Mar 29,2023 07:34

మీడియాను లొంగదీసుకునేందుకు మోడీ ప్రభుత్వం ప్రధానంగా ఐదు పనులు చేస్తోందని క్రిస్టోఫ్‌ జాఫ్రెలాట్‌ అంటున్నారు. ప్రభుత్వాన్ని, అధికార పార్టీని విమర్శించే మీడియాకు కేంద్ర ప్రభుత్వ ప్రకటనలను తిరస్కరించడం అందులో ఒకటి. మీడియాకు సంబంధించి ప్రకటనలు లేకపోతే మనుగడ లేదు. ప్రభుత్వ ప్రకటనలే మీడియాకు ప్రధాన ఆర్థిక వనరు. అది పూర్తిగా ఆగిపోతే మీడియా ప్రభుత్వాన్ని పొగడడం మినహా మరో మార్గం వుండదన్నది మోడీ సర్కార్‌ లెక్క.

కార్పొరేట్‌ మీడియా సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మంచి సామరస్యం ఉందన్న వాస్తవాన్ని ఇటీవలి పరిణామాలు వెల్లడి చేస్తున్నాయి.
అదానీ అవినీతి బాగోతానికి సంబంధించిన కొన్ని విషయాలను అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ జనవరి చివరి వారంలో బయటపెట్టింది. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనిక కార్పొరేట్‌గా అవతరించేందుకు అదానీ కంపెనీలు షేర్‌ ధరలు పెంచాయన్నది అందులో కీలకమైన అంశం. దీంతో అదానీ పతనం మొదలైంది. ఇది ప్రపంచ మీడియాలో పతాక శీర్షికలకెక్కగా, భారత మీడియా మాత్రం సాధారణ వార్తకు మించిన ప్రాధాన్యత ఇవ్వలేదు. మరోవైపు అదానీ ఒక్కరోజులో రెండు పూర్తి పేజీ ప్రకటనలు ప్రచురించి మీడియాను ప్రభావితం చేశాడు. కొన్ని జాతీయ వార్తాపత్రికలైతే హిండెన్‌బర్గ్‌ కథనాన్ని మొదటి పేజీలో ఇవ్వనేలేదు. ఇలాంటి వార్త బయటికి వచ్చినప్పుడు దీనికి కొనసాగింపుగా మరిన్ని పరిశోధనలు, బ్రేకింగ్‌ స్టోరీలు వస్తాయని నాలాంటి పాఠకులు భావించారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన దేశంలోని అత్యంత సంపన్నుడు కుప్పకూలడం అనేది జాతీయ మీడియాకు పెద్ద వార్తగా కనిపించలేదు.
        దీన్ని కేవలం ఒక వ్యాపార సామ్రాజ్య పతనంగా మాత్రమే చూడలేం. భారత ప్రధాని నరేంద్ర మోడీ నీడలో ఎదిగిన వ్యాపారవేత్త అదానీ. అందువల్ల ఆ తర్వాత కూడా ఈ వార్తల తదుపరి అంశాలను ఇవ్వడానికి, అసలు నిజానిజాలను బయటకు తీసుకురావడానికి ఏ మీడియా సంస్థా ఇష్టపడలేదు. ఈనాడు భారతీయ మీడియా అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల పనిని విచారించడానికి భయపడుతోంది. అధికారులను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగకుండా మీడియా అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ అన్నట్టు ఇండియాలో పరిశోధనాత్మక జర్నలిజానికి తెర పడిందా అన్న అనుమానం వచ్చే పరిస్థితి ఏర్పడింది. మీడియా మౌనానికి కారణం ఏమిటి ?
         అదానీ కంపెనీలకు, మీడియాకు మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలే ఈ వార్తను కప్పిపెట్టడానికి ప్రధాన కారణమని 'న్యూస్‌ లాండ్రీ' ప్రచురించిన నివేదిక వెల్లడిస్తోంది. అర్థబలాన్ని ఉపయోగించి అదానీ కంపెనీకి వ్యతిరేకమైన వార్తలను అడ్డుకోవడంలో విజయం సాధించారు (అదానీ కంపెనీల గురించి ఇంతకు ముందు చెప్పినట్లు భారీ ప్రకటనలు ఇస్తున్నారు). ఇప్పుడు మీడియా మునుపటిలా అదానీ, ఇతర అనేక కార్పొరేట్లకు వ్యతిరేకంగా వార్తలు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. దీనికి రకరకాల కారణాలున్నాయి. అందులో ఒకటి నేడు మీడియా ఎక్కువగా కార్పొరేట్ల చేతిలో వుంది. నయా ఉదారవాద యుగంలో, వార్తా ప్రయోజనాల కంటే యజమానుల ప్రయోజనాలే ప్రధానంగా తయారైనాయి. భారతదేశంలో కార్పొరేట్లు, అతివాద హిందూత్వ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతులు కలిపి ముందుకు సాగుతున్నాయి. అందువల్ల ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అదానీ కుంభకోణం గురించిన వార్తలను ఈ మీడియా ప్రచురించదు. రెండవది, మీడియా కార్పొరేట్ల మధ్య 'రహస్య ఒప్పందం' కూడా కార్పొరేట్‌ వ్యతిరేక వార్తలను అందించకుండా మీడియాను నిరుత్సాహపరుస్తున్నది. ప్రధాన జాతీయ వార్తాపత్రికలకు అనేక కంపెనీలలో వాటాలున్నాయి. అలాంటి కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఈ మీడియా ఎలాంటి వార్తలను ప్రచురించదనేది గ్యారెంటీగా చెప్పవచ్చు.
        'మోడీస్‌ ఇండియా - హిందూ నేషనలిజం అండ్‌ ది రైజ్‌ ఆఫ్‌ ఎత్నిక్‌ డెమోక్రసీ' అనే పుస్తకంలో...ప్రజాస్వామ్యం యొక్క నాల్గవ స్తంభం కార్యనిర్వాహక వ్యవస్థకు సహ స్తంభంగా ఎలా మారిందో క్రిస్టోఫ్‌ జాఫ్రెలాట్‌ వివరించారు. ప్రధాన స్రవంతి మీడియా 2002 గుజరాత్‌ అల్లర్లలో మోడీ పాత్ర గురించి చెప్పడానికి కొంత సుముఖంగా ఉంది. ప్రధానిగా తాను ఏం చెబితే అది వినడం, ప్రశ్నలు వేయకపోవడం మోడీ విధానం. తాను చెప్పాలనుకున్నది 'మన్‌ కీ బాత్‌' ద్వారా, ట్విట్టర్‌ ద్వారా చెప్పే విధానం మోడీది.
         వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఎన్‌డిఎ సమావేశం ముగిసిన తర్వాత, ముఖ్యమైన క్యాబినెట్‌ సమావేశాల తర్వాత మీడియాను కలుస్తుండేవారు. అయితే ఇప్పుడు ఢిల్లీ జర్నలిస్టులకు ప్రధాని మోడీ విలేకరుల సమావేశానికి హాజరైన అనుభవం లేదు. అలాగే మాజీ ప్రధానులందరూ విదేశాలకు వెళ్లేటప్పుడు జర్నలిస్టులను తమ వెంట తీసుకెళ్లేవారు. విమానంలో ప్రధాని మీడియా సమావేశం ఏర్పాటు చేసేవారు. కానీ మోడీ ప్రధాని అయ్యాక ఇవేవీ జరగడంలేదు.
         కోవిడ్‌ రాకతో పార్లమెంట్‌ లోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధించారు. మీడియాను లొంగదీసుకునేందుకు మోడీ ప్రభుత్వం ప్రధానంగా ఐదు పనులు చేస్తోందని క్రిస్టోఫ్‌ జాఫ్రెలాట్‌ అంటున్నారు. ప్రభుత్వాన్ని, అధికార పార్టీని విమర్శించే మీడియాకు కేంద్ర ప్రభుత్వ ప్రకటనలను తిరస్కరించడం అందులో ఒకటి. మీడియాకు సంబంధించి ప్రకటనలు లేకపోతే మనుగడ లేదు. ప్రభుత్వ ప్రకటనలే మీడియాకు ప్రధాన ఆర్థిక వనరు. అది పూర్తిగా ఆగిపోతే మీడియా ప్రభుత్వాన్ని పొగడడం మినహా మరో మార్గం వుండదన్నది మోడీ సర్కార్‌ లెక్క.
          మీడియాను లొంగదీసుకోడానికి మరొక మార్గం ఏమిటంటే సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించి దాడులు నిర్వహించడం. కోవిడ్‌-19 రెండవ వేవ్‌ సమయంలో ప్రముఖ హిందీ వార్తాపత్రిక దైనిక్‌ భాస్కర్‌ ఒక ఫొటోను ప్రచురించిన మరుసటి రోజే ఇ.డి ఆ సంస్థ కార్యాలయాన్ని సందర్శించింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు తగ్గుముఖం పట్టాయి. ఇక చివరగా తమిళనాడులో బీహారీలను వేటాడుతున్నారని నకిలీ వార్తలు ఇచ్చి బిజెపి కి సహకరించిన ప్రధాన మీడియా సంస్థల్లో ఇదీ ఒకటి.
          ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న 'న్యూస్‌ క్లిక్‌' అనే వెబ్‌ పోర్టల్‌ చీఫ్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ ఇల్లు, కార్యాలయంపై ఇ.డి దాడులు చేసింది. 114 గంటల పాటు ఇంటిని సోదా చేశారు. ఒక రోజుకు పైగా కార్యాలయాన్ని ముట్టడించగా, ఐదు రోజులు ఇంటిని ముట్టడించారు. అప్పుడు ఏమీ దొరకలేదు. ఇతర మీడియాలకు భిన్నంగా 'న్యూస్‌ క్లిక్‌' ఇప్పటికీ బిజెపి వ్యతిరేక వేదికగానే నిలుస్తోంది. ఎన్‌డి టీవీ కార్యాలయంపై కూడా దాడి చేశారు.
        ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి తాత్కాలికంగా అనుమతిని నిరాకరించడం ద్వారా మీడియాను కట్టడి చేయడం మరొక పద్ధతి. ఒకానొక సమయంలో, ఢిల్లీ అల్లర్లను నివేదించిన విధానాన్ని విమర్శించినందుకు ఏషియా నెట్‌, మీడియా వన్‌ ప్రసార అనుమతి నిరాకరించబడింది. ఏషియా నెట్‌ క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రచురించడానికి అనుమతి లభించింది. ఆ తర్వాత మీడియా వాణికి కూడా అదే అనుభవం ఎదురైంది. ఆఖరికి మీడియా వాణిని ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పుల్వామా దాడిలో ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడిన ఎన్‌డి టివి కి ప్రసార అనుమతి కూడా నిరాకరించబడింది.
       జర్నలిజాన్ని సీరియస్‌గా తీసుకునే జర్నలిస్టులను బహిష్కరించేలా వార్తాపత్రిక యాజమాన్యాలను ప్రభావితం చేయడం మోడీ ప్రభుత్వం అనుసరించిన మరో పద్ధతి. అందుకు అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. 'ఔట్‌ లుక్‌' వారపత్రిక సంపాదకుడు రూబెన్‌ బెనర్జీని తొలగించడం అందులో ఒకటి.
        కోవిడ్‌ రెండవ వేవ్‌ సమయంలో ఔట్‌ లుక్‌ వీక్లీలో 'మిస్సింగ్‌' పేరుతో కథనం విడుదలైంది. మే 2021లో ప్రచురించబడిన ఈ కవర్‌ స్టోరీ, వ్యాధి వ్యాప్తిని నిరోధించడంలో, వ్యాధి సోకిన వారికి చికిత్స చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటి చెప్పింది. మోడీ ప్రభుత్వ వాదనలు బూటకమని ఈ కథనం రుజువు చేసింది. సహజంగానే ఈ కవర్‌ స్టోరీ మోడీ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. రూబెన్‌ బెనర్జీ ఎడిటర్‌ పదవిని కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్‌ లోని హత్రాస్‌లో బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని దాచిపెట్టిన పైశాచిక చర్యను ప్రపంచానికి బట్టబయలు చేసిన ఇండియా టుడే టెలివిజన్‌ తనుశ్రీ పాండే కూడా ఉద్యోగం కోల్పోయారు.
        మీడియాను భయపెట్టడానికి, లొంగదీసుకోవడానికి ప్రభుత్వం...విమర్శనాత్మక జర్నలిస్టులను అరెస్టు చేయడం, చిత్రహింసలు పెట్టడం కూడా చూస్తున్నాం. అల్ట్‌ న్యూస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన మలయాళీ జర్నలిస్ట్‌ సిద్ధిక్‌ కప్పన్‌, కమ్యూనిజం కంబాట్‌ ఎడిటర్‌ మహమ్మద్‌ జుబేర్‌, తీస్తా సెతల్వాద్‌, హత్రాస్‌లో జరిగిన ఘటనను నివేదించేందుకు వెళ్లిన మనన్‌ గుల్జార్‌తో సహా కాశ్మీర్‌ లోని కొందరు జర్నలిస్టులను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఏడాదిన్నర తర్వాత సిద్ధిక్‌ కప్పన్‌ జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు జుబేర్‌ మూడు వారాలకు పైగా జైలు జీవితం గడిపారు. తీస్తా జైలు నుంచి బయటకు రావడానికి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. 2014 నుంచి ఇప్పటి వరకు 100 మందికి పైగా జర్నలిస్టులను అరెస్టు చేశారు. దాదాపు 40 మంది జైలులో ఉన్నారు.
         ది వైర్‌ ఎడిటర్‌, కారవాన్‌ మాజీ ఎడిటర్‌ సిద్ధార్థ్‌ వరదరాజన్‌, మలయాళీ జర్నలిస్టు వినోద్‌ కె జోస్‌, రాణా ఆయూబ్‌తో పాటు పలువురిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. దీంతో చాలా మంది మీడియా వారు మౌనంగా వుండిపోవాల్సి వచ్చింది. బిజెపి కి, మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా లేని వార్తలు, కథనాలు, విశ్లేషణలను న్యూస్‌ డెస్క్‌ నుంచి మినహాయించే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా తమంతట తాము సెన్సార్‌ విధించుకోవడం జర్నలిజానికి అతి పెద్ద ముప్పు.
         ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయన్నది తెల్సిన విషయమే. అదే సమయంలో కొన్ని అతిశయోక్తులు, తప్పుడు సమాచారం ప్రచారం చేయబడుతోంది. అయితే సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియా అనేవి ప్రతిపక్ష పాత్రలో సానుకూల పాత్ర పోషిస్తున్నాయి. అధికార పార్టీ, ప్రభుత్వం సృష్టించిన అనేక నకిలీ వార్తలను అవి బహిర్గతం చేస్తుంటాయి. మోడీ ప్రభుత్వం వాటి నోరు మూయించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఐటీ రూల్‌ 2021ని సవరించడం అందులో భాగమే. పిఐబి నకిలీ వార్తలుగా నిర్ధారించినవి పూర్తిగా తొలగించబడతాయి. ఆకాశవాణి, దూరదర్శన్‌ అందించే వార్తలను పూర్తిగా సెన్సార్‌ చేయడంలో భాగంగా పిటిఐ ఏజెన్సీని మినహాయించి ఆర్‌ఎస్‌ఎస్‌ వార్తా సంస్థ హిందుస్థాన్‌ సమాచార్‌తో ఒప్పందం కుదిరింది. భారతీయ మీడియా అక్షరాలా గోడీ మీడియాగా మారిపోయింది. ఈ మీడియా కాషాయీకరణ భారత ప్రజాస్వామ్యాన్ని కూడా నాశనం చేస్తుందనడంలో సందేహం లేదు.

('పేట్రియాట్‌ వీక్లీ' నుండి)
వి.బి. పరమేశ్వరన్‌

వి.బి. పరమేశ్వరన్‌