
పరీక్షలో ఫెయిల్ కావడం, ప్రేమలో విఫలమవడం, ఇంట్లో వారితో గొడవ, ఫ్రెండ్స్‌తో గొడవ, కాలేజ్ నుంచి డిబార్ కావడం, కాలేజీలో అధ్యాపకులు తిట్టడం ...వంటి కారణాల వల్ల కూడా యువత ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంతేకాక ఈ మధ్య సామాజిక మాధ్యమాలలో లైకులు, వ్యూస్ తాము ఆశించినంతగా రాలేదన్న కారణంతో ఆత్మహత్యలు చోటుచేసుకున్న ఘటనలూ వున్నాయి. వివేకంతో ఆలోచిస్తే అవి పెద్దగా కారణాలే కావు. కానీ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అని ఒక ప్రశ్న వేసుకుంటే యువత రోజురోజుకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. గుండె నిండా ధైర్యాన్ని నింపుకోవడం మర్చిపోయి భయాన్ని నింపుకుంటున్నారు. తమ ముందు జరిగే చిన్నపాటి అంశాలకే ప్రాణం తీసుకోవడానికి ముందడుగు లేస్తున్నారు. ఆవేశంతో చేతులారా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కళ్ళ ముందు ఆడుతూ పాడుతూ ఎదిగిన కొడుకు కూతుళ్లను చూస్తూ మురిసిపోయిన తల్లిదండ్రులు ఈ ఘటనలకు తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. పెద్దయ్యాక వారి విజయాలను చూసి ఆనందాన్ని నింపుకోవాల్సిన కళ్ళలో కన్నీటిని నింపుకుంటున్నారు. తెలిసీ తెలియని వయసులో తాత్కాలిక సమస్యలకు శాశ్వత నిర్ణయం తీసుకోవడంతో వారి చుట్టూ నడిచే వారంతా కన్నీటి సంద్రంలో మునిగి పోతున్నారు. నిజానికి యువతరం దగ్గర ఆత్మస్థైర్యం లేదా అంటే కావాల్సినంత ఉంది. కానీ నేడు సామాజిక మాధ్యమాలకు, ఇతర అనేక అంశాలకు ప్రభావితమై...తమ దగ్గర ఆత్మస్థైర్యం ఉందనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఆ ముసుగు నుంచి బయటపడ్డ నాడు యువత గుండె మీద చెయ్యి వేసుకుని ఆత్మస్థైర్యంతో ఆత్మగౌరవంతో ముందుకు నడవగలుగుతుంది.
యువ తరంలో ఉన్న ఆత్మస్థైర్యం బయటికి రావాలంటే యువత దేశ చరిత్రను గాని, ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడిన స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలు గాని, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ముందుకు సాగుతున్న యువత చరిత్రను గాని, దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి అడుగులు ముందుకేస్తున్న సైనికుల గుండెచప్పుడు గాని, దేశానికి అన్నం పెడుతున్న రైతన్న గుండె చప్పుడు గాని...వినాల్సిన అవసరం ఉన్నది. వారిని చదవాల్సిన అవసరం ఉన్నది. 'చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేడు' అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే యువత చరిత్ర చదవాలి. దాన్నుంచి పొందిన స్ఫూర్తితో తమలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని బయటికి తీసి 'నేను, నా దేశం, నా బాధ్యత' అని ముందుకు సాగాలి. ఆత్మస్థైర్యాన్ని గుండెల నిండా నింపుకొని ఆత్మగౌరవం కోసం ముందుకు అడుగులేయాలి.
- మిట్టకడుపల తిరుపతి,
సెల్ : 9133031674