Aug 11,2023 11:20

ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటులో గురువారం కూడా ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌ సమస్యపై 167వ నిబంధన ప్రకారం రాజ్యసభలో చర్చించాలని కోరారు. చర్చ జరిగే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభలో ఉండాలని కోరారు. మోడీ సభకు హాజరుకావాలనే డిమాండ్‌ను అధికార పక్ష సభ్యులు వ్యతిరేకించారు. దీంతో ఖర్గే బిజెపి ఎంపిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'ప్రధాన మంత్రి వస్తే ఏమౌతుంది? ఆయనేమైనా దేవుడా? భగవంతుడేమీ కాదు కదా. సభకు రమ్మనండి' అని ఖర్గే అన్నారు. ఈ గందరగోళం నడుమ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. సభలో ప్రతిష్టంభనకు కారణం మీరంటే మీరని నినాదాలు చేశారు. రూల్‌ 267 ప్రకారం మణిపూర్‌ సమస్యపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసులను రాజ్యసభ చైర్మన్‌ తోసిపుచ్చారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు ఆందోళన మధ్యే ఫార్మసీ (సవరణ) బిల్లును చర్చ లేకుండా నిమిషంలోనే ఆమోదించారు. ఈ బిల్లును ఆగస్టు 7న లోక్‌సభ ఆమోదించింది.
 

                                                             తమిళనాడులో రూ. 515 కోట్లతో 'గోద్రెజ్‌ '

చెన్నై : తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలో రూ. 515 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్‌ను గోద్రెజ్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (జిసిపిఎల్‌) ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు గురువారం తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై గోద్రెజ్‌ సంతకం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్‌ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. తిరుపోరూర్‌ సమీపంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో 400 పైగా మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఉద్యోగుల్లో 50 శాతం మంది మహిళలను, ఎల్‌జిబిటిక్యూ నుంచి 5 శాతం మందిని, వికలాంగుల నుంచి 5 శాతం మందిని నియమించనున్నారు. ఈ మేరకు జిసిపిఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ నిసాబా గోద్రెజ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.