Jul 07,2023 06:59

             రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2021-22 తరువాత ఏటా సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థుల చొప్పున తగ్గుతుండడం బాధాకరం. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగి 2021-22 విద్యాసంవత్సరంలో 45,60,041 మంది చదివారన్న విషయం ఆనాడు ఎంతో సంతోషం కలిగించింది. ఆ తరువాత కూడా అదే విధంగా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ పోతుందని పలువురు ఆశించారు. కానీ అందుకు భిన్నంగా 45,60,041గా ఉన్న విద్యార్థుల సంఖ్య 2022-23 నాటికి 39,96,064కు పడిపోగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇప్పటికి 36 లక్షలకు దిగజారిపోవడం నిరాశ కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు ద్వారా మౌలిక వసతులను కల్పించడంతోపాటు జగనన్న విద్యాకానుక పేరిట బూట్లు, బట్టలు, పుస్తకాలు అందిస్తోంది. స్మార్ట్‌ టివిలు అమర్చడంతోపాటు విద్యార్థులకు ట్యాబులు కూడా ఇస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. అయినా ప్రభుత్వ బడి కాదని వేలకు వేలు ఫీజులు కడుతూ పుస్తకాలు కొంటూ సామాన్యులు సైతం ప్రైవేటు బడి బాట పట్టడానికి కారణాలు కనుగొనడం అవసరం. అనంతరం సర్కారు దిద్దుబాటు చర్యలను చేపట్టాలి. ప్రజల్లో అపోహాలు ఉన్నట్టయితే వాటిని నివృత్తి చేయాలి. ఏది ఏమైనా ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావడం ఎంతో అవసరం. అందుకు విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ వృద్ధి కావడం ఒక కొలబద్దగా ఉంటుంది.
          రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల్లో విలీన ప్రక్రియ సర్కారు బడికి సమ్మెట పోటు వేసింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో కలపడంతో విలీన పాఠశాలల్లో 1, 2 తరగతుల విద్యార్థుల సంఖ్య 20లోపే ఉంది. ఆ పేరుతో ఆయా పాఠశాలలకు ఒక్క టీచర్‌నే కేటాయించింది. ఈ దెబ్బతో రాష్ట్రంలో సుమారు 14 వేల పాఠశాలలు సింగిల్‌ టీచర్‌ స్కూల్స్‌గా మారాయి. రేషనలైజేషన్‌ జిఓ 117 పేరుతో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రభుత్వం మార్చింది. ప్రాథమిక పాఠశాలల్లో సబ్జెక్టులను బట్టి కాకుండా విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను ఇస్తుంది. 20 మంది ఉంటే ఒక టీచర్‌, 60 మంది ఉంటే ఇద్దరు టీచర్లంటోంది. గతంలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను కేటాయించిన విద్యాశాఖ ఈ సారి సెక్షన్లు బట్టి కేటాయించింది. విద్యార్థుల సంఖ్య 98లోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలకు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను రద్దు చేసింది. ఇటువంటి చర్యల మూలంగా ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి, ఉన్నవారిపై పని భారం కుడా పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అంతేగాక పాఠాలు బోధించడంతోపాటు మధ్యాహ్న భోజనం పథకం నమోదు, జెవికె కిట్ల నమోదు, అనేక యాప్‌లలో నమోదు చేయడం వంటి బోధనేతర పనులను కూడా టీచర్లే చూసుకోవాల్సి వస్తోంది. విలీన ప్రక్రియ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడం లేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతుంటే ప్రభుత్వం మాత్రం పిల్లలు పుట్టే శాతం తగ్గుతోందని, అందుకే చేరే వారి సంఖ్య తగ్గుతోందని ఎదురు దాడి చేయడం తగదు.
         రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీషును ప్రోత్సహించడమే విద్యాభివృద్ధిగా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. అందుకోసం తెలుగు మాధ్యమాన్ని లేకుండా చేయాలని తొలుత చూసి, కోర్టులతో సహా పలు వైపులనుండి వ్యతిరేకత రావడంతో ఆ తరువాత సెకండ్‌ రేట్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చింది. పోనీ ఆ ఇంగ్లీషు భాషను గానీ మాధ్యమాన్ని గానీ పకడ్బందీగా బోధించేటువంటి చర్యలూ లేవు. ఇంకొకవైపు ఆన్‌లైన్‌, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్లంటూ హడావుడి చేస్తోంది. ఇంగ్లీషు భాషా బోధన లోనూ ఒకసారి బెండపూడి విధానం అనీ తాజాగా టోఫెల్‌ అంటూ ఊదర గొడుతోంది. సబ్జెక్టు టీచర్ల కొరత ఉండనే ఉంది. గత నాలుగెళ్లుగా డిఎస్‌సి రిక్రూట్‌మెంట్‌ లేదు. మొత్తంగా చూస్తే ప్రభుత్వం చేస్తూన్న మార్పుల మూలంగానే పాఠశాలల్లో టీచర్ల కొరత ఒకవైపు, బోధనా విధానాల్లో గందరగోళం మరోవైపు సర్కారు బడుల్లో ప్రధాన ఆటంకాలుగా మారిన పరిస్థితి ఏర్పడడం విచారకరం. ప్రభుత్వం వీటన్నిటినీ పరిశీలించి ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో, విద్యావేత్తలు, నిపుణులతో చర్చించి పాఠశాల విద్య గాడిన పడేందుకు, విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగేందుకు తగు చర్యలు చేపట్టాలి.