
దేశానికి పీడగా తయారైన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించే ఏకైక లక్ష్యంతో బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీ ముందడుగు. విభిన్న సిద్ధాంతాలు, వైఖరులు కలిగిన పదిహేను జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఒకే వేదిక మీదికి రావడం ఒక విజయంకాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నిరంకుశ బిజెపిని ఓడించేందుకు ఐక్యంగా పని చేయాలన్న ఏకాభిప్రాయానికి రావడం అతి పెద్ద విజయం. బిజెపి ఓటమే లక్ష్యంగా సమావేశమైన విపక్షాల విస్తృత సమావేశం ఫలప్రదం కావడం బిజెపి పాలనలో వేళ్లూనుకుంటున్న ఫాసిస్టు తరహా రాజకీయాలపై ప్రతిఘటనకు శుభారంభం. కొనసాగింపుగా వచ్చే నెలలోనే హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో విపక్షాల రెండవ భేటీ ఉంటుందని ప్రకటించడమే కాకుండా తమ ఉమ్మడి లక్ష్య సాధన కోసం ఉమ్మడి ఎజెండా ఖరారు చేస్తామని, రాష్ట్రాలవారీగా ప్రత్యేక ప్రణాళికల రూపకల్పనకు నిర్దిష్ట నిర్ణయాలు చేస్తామని పాట్నా సమావేశానంతరం విపక్ష నేతల వక్కాణింపు ఆహ్వానించదగినది. ఈ పరిణామంతో ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ ప్రేమికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
భిన్న ధృవాలుగా వ్యవహరించే పార్టీలు తమ వైఖరులను పక్కనపెట్టి తక్షణ కర్తవ్యంగా బిజెపిని ఓడించేందుకు కలిసికట్టుగా ముందుకు రావడానికి బిజెపియే కారణం. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకొచ్చింది మొదలు తొమ్మిదేళ్లలో ఆర్‌ఎస్‌ఎస్ మార్గదర్శకత్వంలో ఫాసిస్టు హిందూత్వ దేశంగా మార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. భారత లౌకిక, ప్రజాస్వామ్య నిర్మాణాన్ని నాశనం చేస్తోంది. సమాఖ్య సూత్రాలు, లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటి రాజ్యాంగ స్తంభాలపై దాడి తీవ్రతరం చేసింది. మరోవైపు దేశాన్ని కార్పొరేట్లపరం చేసేందుకు ఏ చర్యకైనా వెనుకాడట్లేదు. అంతేకాదు, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు సిబిఐ, ఇడి, ఐటి వంటి సంస్థలను ప్రయోగిస్తోంది. గవర్నర్లను ఏజెంట్లుగా చేసుకొని ఎన్నికైన ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతోంది. దాంతో బిజెపిని వ్యతిరేకించే పార్టీలతో పాటు గతంలో ఆ పార్టీకి మద్దతిచ్చిన పార్టీలూ తమ కుర్చీ కిందికి ఎప్పుడు నీళ్లొస్తాయోనని భయపడి క్రమేణ బిజెపికి దూరం జరుగుతున్నాయి. బిజెపిని ఓడించకపోతే తమకు మనుగడ లేదన్న నిర్ణయానికొచ్చాయి. ఆ ఫలితమే విపక్షాల ఐక్యతకు నాందీవాచకమైంది. వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలన్న లక్ష్యం ముందు తమలో ఉన్న విభేదాలు, ధోరణులు అడ్డుకాబోవని స్పష్టీకరిస్తున్నాయి. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్, ఆప్ మధ్య ఉన్న విభేదాలు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తామని రాహుల్‌గాంధీ చెప్పినా, కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని మమతా బెనర్జీ అన్నా, కాంగ్రెస్ తమకు శత్రువు కాదని అఖిలేష్ యాదవ్ ఉద్ఘాటించినా, తమకు జాతి సమగ్రతే ముఖ్యమని ఉద్ధవ్ ఉటంకించినా, బిజెపిని ప్రతిఘటించాలన్న లక్ష్యం ప్రస్ఫుటిస్తుంది. కాగా బిజెడి, వైసిపి, టిడిపి ఇంకా కళ్లు తెరవట్లేదు. కాంగ్రెస్, బిజెపిని ఒకే గాటన కట్టిన బిఆర్‌ఎస్ వైఖరి గందరగోళంగా ఉంది. బిఎస్‌పి ధోరణి షరా మామూలే.
రాష్ట్రాల పరిస్థితులకనుగుణంగా బిజెపిని ఓడించే ప్రణాళికలు ఉండాలన్న సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సూచన ఆచరించదగిన మేలిమి మార్గం. రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా నివారించడం ప్రధానం. జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లి పోరు పిల్లి పోరు పిట్ట తీర్చిన చందాన బిజెపి లాభపడుతుంది. గత ఎన్నికల్లో 37.36 శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపి 303 సీట్లతో అధికారంలోకి రాగలిగింది. వాస్తవానికి దేశ వ్యాప్తంగా బిజెపిని 60 శాతంపైన ఓటర్లు తిరస్కరించారు. ఈ పరిస్థితి ప్రతిపక్షాల అనైక్యత వల్లనే ఎదురైంది. ఇటువంటి స్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవడం ప్రతిపక్షాల సమిష్టి బాధ్యతగా ఉండాలి. రాబోయే సమావేశాల్లో విపక్షాల ఉమ్మడి కార్యాచరణ, ఎజెండా ఆ దిశలో ఉండాలన్న ఆకాంక్ష లౌకిక, ప్రజాస్వామ్య వాదుల్లో ప్రబలంగా వ్యక్తమవుతోంది. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ప్రతిపక్షాలు నడుచుకోవాలి.