
రెండు వేల నోట్ల ఉపసంహరణ వల్ల నల్లధనం ఉన్నవారు లబ్ధి పొందకుండా కట్టుదిట్టం చేస్తామంటున్నారు. 2016లో విధించిన నిబంధనల ప్రకారం ఎక్కువ నోట్లు మార్చుకోవడానికి వీల్లేదన్నారు. ఈసారి కూడా ఒక్క విడతలో మార్చుకోగలిగిన మొత్తం ఇరవై వేలే. అలా ఎన్ని విడతలకైనా ఒక్కరోజే మార్చుకోగలగడం సంపన్నులకే ప్రయోజనం. ఇది నల్లడబ్బును వైట్‌గా మార్చుకోవడానికి ఉపకరిస్తుంది. అంతిమంగా నోట్లరద్దు ప్రధాని చెప్పిన ఏ ఒక్క లక్ష్యాన్నీ సాధించకపోగా భారత ఆర్థిక వ్యవస్థనే అథోగతిపాలు చేసిందని ఈ వాస్తవాలన్నీ రుజువు చేస్తున్నాయి.
చెలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణకు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30లోపు తమ వద్ద రెండు వేల నోట్లున్నవారు బ్యాంకుల్లో, ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకొనే అవకాశం కల్పించింది. అందుకు కొన్ని పరిమితులు విధించింది. క్లీన్ నోట్ పాలసీ కింద 2 వేల నోటు రద్దు చేశామంటూ ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. అసలు క్లీన్ పాలసీ అంటే ప్రజలకు మంచి నాణ్యమైన నోట్లు అందుబాటులోకి తేవడం కదా. మరి ఉన్న నోట్లను రద్దు చేస్తూ ఆకస్మిక ప్రకటనలెందుకు? కాలం అన్ని రకాల గాయాలను మాన్పుతుందంటారు. కానీ మన ప్రధానమంత్రి చేసిన గాయం మాత్రం రాచపుండై కాలం గడిచేకొద్దీ రెచ్చుతోంది. దానిపై మళ్లీ కారం చల్లే పనిని ఆర్బీఐకి అప్పగించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2016లో చేసిన నోట్ల రద్దు ప్రకటన భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. చెలామణిలో ఉన్న రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు హడావిడిగా మోడీ ప్రకటించారు. అనంతరం రూ.2000 నోట్లను తెచ్చింది. ఇప్పుడు దానిని కూడా నేటి నుంచి ఉపసంహరించు కుంటున్నట్టు ప్రకటించింది. దేశీయంగా ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.3.62 లక్షల కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లలో ఎనభై శాతం అతి కొద్ది మంది చేతుల్లోనే ఉన్నట్టు అంచనా. అందులో సింహభాగం అక్రమ లావాదేవీలకే ఉపయోగ పడుతున్నాయన్న నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షులు అరవింద్ పనగడియా వ్యాఖ్యలు బడాబాబుల బాగోతాలకు అద్దం పడుతున్నాయి.
ప్రధాని చెప్పినట్టు డిజిటల్ లావాదేవీలు గనుక పెరిగితే వాస్తవంలో కాగితపు కరెన్సీ చెలామణి తగ్గిపోవాలి. కానీ జరిగింది ఏమిటి? 2016లో పెద్ద నోట్ల రద్దు జరిగిన రోజుకు నాలుగు రోజుల ముందర చెలామణిలో ఉన్న కాగితపు కరెన్సీ మొత్తం విలువ 17.74లక్షల కోట్ల రూపాయలు. కాగా, 2022 డిసెంబర్ 23 నాటికి రిజర్వ్ బ్యాంకు గణాంకాల ప్రకారమే ఈ మొత్తం 32.42 లక్షల కోట్ల రూపాయలు. అంటే, కాగితపు కరెన్సీ స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే లక్ష్యం, పూర్తిగా వికటించిందన్నది వాస్తవం. ఈ కాలంలో కాగితపు కరెన్సీ చెలామణి రెట్టింపైంది. మరోపక్క యూపీఐ చెల్లింపులూ, క్రెడిట్, డెబిట్ కార్డుల చెల్లింపులూ, ఆన్‌లైన్ రూపంలో జరిగే లావాదేవీలు కూడా భారీగానే పెరిగాయి. 2వేల నోట్లు నేడు సాధారణ చెలామణిలో కనబడటం లేదు. మరి ఆ నోట్లన్నీ ఏమైనట్టు? ఈ మరింత పెద్దనోటు నేడు బడాబాబులు, అవినీతి రాజకీయ నేతలూ, రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవసరాల కోసం నల్లడబ్బుగా అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయింది. అంటే, పెరిగిపోయిన కాగితపు కరెన్సీ చెలామణిలోని సింహభాగం నేడు 'పెద్ద మనుషుల' లావాదేవీల రూపంలో లెక్కలకు చిక్కకుండా తిరుగాడుతున్నది. కాగా, సామాన్య జనం చెల్లింపులూ, లావాదేవీలూ మాత్రం బహు పారదర్శకంగా నేడు డిజిటల్ ఎకానమీలో ప్రభుత్వ జీఎస్టీ ఆదాయపు రికార్డు స్థాయి పెరుగుదలగా నమోదవుతున్నది. యు.పి ఎన్నికల వేళ హడావిడిగా పెద్దనోట్లను రద్దుచేసిన బిజెపి సర్కార్.. కర్ణాటకలో కన్ను లొట్టపోయిన తరువాత, మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముంగిట ఉండగా రూ.2000 నోటును వెనుకకు తీసుకుంటున్నది. కేవలం సంపన్నుల ప్రయోజనం కోసమే ఈ నోట్లను ఇంతకాలం చెలామణిలో ఉంచారన్నది వాస్తవం. పెద్ద నోట్ల రద్దు సమయంలో భారీ ఎత్తున వస్తుందన్న గుత్తధనమంతా వైట్ మనీ అయిపోయి ఆర్థిక వ్యవస్థలో కలిసిపోలేదా? ఇప్పటికీ అటువంటి దొడ్డిదార్లు తెరుచుకొని ఉంటాయనడంలో సందేహం అక్కర్లేదు. 2 వేల నోట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని, దొంగ సొమ్ము దాచుకోడానికి, ఉగ్రవాదులకు సాయం చేయడానికి వాటిని ఉపయోగిస్తున్నారని, వాటిని రద్దుచేయాలని బిజెపి ఎం.పి సుశీల్ మోడీ గత డిసెంబర్ లోనే రాజ్యసభలో డిమాండ్ చేశారు. కానీ, ఆ ఉద్దేశమే లేదని కేంద్రం పార్లమెంటుకు చెప్పింది. ఆరు నెలలు గడిచేలోపు ఉన్నట్టుండి రద్దు చేయడంలోని ఆంతర్యమేంటి ?
2016లో రద్దు చేసిన నోట్లలో 99.3 శాతం రిజర్వూ బ్యాంకుకు చేరాయి. అంటే ప్రత్యక్షంగా నల్లధనం అని తేలిందేమీ లేదు. ఇప్పుడూ నల్లధనం తగ్గే అవకాశాలు ఏమీ ఉండవు. రెండు వేల నోట్ల ఉపసంహరణ వల్ల నల్లధనం ఉన్నవారు లబ్ధి పొందకుండా కట్టుదిట్టం చేస్తామంటున్నారు. 2016లో విధించిన నిబంధనల ప్రకారం ఎక్కువ నోట్లు మార్చుకోవడానికి వీల్లేదన్నారు. ఈసారి కూడా ఒక్క విడతలో మార్చుకోగలిగిన మొత్తం ఇరవై వేలే. అలా ఎన్ని విడతలకైనా ఒక్కరోజే మార్చుకోగలగడం సంపన్నులకే ప్రయోజనం. ఇది నల్లడబ్బును వైట్‌గా మార్చుకోవడానికి ఉపకరిస్తుంది. అంతిమంగా నోట్లరద్దు ప్రధాని చెప్పిన ఏ ఒక్క లక్ష్యాన్నీ సాధించకపోగా భారత ఆర్థిక వ్యవస్థనే అథోగతిపాలు చేసిందని ఈ వాస్తవాలన్నీ రుజువు చేస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఎందరో ఆర్థిక నిపుణులు హెచ్చరించినా లెక్కచేయని మోడీ అంతరంగమేమిటో ఈ ఆరున్నరేళ్లుగా అనుభవాలు అవగతం చేస్తున్నాయి. ఇప్పటికైనా తప్పుదిద్దుకోవాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా ఇంకా మోసానికి తెర తీసింది. కొందరిని కొంతకాలమే మోసం చేయగలరేమో గానీ, అందరినీ అన్ని వేళలా మోసం చేయలేరనే సత్యాన్ని ఏలికలు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.
- అనంతోజు మోహన కృష్ణ