Oct 24,2023 08:49

మెక్సికో : పోలీసులు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై దుండగులు కాల్పులకు తెగబడటంతో 16 మంది మృతి చెందిన దుర్ఘటన మెక్సికోలో జరిగింది. ఈ ఘటనలో 12 మంది పోలీసులతో కలిపి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ రాష్ట్రమైన గురెరోలోని కోయుక డీ బెనిటేజ్‌ నగరంలో సోమవారం ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు. జాతీయ భదత్రా విభాగానికి చెందిన సీనియర్‌ అధికారి కాన్వాయ్ లో ప్రయాణిస్తున్నారనీ, అతడిని లక్ష్యంగా చేసుకొని దుండగులు కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో సదరు అధికారితోపాటు, మొత్తం 16 మంది మరణించినట్లు చెప్పారు. ఈ ఘటనపై అలెజాండ్రో హెర్నాండెజ్‌ అనే అధికారి మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ ప్రకారం గుర్తు తెలియని దుండగులు పోలీసుల కాన్వారు పై కాల్పులు జరపడంతో 13 మంది మున్సిపల్‌ పోలీసులు మరణించారని తెలిపారు. దాడి చేసిన వారిని డ్రగ్‌ సరాఫరా చేసే ముఠాగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.