమినల్ ట్రైబ్స్'కు సంబంధించిన సమాచారం నెట్‌లో ఉంది. ఉత్సుకత గలవారు వెతికి చదువుకోవచ్చు. ఒకప్పటి బుద్ధదేశ్ తర్వాత కాలంలో గుర్జర్ దేశ్ అయ్యింది. ఇది ఇలాగే మోసకారుల నిలయంగా ఉండిపోవాలని ఈ దేశ ప్రజలు కోరుకోవడం లేదు. పరిస్థితులు మారి, మళ్ళీ మానవీయ విలువలతో కూడిన 'బుద్ధదేశ్' ఎందుకు కాకూడదూ? అని అనుకుంటున్నారు.
/ వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ /
డా|| దేవరాజు మహారాజు