పాయకాపురం (విజయవాడ) : పాయకాపురం చెరువులో బాలుడి మృతికి ప్రభుత్వం, నగరపాలక సంస్థ బాధ్యత వహించాలని, చెరువులో ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని, మృతి చెందిన దుర్గాప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించాలని సిపిఎం డిమాండ్ చేసింది. విజయవాడ వాంబే కాలనీ సమీపంలోని పాయకాపురం చెరువులో దుర్గాప్రసాద్ అనే 8 సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు పడి మరణించాడు. పాయకాపురం చెరువు ప్రాంతాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, తదితర నేతలు సోమవారం పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులు, ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ... కోట్లాది రూపాయల ఖర్చుతో పాయకాపురం చెరువు అభివృద్ధి, పార్కు నిర్మాణం పనులు చేపడుతూ తగు రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం శోచనీయమన్నారు. కనీసం రక్షణగా సిబ్బందిని కూడా నియమించకపోవడం నగరపాలక సంస్థ నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నదని చెప్పారు. దుర్గాప్రసాద్ మృతికి ప్రభుత్వం, నగరపాలక సంస్థ బాధ్యత వహించాలని అన్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడం, తగు రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. మృతి చెందిన దుర్గాప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు.










