Oct 16,2022 20:32

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ
ప్రజాశక్తి-హిందూపురం :
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో వర్షాల కారణంగా ముంపునకు గురైన శాంతినగర్‌, చౌడేశ్వరి కాలనీ, ఆర్‌టిసి కాలనీ, పళని నగర్‌లో ఆదివారం ఆయన పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి నిత్యావసర సరుకులు, నగదును అందజేశారు. అనంతరం పోచనపల్లి వద్ద వరద కారణంగా కూలిపోయిన పెన్నా నది వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. టిడిపి ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనుల వల్లే భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ హిందూపురం పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని అన్నారు. పెన్నా, కుముద్వతి ప్రాజెక్టు అభివృద్ధికి 2019లో రూ.13.50 కోట్లు మంజురు చేయించామని, అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేయలేదని తెలిపారు. ఆ నిధులను తీసుకురావడంలో స్థానిక వైసిపి నాయకులూ విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికే కొట్నూరు, శ్రీకంఠాపురం, పూలకుంట సమీపంలో బ్రిడ్జీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. పెన్నా నది వంతెన కూలిపోవడంతో దాదాపు 12 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయించాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజల సమస్యలను, వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు కలెక్టర్‌తో సమీక్షించినట్లు తెలిపారు. అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధీ వరద బాధితులను పలకరించిన పాపాన పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, నాగరాజు, అనిల్‌కుమార్‌, హిదయాతుల్లా, అంజినప్ప తదితరులు పాల్గొన్నారు.