- హిందూపురంలో 'కీర్తన గోల్డ్‌లోన్' మాయ
- రెన్యూవల్ చేసినా బంగారు ఆభరణాలు వేలం
- అన్యాయాన్ని నిరసిస్తూ బాధితుని ఆత్మహత్యాయత్నం
ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పట్టణంలోని ధనలక్ష్మి రోడ్డులో ఉన్న కీర్తన గోల్డ్ లోన్‌లో అవసరం కోసం తాకట్టు పెట్టిన బంగారంలో గోల్‌మాల్ జరిగిందని బాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్యాయాన్ని నిరసిస్తూ పట్టణంలో కంసలపేటలో నివాసం ఉంటున్న చిన్న ఆచారి కీర్తన గోల్డ్ లోన్‌కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు యత్నించారు. బాధితుడు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... చిన్న ఆచారి ఆర్థిక అవసరాల నిమిత్తం తన భార్య బంగారు ఆభరణాలను కీర్తన గోల్డ్ లోన్‌లో తాకట్టుపెట్టి రుణాన్ని తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి ప్రతి నెలా సంస్థకు చెల్లించాల్సిన వడ్డీని క్రమంతప్పకుండా చెల్లించాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన తన బంధువులకు సంబంధించిన సుమారు రూ.రెండు లక్షలు విలువజేసే బంగారు నగలను కీర్తన గోల్డ్‌లోన్‌లో తాకట్టు పెట్టి రూ.1.16 లక్షలు రుణం తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఇదే సంవత్సరం జులై 27వ తేదీన వడ్డీ చెల్లించి, రుణాన్ని రెన్యువల్ చేశాడు. అయినప్పటికీ కీర్తన గోల్డ్ లోన్ కార్యాలయ సిబ్బంది సెప్టెంబర్ 9వ తేదీన అసలు, వడ్డీ మొత్తం రూ.1.42లక్షలు చెల్లించాలని, లేని పక్షంలో బహిరంగ వేలం వేస్తామని నోటీసు పంపారు. నోటీసు తీసుకున్న బాదితుడు కాస్తా గడువు ఇవ్వాలని కార్యాలయ సిబ్బందితో అడిగాడు. ఆ సమయంలో నామమాత్రంగానే నోటీసు ఇచ్చామని, మీ ఆభరణాలు ఎక్కడికీ పోవని చెప్పారు. అసలు, వడ్డీ చెల్లించి తీసుకెళ్లాలని అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది చెప్పారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా తాకట్టు పెట్టిన నగలను విడిపించుకునేందుకు చిన్నఆచారి కీర్తనగోల్డ్ లోన్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. నాలుగు రోజులుగా ఎవరూ స్పందించకపోవడంతో గట్టిగా నిలదీశాడు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇతనితో పాటు హిందూపురం ప్రాంతంలో మరో 144 మందికి చెందిన బంగారు ఆభారణాలను సెప్టంబర్ 30వ తేదీన విజయవాడలో బహిరంగ వేలం వేసినట్లు స్థానిక కార్యాలయంలో విధులు నిర్వహించే మేనేజర్ సౌజన్య తెలియజేసింది. దీంతో చిన్న ఆచారి ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తనకు న్యాయం చేయాలంటూ కిరోసిన్‌మీద పోసుకుని కార్యాలయం వద్దనే ఆత్మహత్యకు యత్నించాడు. నిర్ణీత సమయంలోనే వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేసినా, ఎలా వేలం వేస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆభరణాలు తనకు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. వెంటనే సిబ్బంది స్పందించి న్యాయం చేస్తామని, అతన్ని కార్యాలయంలోకి పిలుచుకున్నారు. ఈ విషయం కాస్తా పోలీసులకు తెలవడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న చిన్న ఆచారికి న్యాయం చేస్తామని, స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో చిన్న ఆచారి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గత వారం నుంచి మరికొంత మంది బంగారు ఆభరణాలను విడిపించుకునేందుకు కీర్తన గోల్డ్‌లోన్ చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో ఎవరి ఆభరణాలు ఉన్నాయి.. ఎవరివి వేలం వేశారన్న దానిపై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి వాస్తవాలు బయటకు తేవాలని బాధితులు కోరుతున్నారు.