Nov 14,2023 12:07

ప్రజాశక్తి-హిందూపురం (అనంతపురం) : రేపు విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో జరగనున్న ప్రజారక్షణభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ... మంగళవారం సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి సిపిఎం నాయకులతోపాటు అనుబంధ సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున కార్మికులు హిందూపురం నుండి విజయవాడకు బయలుదేరారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి నరసింహప్ప, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ .. అసమానతలు లేని అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో జాతాలు నిర్వహించి బుధవారం ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ప్రజారక్షణ భేరి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ బహిరంగ సభకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.శ్రీనివాసరావు ఇతర ముఖ్యమైన నాయకులందరూ పాల్గొని ప్రసంగిస్తారన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించి, పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. విద్య, వైద్యం, అందుబాటులో ఉంచాలన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలని, వ్యవసాయ కార్మికులకు సొంత గ్రామాలలో ఉపాధి హామీ పనులు కల్పించి, పనులకు తగ్గ కూలి ఇవ్వాలన్నారు. గ్రామాలు, పట్టణాలు, జిల్లాలను అభివృద్ధి పథంలో నడపాలని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం బహిరంగ సభ జరుగుతుందని అన్నారు. జిల్లాలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, చేతి వృత్తిదారులు, చిన్న, సన్నకారు రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.