నువ్వూ నేనూ
కలుసుకున్నప్పుడు
నీ మెడదగ్గరే నా తలను
వాల్చుకోవాలనుకుంటాను
ఏదో బిడియం మాట పెకలనివ్వదు
దేహమంతా సంకెళ్ల వలయం
ఎప్పుడూ ఇంతే..
వేలవేల నిట్టూర్పులు
సమూహంలా ఆవహిస్తుంటాయి
నీలో వొత్తిగిల్లి సేద తీరుతున్న భ్రమ
పచ్చని ఆకుల మధ్య
తెల్లని పూల సౌరభం
ఓ చల్లని గాలి వేళ్ల కొసలతో
స్పర్శిస్తున్నట్టు ఒకటే ఆలోచన
నేల జారిన నెయ్యిలా
మమకారం వొలికిపోయిన బాధ
ఇసుక ఎంత పిండినా తైలం రాని వ్యథ
కర్ణుడికి దక్కిన శాపనార్థంలా
ఎన్ని ఈసడింపులో, ఛీత్కారాలో
గుండె కవాటాన్ని తెరిచి
ఒక్కటంటే ఒక్క కరచాలనం
చేసినట్టుగా అనిపించదాయే
నీ కురులు నా మోమును తాకిన ప్రతీసారీ
ఎన్ని భేషజాలను గాలికి వొదిలేసానో..
నేను లాలన వైపు లీలగా కదిలిపోతాను
నువ్వు మధురిమలకు మడి కడతావు
నేను చంద్రుణ్ని ముద్దాడతాను
నువ్వు నక్షత్రాల ఖజానాను లాక్కొని
ఆకాశంలో సగమైపోతావూ
ఎన్ని వసంతాలను జారవిడిచినా
ఎన్ని ఆటు పోటులను లెక్కకట్టినా
ఒక్కటే మాట
ఈ జగతిని జయిస్తాను కానీ..
నాక్కొంచెం ఓదార్పు నివ్వు..!
డాక్టర్ కటుకోఝ్వల రమేష్
99490 83327