
మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత జాతీయోద్యమ స్ఫూర్తితో నిర్మించబడ్డ ఆర్థిక వ్యవస్థను విదేశీ, స్వదేశీ బడా పెట్టుబడిదార్ల చేతుల్లో పెట్టే విధానాలను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు అనేక రంగాల్లో గుత్తాధిపత్యంగా ఉండి దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా ఉన్న ప్రభుత్వరంగ సంస్ధలన్నింటినీ గుత్త పెట్టుబడిదార్లకు ధారాదత్తం చేస్తున్నారు. రాజ్యాంగంలో నిబిడీికృతంగా ఉన్న సామాజిక, మౌలిక, సంక్షేమ తాత్వికతను పూర్తిగా తుడిచివేస్తున్నారు. సంపద పున:పంపిణీ కాకుండా మరింత కేంద్రీకరణకు దారితీసేలా ప్రభుత్వం చర్యలకు వడిగట్టింది. ఈ చర్యలు దేశ సమైక్యత, సమగ్రతలకు తీవ్ర ప్రమాదం తీసుకు రాబోతున్నాయి.
వచ్చే ఇరవై ఐదేళ్ళలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఐదు ప్రతిజ్ఞలు చేయాలని దేశ ప్రధాని నరేరద్ర మోడీ 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట నుండి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ఐదు ఏంటంటే-అభివృద్ధి చెందిన దేశమే లక్ష్యం, వలసవాద ఆలోచనలను మనసు నుంచి తొలగించడం, మన మూలాలను చూసి గర్వించడం, ఐక్యత, పౌరుల్లో జవాబుదారీతనాన్ని-దేశం వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించుకునే సమయానికి సాధించాలని పిలుపునిచ్చారు.
వలసవాద వ్యతిరేక వ్యూహంలో భాగమే 75 ఏళ్ళ భారత ఆర్థిక వ్యవస్థ అనే వాస్తవాన్ని నరేంద్ర మోడీ విస్మరించి వలసవాద ఆలోచనలను తొలగించాలని కొత్త పల్లవి అందుకున్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్ధ యొక్క ప్రభుత్వ పెట్టుబడి మూలాలను దెబ్బ తీస్తూ మన మూలాలను చూసి గర్వించాలని ఉపదేశిస్తున్నారు. 75 ఏళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే నరేంద్ర మోడీ దేశాన్ని తిరిగి వలసవాదం వైపు నడిపిస్తున్నారో? లేదా జాతి గర్వించే మూలాల వైపు నడిపిస్తున్నారో ఆర్ధమౌతుంది.
స్వాతంత్య్రం వచ్చే నాటికి భారతదేశం పారిశ్రామికంగా అత్యంత బలహీనంగా ఉండేది. ఆనాటి ఆర్థిక వ్యవస్థపై బ్రిటీష్ పెట్టుబడితో పాటు సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడి ఆధిపత్యం చెలాయించేది. వ్యవసాయ రంగం ఫ్యూడల్, సెమీ ఫ్యూడల్ లక్షణాలతో సాంకేతిక, ఉత్పాదక పరంగా అత్యంత పురాతన స్థితిలో ఉండేది. నూటికి 70 మంది వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉండేవారు. దీంతో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 50 శాతం వాటా వ్యవసాయ రంగం కలిగి ఉండేవి. పారిశ్రామిక రంగం కేవలం 9.6 శాతం వాటా, మిగిలింది గనులు, ఇతర సేవా రంగాలు కలిగి వున్నాయి. మొత్తంగా చూస్తే భారతదేశ సంపద, సహజ వనరులు, ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలన్నీ బ్రిటీష్ వారితో పాటు సామ్రాజ్యవాదుల పెట్టుబడిలో ఇరుక్కుపోయాయి. ఈ రెండు పెట్టుబడులు దేశ అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారాయి.
ఈ స్థితిలో భారతదేశం స్వతంత్ర శక్తివంతమైన ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అభివృద్ధి ప్రజల ఆకాంక్షలు, ఆశలు తీర్చేలా, పెద్దయెత్తున ఉపాధి, ప్రజల ఆదాయాలు పెంచేలా ఉండాలని, అలాగే సృష్టించబడే ఉత్పత్తి, సంపద ప్రజల మధ్య సమ న్యాయ పద్ధతిలో పంపిణీ జరగాలని ప్రజలు ఆకాంక్షించారు.
ఇది జరగాలంటే దేశ సంపద, సహజ వనరులపై, దేశ ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక వ్యవస్థపై సామ్రాజ్యవాదుల పెట్టుబడులు అంతం చేయాలని భవించారు. దీనికి స్వతంత్ర భారత ప్రభుత్వం అన్ని రంగాల్లో పెద్ద యెత్తున పెట్టుబడులు పెడితేనే సాధ్యమౌతుందనే ఆలోచన చేశారు. ఈ సైద్ధాంతిక ఆలోచనతోనే దేశంలో ప్రభుత్వ రంగానికి పునాదులు ఏర్పడ్డాయి. అంటే సామ్రాజ్యవాదుల చేతుల్లో ఇరుక్కుపోయిన మన ఆర్థిక వ్యవస్థను విముక్తి చేసుకొని ప్రజలందరి ఉమ్మడి ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయని భావించాలి. అలాగే సాంకేతిక పరిజ్ఞానం కోసం విదేశీ బహుళ జాతి సంస్థలపై ఆధారపడే స్థితి లేకుండా అన్ని రంగాలు స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సామాజిక సేవలైన విద్య, వైద్యం, మంచి నీరు, విద్యుత్, పారిశుధ్యం వంటివి ప్రజలకు అత్యవసరమైనవి. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో 90 శాతం ప్రజలకు అందుబాటులో లేవు. విద్యుత్ అనేది అత్యంత ఖరీదైనది గాను, విలాసవంతమైనదిగా ఆనాడు వుంది. వీటిని ప్రజలందరికీ కల్పించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఉచితంగానో, సబ్సిడీగానో అతి తక్కువ ధరతోనో అందించాలని నిర్ణయించారు. అలాగే మౌలిక సదుపాయాల రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెట్టి దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలనే తలంపుతో వీటిని చేపట్టారు. వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించటానికి నీటి వనరుల కల్పనకు భారీ నీటి ప్రాజెక్టులు చేపట్టటం, ఎరువుల పరిశ్రమల స్థాపన, అధిక దిగుబడుల వంగడాల కోసం పరిశోధనా సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు.
ఆనాటి భారత బూర్జువా పాలక వర్గం ఈ సైద్ధాంతిక అవగాహనను వ్యతిరేకించలేదు. పైపెచ్చు వారి స్వప్రయోజనాల కోసం రాజ్యం యొక్క పాత్ర అన్ని రంగాలలో చురుగ్గా ఉండాలని బలపర్చారు. ఎందుకంటే ఆనాడు సామ్రాజ్యవాద పెట్టుబడికి ప్రత్యామ్నాయ స్థితిలో భారతదేశ ప్రైవేట్ పెట్టుబడి లేదు. వారి వద్ద భారీ పరిశ్రమలు నెలకొల్పేటంత పెట్టుబడులు లేవు. పైపెచ్చు ఈ రంగాల్లో పెట్టుబడులు పెడితే చాలా కాలానికి గానీ లాభాలు రావు. అందువల్ల తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వచ్చే మాన్యుఫాక్చరింగ్ రంగాన్ని ఎంచుకున్నారు. అలాగే ప్రభుత్వ పెట్టుబడులతో నిర్మించే భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని బాగా బలపడొచ్చనే వ్యూహంతో రాజ్య పాత్రను సమర్థించారు. ఈ ఆలోచనకు బీజం బాంబే ప్లాన్లో వేయబడింది. స్వాతంత్య్రం మరో మూడేళ్లలో దేశానికి వస్తుందనే దరిమిలా దేశంలో ఆనాడు అగ్రస్థానంలో ఉన్న జే ఆర్ డి టాటా, బిర్లా, లాల్ శ్రీరామ్, ఆర్ధేశిర్ దలాల్ వంటి పారిశ్రామికవేత్తలు సమావేశమై స్వాతంత్య్ర అనంతరం భారతదేశం అనుసరించాల్సిన పారిశ్రామిక విధానం ఎలా ఉండాలనే డాక్యుమెంట్‌ను 1944లో రూపొందించారు. దీనినే టాటా-బిర్లా ప్లాన్ లేదా బోంబే ప్లాన్ అంటున్నారు.
ఈ మాలిక సైద్ధాంతిక అవగాహనకు అనుగుణంగా 1948, 1956 పారిశ్రామిక తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటుచేశారు. స్టీల్, లోహాలు, యంత్ర పరికరాలు తయారు చేసే భారీ పరిశ్రమలు, ఎరువులు, రవాణా, రసాయనాలు, చమురు, గ్యాస్, టెలి కమ్యూనికేషన్, విద్యుత్, నౌకా నిర్మాణాలు, రవాణా, బొగ్గు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఇలా అనేక రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. రక్షణ రంగానికి అవసరమైన పరికరాలు, యుద్ధ సామాగ్రి, యుద్ధనౌకలు, యుద్ధ విమానాల నిర్మాణానికి అవసరమైన పునాది 70వ దశకం నాటికి పూర్తి చేయగలిగారు. న్యూక్లియర్ రియాక్టర్ల తయారీ కోసం బాంబేలో బాబా ఆటమిక్ పరిశోధనా కేంద్రం స్థాపనతో ఈ రంగంలో భారత్ సాధించిన శక్తి సామర్ధ్యాలను ప్రపంచానికి మన శాస్త్రజ్ఞులు చాటి చెప్పారు. అలాగే అంతరిక్ష రంగంలో ప్రభుత్వం చూపిన ప్రత్యేక శ్రద్ధ వల్ల 1976 నాటికే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రోదసిలోకి సోవియట్ సహాయంతో పంపించగలిగాము. విద్యారంగంలో యూనివర్సిటీలు ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకతను గుర్తించి ఐఐటీల స్థాపనకు పూనుకున్నారు. 1951లో ఖరగ్‌పూర్‌లో ఆ తరువాత బాంబే, కాన్పూర్, మద్రాస్, ఢిల్లీలో ఐఐటిలు ప్రారంభించారు. ఐఐఎం వంటి సంస్థలు కూడా కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాల్లో ప్రభుత్వం నెలకొల్పింది. ఇదే రీతిలో వైద్య, ఇతర సామాజిక రంగాల్లో కూడా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసింది.
ప్రభుత్వం నెలకొల్పిన ముఖ్యమైన రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రవేశం లేకుండా అనేక చట్టాలు చేశారు. అలాగే దేశంలో ఉన్న బడా పెట్టుబడిదార్ల పారిశ్రామిక పెట్టుబడులను, విదేశీ పెట్టుబడిని, విదేశీ మారక ద్రవ్యాన్ని, సెక్యూరిటీలను నియంత్రించటానికి ఏకస్వామ్యాల వ్యాపార నియంత్రణా కార్యకలాపాల చట్టం (ఎంఅర్‌టిపి), ఫె˜రా చట్టాన్ని తీసుకొచ్చారు. విదేశీ సరుకుల దిగుమతులపై నియంత్రణలు విధించటంతోపాటు దేశీయ పరిశ్రమలను విదేశీ పరిశ్రమల నుండి రక్షణ కోసం పలు చర్యలు చేపట్టారు.
మరో ముఖ్యమైన పరిణామం ఏమంటే విదేశీ, స్వదేశీ పరిశ్రమలను, ఆర్థిక, ద్రవ్య సంస్థలను ప్రభుత్వం జాతీయం చేయడం. రిజర్వ్ బ్యాంకు నుండి ప్రారంభమై 80వ దశకం వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. 1953 లోనే టాటా నుండి విమాన యానాన్ని జాతీయం చేశారు. ఇంపీరియల్ బ్యాంక్‌ను జాతీయం చేసి స్టేట్ బ్యాంక్‌ను స్థాపించారు. ఇన్సూరెన్స్ రంగాన్ని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ సంస్ధ సేకరించే పొదుపును అభివృద్ధి కార్యక్రమాలు, ప్రణాళికా లక్ష్యాలకు ప్రభుత్వం వినియోగించుకుంది. 70వ దశకంలో బొగ్గు, చమురు, గ్యాస్, నౌకాశ్రయాలు వంటి అనేక ప్రైవేట్ పరిశ్రమలను జాతీయం చేశారు. 60వ దశకంలో బ్యాంకులను జాతీయం చేయడంతో దేశ అర్థిక వ్యవస్థలో పెను మార్పులకు ఈ చర్య నాంది పలికింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, చిన్న ఉత్పత్తి రంగానికి సంస్థాపరమైన రుణ సదుపాయం అందుబాటు లోకి తెచ్చింది. బ్యాంకింగ్ వ్యవస్థ దేశవ్యాప్తంగా విస్తరించింది. అప్పటికే వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల కల్పన ప్రారంభించి భారీ నీటి ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టింది. ఈ కృషికి బ్యాంకు రుణాలు తోడవడంతో వ్యవసాయ రంగంలో హరిత విప్లవం సాధించటానికి మార్గం సుగమమైంది. ఆహారధాన్యాల కోసం సామ్రాజ్యవాద దేశాల కబంధ హస్తాల నుండి విముక్తి కాగలిగాం.
ప్రభుత్వ పెట్టుబడుల వల్ల 75 ఏళ్ళలో పారిశ్రామికంగా దేశం కొంతమేరకైనా అభివృద్ధి సాధించింది. 389 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలో నెలకొల్పబడ్డాయి. వీటిల్లో 108 నిర్మాణంలో వున్నాయి. ఇప్పటివరకు 26 సంస్థలు అమ్మటమో, మూసివేయడమో చేశారు. 61 సంస్థలను స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేశారు. ఇప్పటి వరకు వీటిల్లో సుమారు రూ. 32.47 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టారు. వీటి విలువ ప్రస్తుతం దేశ స్థూల జాతీయోత్పత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. 2021 మార్చిలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో వున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గత ఏడాది రూ.26.36 లక్షల కోట్ల విలువ గల ఉత్పత్తి చేశాయి. లక్ష 89 వేల కోట్ల రూపాయలు నికర లాభాలు ఆర్జించగా కేవలం 10 కంపెనీలు మాత్రమే రూ.31 వేల కోట్లు నష్టాలు పొందాయి. మిగులు నిధులు రూ.10.79 లక్షల కోట్లు ఈ సంస్థల వద్ద వున్నాయి. ప్రతి ఏడాది సుమారు రూ. 3 లక్షల కోట్లకు పైగా విస్తరణ కోసం పెట్టుబడులు పెడుతున్నాయి. గత యేడాది కేంద్ర బడ్జెట్‌కి వివిధ పన్నులు, డివిడెండ్ల రూపంలో సుమారు రూ.5 లక్షల కోట్లు చెల్లించాయి. వీటిలో పని చేస్తున్న 13.72 లక్షల మంది ఉద్యోగులకు వేతనాల కింద రూ.1.56 లక్షల కోట్లు చెల్లించాయి. రూ.1.34 లక్షల కోట్ల విలువగల విదేశీ మారక ద్రవ్యాన్ని కేంద్రానికి సమకూర్చాయి. సామాజిక తరగతులకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, మహా నగరాల ఏర్పాటుకు దోహదపడ్డాయి. దేశ సమైక్యతా సవాళ్ళను అధిగమించేందుకు తోడ్పడ్డాయి. ఇదే సందర్భంలో ప్రభుత్వ పెట్టుబడితో జరిగిన అభివృద్ధిని ఉపయోగించుకొని దేశంలోని బడా పారిశ్రామికవేెత్తలు, సంస్ధలు పెద్ద ఎత్తున సంపదను పోగేసుకున్నాయి.
ఈ అభివృద్ధి క్రమాన్ని 1991 నుండి దెబ్బతీయడం ప్రారంభించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత జాతీయోద్యమ స్ఫూర్తితో నిర్మించబడ్డ ఆర్థిక వ్యవస్థను విదేశీ, స్వదేశీ బడా పెట్టుబడిదార్ల చేతుల్లో పెట్టే విధానాలను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు అనేక రంగాల్లో గుత్తాధిపత్యంగా ఉండి దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటినీ గుత్త పెట్టుబడిదార్లకు ధారాదత్తం చేస్తున్నారు. రాజ్యాంగంలో నిబిడీికృతంగా ఉన్న సామాజిక, మౌలిక, సంక్షేమ తాత్వికతను పూర్తిగా తుడిచి వేస్తున్నారు. సంపద పున:పంపిణీ కాకుండా మరింత కేంద్రీకరణకు దారితీసే చర్యలకు ప్రభుత్వం వడిగట్టింది. ఈ చర్యలు దేశ సమైక్యత, సమగ్రతలకు తీవ్ర ప్రమాదం తీసుకు రాబోతున్నాయి. ఈ క్రమం ఇలాగే కొనసాగితే వందేళ్ళకి దేేశం అభివృద్ధి చెందిన దేశంగా మారటం కన్నా దేశ అర్థిక వ్యవస్ధ తిరిగి సామ్రాజ్యవాదుల పరమయ్యేందుకు దారితీస్తుంది.
/ వ్యాసకర్త సెల్ : 9490098792 /
డా|| బి. గంగారావు