
పిల్లలపై ఎందుకు దృష్టి పెట్టాలి అన్న ప్రశ్నే తలెత్తకూడదు! పిల్లలంటే మనమే కదండి! మనలను మనం చూసుకోవడం సహజం. అంతే.
వాళ్ళ కోసం.. పిల్లలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రత్యేకంగా ఎదిగే వాతావరణం, అవకాశాలు అందించడమే మనం చేయాల్సింది. ఎవరికి వారు బుద్ధి వివేచనలతో ఎదిగి, స్వావలంబనను సాధించేట్టు, స్వాభిమానాన్ని పదిలపరుచుకొనేట్టుగా.

అందులో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంస్థాపరంగా, సమాజపరంగా చేయవలసినది ఎంతో ఉన్నది. ముఖ్యంగా, స్వేచ్ఛను పరిచయం చేస్తూనే, పిల్లలలో బలమిన భద్రతా భావనను స్థిరపరచాల్సి ఉన్నది.
నేను చేసినవి ఇచ్చిన ఫలితాలేమిటంటే.. పిల్లల సృజనాత్మకత పట్ల ప్రధానంగా కృషి చేస్తున్నాము. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా. భాష యొక్క సామర్థ్యాన్ని గ్రహించ గలిగిన వీరు, భాష యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించ గలుగుతున్నారు. వైవిధ్యాలను, అనేకతను, బహుళత్వాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

హేతుబద్దత, సృజనశీలతతో కూడిన శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచడం గమనించాం. వారి భావ పరివర్తన తమ సాటివారితో మెలగడంలో పరిణిత వైఖరితో వ్యవహరిస్తున్నట్టూ గమనించాం. వారి సృజనశీలత వారి విద్య, వృత్తి వ్యాపకాల్లోనూ ప్రత్యేకమైన వారిగా నిలబెట్టడం గమనించాం. అంతకుమించి ఇంక ఏ ఫలితాల కోసం ఎదురుచూడగలం?
- చంద్రలత,
రచయిత, ప్రభవ, నెల్లూరు.