హమాస్‌ను సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక సంస్థగా చూసేబదులు కేవలం ఒక ఉగ్రవాద సంస్థగా పరిగణించడం అంటే పాలస్తీనా ప్రజానీకాన్ని లొంగ దీసుకోడానికి ఇజ్రాయిల్ సాగిస్తున్న అన్ని రకాల దుర్మార్గాలనూ విస్మరించడమే. అది అన్యాయమే కాదు, అనైతికం కూడా. దీనర్ధం మనం హమాస్ చేస్తున్నదంతా సక్రమమేనని సమర్ధిస్తున్నట్టు ఎంతమాత్రమూ కాదు. ఇజ్రాయిల్ ప్రభుత్వం, దాని కొమ్ము కాస్తున్న పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు ఒక జాతికి చెందిన ప్రజలను పాదాక్రాంతం చేసుకోడానికి, వారికి చెందిన భూభాగాన్ని ఆక్రమించుకోడానికి సాగిస్తున్న బల ప్రయోగాన్ని చాలా న్యాయమైనదిగా చెప్పుకోవడం ఎంతమాత్రమూ చెల్లదు అని స్పష్టం చేయాలి.
ఇప్పుడు ఇజ్రాయిల్‌కు, హమాస్‌కు నడుమ సాగుతున్న యుద్ధానికి వెంటనే ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. సంప్రదింపుల ద్వారా పాలస్తీనా సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని సాధించాలి. ప్రస్తుతం పాలస్తీనా లో జరుగుతున్న జాతి నిర్మూలనను ఆపాలి. ఆ ప్రజలపై ఇజ్రాయిల్ విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. గాజా భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాన్ని ఇజ్రాయిల్ విడనాడాలి. సమస్యను పరిష్కరించవలసిన ఐరాస ఇప్పుడు చేష్టలుడిగి నిస్సహాయంగా ఉండిపోయింది. భద్రతా మండలిని పని చేయనివ్వకుండా సామ్రాజ్యవాదులు అడ్డుకోవడమే దానికి కారణం. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ప్రజలందరినీ కదిలించడమే ఏకైక మార్గం.
హమాస్ అక్టోబర్ 7న చేసిన దాడికి ప్రతిస్పందించే పేరుతో గాజా భూభాగం మొత్తాన్ని ఇజ్రాయిల్ భారీ బాంబుల వర్షంతో ముంచెత్తింది. ఆ దాడిలో కనీసం 2000 మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. మరో 7000 మందికి పైగా గాయాలపాలయ్యారు. అంతటితో ఆగకుండా గాజాకు ఆహారం, విద్యుత్తు, గ్యాస్, మంచినీరు అందకుండా కట్టడి చేశారు. గత శుక్రవారం గాజా ప్రాంతంలో నివసిస్తున్న 22 లక్షల మంది ప్రజానీకానికి (వీరంతా కేవలం 365 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే జీవిస్తున్నారు) 24 గంటల్లోగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఆ ప్రాంతాన్ని ఇజ్రాయిల్ ఆక్రమించుకోడానికి సన్నాహాలు చేస్తోంది. ఐతే గాజా నుండి ఇజ్రాయిల్ పోవడానికి ఉన్న దారులన్నింటినీ మూసివేశారు. గాజా నుండి ఈజిప్ట్ పోవడానికి ఉన్న ఒకే ఒక్క దారినీ బాంబు దాడితో ధ్వంసం చేశారు. దాంతో ఆ దాడిని ఉపయోగించడానికి వీలు లేండా పోయింది. పైగా తన దేశంలోకి పాలస్తీనా శరణార్ధుల్ని అనుమతించబోనని ఈజిప్ట్ ప్రకటించింది. అంటే ఇజ్రాయిల్ ఆదేశించినట్టు గాజా భూభాగాన్ని ఖాళీ చేయడం అసాధ్యం అయింది.
ఒకవేళ గాజా నుండి బైటకు రావడానికి దారి తెరచి అనుమతించినా, 10 లక్షల మంది ప్రజానీకాన్ని, అందునా, వృద్ధుల్ని, రోగుల్ని, స్త్రీలను, చిన్నపిల్లల్ని, కేవలం 24 గంటల వ్యవధిలో ఖాళీ చేయించడం సాధ్యమేనా? గంటకు 42,000 మందిని ఖాళీ చేయించాలి. అంటే ఒక్క సెకనులో 12 మందిని ఖాళీ చేయించాలి. ఇది భౌతికంగా అసాధ్యం. ఇటువంటి గడువు విధించడం అంటే గాజా నివాసులను తమ భూభాగపు దాడుల ద్వారా అంతమొందించడాన్ని సమర్ధించుకోడానికి ఇజ్రాయిల్‌కు ఒక సాకు మాత్రమే. ''మేం ముందస్తుగానే హెచ్చరించాం. అయినా అక్కడ ప్రజలు ఖాళీ చేయకుండా ఉండిపోతే మరి మా సైనిక బలగాలు ఇంకేం చేస్తాయి?'' అని దబాయించడానికి ఈ 24 గంటల గడువు ఒక సాధనం. సైనిక బలగాలు దాడులు చేయకమునుపే ఖాళీ చేయాలన్న ఉత్తర్వులు కలిగించిన భయోత్పాతంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడి పెద్ద సంఖ్యలో జనం అన్ని వైపులా పరుగులు తీస్తున్నారు. దానికి తోడు రోడ్ల మీద బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా మరిన్ని వేలమంది ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన కళ్ళ ముందు ఇప్పుడు ఒక జాతిని నిర్మూలిస్తున్నారు.
''మొత్తంగా గాని, పాక్షికంగా గాని ఒక జాతి, లేదా తెగ లేదా మత సమూహాన్ని నిర్మూలించడానికి చేపట్టే చర్యలను జాతి నిర్మూలనగా పరిగణించాలి'' అని 1948 జెనీవా సదస్సులో ఐరాస తీర్మానించింది. ప్రస్తుతం గాజాలో సాగుతున్నది ఆ ఐరాస తీర్మానానికి సరిగ్గా సరిపోతుంది. ఐతే ఈ దారుణాన్ని సామ్రాజ్యవాద శక్తులు సమర్ధిస్తున్నాయి. హమాస్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ అని, అది ఇజ్రాయిల్ మీద దుర్మార్గంగా దాడికి తెగబడిందని, భవిష్యత్తులో కూడా హమాస్ నుండి దాడుల ముప్పు ఇజ్రాయిల్‌కు ఉందని, ఉగ్రవాద దాడుల నుండి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఇజ్రాయిల్‌కు ఉందని, హమాస్ దళాలు గాజా ప్రజానీకం వెనుక దాక్కుని ఉన్నందున హమాస్ ను లొంగదీయాలంటే గాజా మీద దాడులు అనివార్యం అని ఇజ్రాయిల్ దాడులను సామ్రాజ్యవాదులు సమర్ధిస్తున్నారు.
హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ అని సామ్రాజ్యవాదులు అన్నదానిని నరేంద్రమోడీ వెంటనే సమర్ధించేశారు. మాట వరసకి హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ అని అంగీకరించినా, ఒక దేశంలో ఉగ్రవాదులు దాక్కొని వున్నారు అనే సాకుతో ఆ దేశంలోని ప్రజానీకాన్ని తుదముట్టించే హక్కు ఏ దేశానికైనా ఉందని అంతర్జాతీయంగా ఏ చట్టమూ ఒప్పుకోదు. జెనీవా నాల్గవ సదస్సు తీర్మానం ప్రకారం ఏ కొద్దిమందో నేరం చేసినందుకు మొత్తం ప్రజానీకాన్ని, వారు వ్యక్తిగతంగా ఏ నేరమూ చేయకపోయినా, ఉమ్మడిగా శిక్షించడం యుద్ధ నేరంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ చేస్తున్నది ఉమ్మడిగా శిక్షించడం మాత్రమే కాదు. మొత్తం ఒక జాతినే నిర్మూలించే దాడి.
ప్రజలకు నీరు, విద్యుత్తు, ఆహారం అందకుండా నిరోధించడమే యుద్ధ నేరంగా పరిగణించబడుతుంది. సాధారణ పౌరులు జీవించే ప్రాంతాల్లో బాంబు దాడులు చేయడం కూడా యుద్ధ నేరమే ఔతుంది. అటువంటప్పుడు ఆచరించడానికి సాధ్యం కాని ఉత్తర్వులు జారీ చేసి ఆ గడువులోపల ఖాళీ చేయాల్సిందేనని ఒత్తిడి చేయడం కూడా యుద్ధ నేరమే ఔతుంది. ఐరాస కూడా ఇజ్రాయిల్ సాగిస్తున్నది యుద్ధ నేరమేనని ప్రకటించింది. ఇది జాతి నిర్మూలన తప్ప వేరొకటి కాదు.
హమాస్ దాడిలో మరణించిన ఇజ్రాయిలీ పౌరుల మరణాల గురించి వాపోతున్న పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధ నేరాల గురించి, అక్కడ ఇజ్రాయిల్ సాగిస్తున్న పాలస్తీనా జాతి నిర్మూలన గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదు. అంటే వాళ్ళ దృష్టిలో ఇజ్రాయిల్ పౌరుల ప్రాణాలకే విలువ ఉంది తప్ప పాలస్తీనియన్ల ప్రాణాలకు లేదు. ఇజ్రాయిల్ ప్రభుత్వం పాటిస్తున్న జాత్యహంకార ధోరణినే సామ్రాజ్యవాద దేశాలూ ప్రదర్శిస్తున్నాయి. ఆ ప్రభుత్వానికే మద్దతు కొనసాగిస్తున్నాయి. తమ తప్పుడు వైఖరిని సమర్ధించుకోడానికి వాళ్ళు బూటకపు కథనాలను సృష్టిస్తున్నారు. వాటిని ఇజ్రాయిల్‌లో ఉన్న మత విద్వేష శక్తులు ప్రచారం చేస్తున్నారు. యూదు బిడ్డల తలల్ని హమాస్ సైనికులు నరికివేశారన్నది అటువంటి కట్టుకథల్లో ఒకటి. వీటిని ఆసరాగా చేసుకుని గాజా ప్రాంతాన్ని మొత్తంగా తాము ఆక్రమించుకోవడం సరైనదేనన్న వాదనను ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవ్ గ్యాలంట్ ముందుకు తెచ్చారు. ''మేం పశువులతో పోరాడుతున్నాం. పశువులతో ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగానే వ్యవహరిస్తాం'' అని ప్రకటించారు.
కాని హమాస్‌ను ఒక ఉగ్రవాద సంస్థగా అభివర్ణించడం అంటే 75 సంవత్సరాల చరిత్రను చూడకుండా కళ్ళు మూసుకోవడమే. ఈ 75 ఏళ్ళ పాటూ పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయిల్ ఆక్రమించుకుంటూనే వుంది. పాలస్తీనా ప్రజల్ని దారుణంగా అణచి వేస్తూనే వుంది. చిత్రహింసలపాలు చేస్తూనే వుంది. వారి సంపదలను కొల్లగొట్టి నిరాధారులుగా నిలబెట్టింది. ఇటీవల నేను ఒక అంతర్జాతీయ ట్రిబ్యునల్‌లో న్యాయమూర్తుల బృంద సభ్యుడిగా వ్యవహరించాను. అమెరికన్ సామ్రాజ్యవాదం విధించిన ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్న 15 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు ఆ ట్రిబ్యునల్ ముందు సాక్ష్యం ఇచ్చారు. సుమారు మూడు నెలల ముందు గాజా నుండి వచ్చిన ప్రతినిధి మా ముందు తన సాక్ష్యం వినిపిస్తున్న సమయంలోనే గాజాలో బాంబుల మోత వినపడుతోంది. అక్కడ సాధారణ పౌరులపై బాంబింగ్ జరిగింది. అంటే అది స్పష్టంగా యుద్ధ నేరం ఔతుంది. ఈ విధంగా ఒకదాని వెంట మరొకటిగా ఇజ్రాయిల్ సాగించిన యుద్ధ నేరాలు గత కాలంలో సామ్రాజ్యవాదులు వలసలను ఆక్రమించుకుని అక్కడి స్థానికులను సామూహికంగా నిర్మూలించిన సందర్భాలను గుర్తుకు తెస్తున్నాయి. ఈ దాడులకు పరాకాష్ట అల్-అక్సా మసీదును ధ్వంసం చేయడం. హమాస్ దాడిని పురికొల్పిన వరుస సంఘటనల క్రమం ఇది.
అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం, ఇజ్రాయిల్ బలవంతంగా తమ భూభాగాలను ఆక్రమించుకుంటున్నప్పుడు సాయుధ ప్రతిఘటనతో సహా అన్న రకాలుగా ఎదుర్కొనే హక్కు పాలస్తీనియన్లకు ఉంది. 1983లో ఐరాస సర్వసభ్య సమావేశం తీర్మానం ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది: ''తమ స్వాతంత్య్రాన్ని, సరిహద్దులను, జాతీయ సమైక్యతను కాపాడుకోడానికి, వలసాధిపత్యం నుండి, జాతి వివక్షత నుండి, విదేశీ ఆక్రమణ నుండి విముక్తి సాధించడానికి, సాయుధ పోరాటంతో సహా అన్ని రకాల పోరాటాలనూ చేపట్టే అధికారం పాలస్తీనా ప్రజలకు ఉంది'' అని ఆ తీర్మానం స్పష్టం చేసింది. హమాస్‌ను సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక సంస్థగా చూసేబదులు కేవలం ఒక ఉగ్రవాద సంస్థగా పరిగణించడం అంటే పాలస్తీనా ప్రజానీకాన్ని లొంగ దీసుకోడానికి ఇజ్రాయిల్ సాగిస్తున్న అన్ని రకాల దుర్మార్గాలనూ విస్మరించడమే. అది అన్యాయమే కాదు, అనైతికం కూడా.
దీనర్ధం మనం హమాస్ చేస్తున్నదంతా సక్రమమేనని సమర్ధిస్తున్నట్టు ఎంతమాత్రమూ కాదు. ఇజ్రాయిల్ ప్రభుత్వం, దాని కొమ్ము కాస్తున్న పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు ఒక జాతికి చెందిన ప్రజలను పాదాక్రాంతం చేసుకోడానికి, వారికి చెందిన భూభాగాన్ని ఆక్రమించుకోడానికి సాగిస్తున్న బలప్రయోగాన్ని చాలా న్యాయమైనదిగా చెప్పుకోవడం ఎంతమాత్రమూ చెల్లదు అని స్పష్టం చేయాలి. ఇజ్రాయిల్‌లో సైతం అంతకంతకూ ఎక్కువమంది ప్రజలు ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నారు. ''సమస్యాత్మకంగా ఉన్న'' కొద్దిమంది ''ఉగ్రవాదులను'' గనుక ఏరిపారేస్తే ఇజ్రాయిల్‌కు శాంతి సుస్థిరంగా ఏర్పడుతుంది అన్న ఒక తప్పుడు అభిప్రాయాన్ని ఇజ్రాయిల్ ప్రభుత్వం ముందుకు తెస్తోంది. గత 75 సంవత్సరాల కాలంలోనూ అటువంటి శాంతిని ఎందుకు ఇజ్రాయిల్ ప్రభుత్వం నెలకొల్పలేకపోయింది? అన్న ప్రశ్నకు దాని వద్ద సమాధానం లేదు. ప్రస్తుతం సాగిస్తున్న జాతి నిర్మూలన కార్యక్రమాల వంటివి పాలస్తీనా ప్రజల తరఫున పోరాడే ఏదో ఒక సంస్థ నుండి (అది హమాస్ కావచ్చు, మరేదైనా కావచ్చు) తప్పకుండా ప్రతీకార చర్యలకు దారి తీస్తాయి. మరిన్ని ప్రాణాలు పోతాయి. మరింత హింసాకాండ చెలరేగుతుంది.
చరిత్రలో యూదు జాతీయులు అనుభవించిన కష్టాలను, ముఖ్యంగా యూరప్ లో నాజీల చేతుల్లో వారనుభవించిన బాధలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాతంత్రవాదులంతా సానుభూతితోనే చూశారు. ఐతే ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రభుత్వం, దాని కొమ్ముకాస్తున్న సామ్రాజ్యవాదులు గతకాలపు అనుభవాలను ఇప్పుడు ప్రస్తావిస్తూ తాము సాగిస్తున్న దాడులను సమర్ధించుకుంటున్నారు. ఆ క్రమంలో ఆ నాటి యూదు జాతీయులపై సాగిన ఊచకోత ప్రాధాన్యతను తగ్గించి వేస్తున్నారు. ఒకప్పుడు యూదులు ఏ విధమైన బాధలను, ఊచకోతను నాజీల నుండి ఎదుర్కొన్నారో, ఇప్పుడు పాలస్తీనా ప్రజల మీద వాటినే ఇజ్రాయిల్ ప్రయోగిస్తోంది. 1943లో వార్సా నిర్బంధ కేంద్రాల నుండి యూదులు నాజీల మీద సాగించిన తిరుగుబాట్లకు, ప్రస్తుతం గాజాలో జరుగుతున్న పరిణామాలకు మధ్య సామ్యం చూస్తున్నారు కొందరు. కాని నెతన్యాహుకి మాత్రం ఇవేమీ పట్టడం లేదు. సామ్రాజ్యవాదుల దన్ను చూసుకుని రెచ్చిపోతూ తన ఫాసిస్టు విద్వేష వైఖరినే ప్రదర్శిస్తున్నాడు. ''యూదు వ్యతిరేకత''ను అదుపు చేసే సాకుతో ఫ్రెంచి ప్రభుత్వం తన దేశంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపే ప్రదర్శనలను నిషేధించింది. తక్కిన పశ్చిమ సంపన్న దేశాలలో కూడా ఇదే మాదిరి ఆంక్షలు విధించారు.
ఇప్పుడు ఇజ్రాయిల్‌కు, హమాస్‌కు నడుమ సాగుతున్న యుద్ధానికి వెంటనే ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. సంప్రదింపుల ద్వారా పాలస్తీనా సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని సాధించాలి. ప్రస్తుతం పాలస్తీనా లో జరుగుతున్న జాతి నిర్మూలనను ఆపాలి. ఆ ప్రజలపై ఇజ్రాయిల్ విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. గాజా భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాన్ని ఇజ్రాయిల్ విడనాడాలి. సమస్యను పరిష్కరించవలసిన ఐరాస ఇప్పుడు చేష్టలుడిగి నిస్సహాయంగా ఉండిపోయింది. భద్రతా మండలిని పని చేయనివ్వకుండా సామ్రాజ్యవాదులు అడ్డుకోవడమే దానికి కారణం. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ప్రజలందరినీ కదిలించడమే ఏకైక మార్గం.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్