Oct 22,2022 07:08

గౌతమ్‌ అదానీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అప్పగించింది. అదానీకి ఇండోనేషియాలో సొంత బొగ్గు గనులున్నాయి. సొంత షిప్పులున్నాయి. ఇప్పుడు జెన్‌కోను కూడా అప్పగిస్తే అదానీ విద్యుత్‌ రేటు ఎంత చెల్లించమంటే రాష్ట్ర ప్రభుత్వం అంత చెల్లించాల్సిందే. అందుకే మోడీతో జగన్‌పై వత్తిడి తీసుకొచ్చి మరీ అదానీ జెన్‌కోను కైవసం చేసుకోబోతున్నాడు. వేల కోట్ల రూపాయల ప్రజల ఆస్తులను ఈ విధంగా కార్పొరేట్లకు అప్పగించడానికి సి.ఎం కు ఎవరు అధికారం ఇచ్చారు ! ?

విద్యుత్‌ నేడు నిత్యావసర సరుకు. ఆహార సరుకుల కంటే విద్యుత్‌ అవసరం నేడు పెరిగింది. ఒకప్పుడు విద్యుత్‌ కొరత తీవ్రంగా ఉండేది. 2017, ఆగష్టు 17వ తేదీన మన దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి మిగుల్లో ఉందని ప్రధాని మోడీ ప్రకటించారు. నేడు విద్యుత్‌ మిగులులో ఉన్నా ప్రజలు కొనుక్కోలేని స్థితికి నెట్టబడుతున్నారు. దానిలో భాగమే విద్యుత్‌ ప్రైవేటీకరణ. నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య విద్యుత్‌ జెన్‌కో అత్యంత ఆధునిక ధర్మల్‌ ప్లాంట్‌. దేశంలో వున్న అతి కొద్ది ఆధునిక ధర్మల్‌ ప్లాంట్లలో ఇది ఒకటి. 2022, అక్టోబర్‌ 27న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి జెన్‌కో మూడవ యూనిట్‌ ఉత్పత్తిని ప్రారంభించబోతున్నారు. ఇదే జెన్‌కో ఆపరేషన్‌ మరియు మెయిన్‌టినెన్స్‌ 25 సంవత్సరాల లీజుకు బిడ్లను రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 20 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నోటిఫికేషన్‌ జారీ చేసింది. జెన్‌కోను ముస్తాబు చేసి గౌతమ్‌ అదానీ లేదా వారి బినామీకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. దామోదరం సంజీవయ్య జెన్‌కోపై సలహా కోసం అదానీ కంపెనీ ఆడిట్‌ విభాగానికి చెందిన కన్సల్టెన్సీ కంపెనీకి అప్పగించింది. రాష్ట్రంలోని గ్రీన్‌ ఎనర్జీ పేరుతో రూ.45 వేల కోట్ల సోలార్‌ విద్యుత్‌ కంపెనీల నిర్మాణం కూడా అదానీకి అప్పగించేందుకు ఎ.పి క్యాబినెట్‌ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా మార్చే ప్రయత్నం ఇది.
         దీనికి వ్యతిరేకంగా అక్టోబర్‌ 17న నెల్లూరు జెన్‌కోకు వచ్చిన ఎమ్‌.డి ని కార్మికులు ఘెరావ్‌ చేశారు. జెన్‌కోకు నష్టాలు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించిందని ఎమ్‌.డి కార్మికులకు సంజాయిషీ ఇచ్చారు. ఇది పచ్చి అబద్ధం. విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ యావత్తును ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది. కార్పొరేట్లకు అత్యధిక లాభాలు రాబట్టడం కోసమే మోడీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం చేసింది. రానున్న కాలంలో ప్రజలపై విద్యుత్‌ భారాలు భారీగా పెరుగుతాయి. మోడీ వత్తిడికి లొంగి రాష్ట్ర ప్రజల సొమ్ము 21 వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన జెన్‌కోను రాష్ట్ర ప్రభుత్వం హారతి పళ్లెంలో పెట్టి మరీ అదానీకి అప్పగించబోతున్నది.
       దామోదరం సంజీవయ్య జెన్‌కో థర్మల్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి వ్యయం ఒక యూనిట్‌కు సుమారు 5 రూపాయలు అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం బయట ప్రైవేటు సంస్థల నుంచి యూనిట్‌ 7 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఖర్చు చేసి కొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం తమ చేతిలోని విద్యుత్‌ ఉత్పత్తిని ప్రైవేటు వారికి అప్పగించడం, ప్రైవేటు వారి నుంచి రెండు, మూడు రెట్లు అదనంగా ఖర్చు చేసి కొనడం తెలివితక్కువ పని కాదా!? ఆంధ్రప్రదేశ్‌లో జెన్‌కోలు అత్యంత సమర్ధవంతంగా నడుస్తున్నాయి. 2000 సంవత్సరంలో ప్రైవేటు జెన్‌కోలతో నాటి టిడిపి ప్రభుత్వం చేసిన తప్పుడు పవర్‌ పర్చేజింగ్‌ అగ్రిమెంట్లు (పిపిఎ) వల్లనే విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెరిగాయి. సిపిఎం, వామపక్షాల నాయకత్వంలో ప్రజలు రాష్ట్రమంతా 6 మాసాల పాటు విద్యుత్‌ ఛార్జీలకు వ్యతిరేక పోరాటం సాగించారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఈ ఉద్యమాన్ని బలపరచింది. ఈ ఉద్యమం ఆఖరులో బషీర్‌బాగ్‌ కాల్పుల్లో ముగ్గురు అమరులయ్యారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు తగ్గించక తప్పలేదు. 2004లో వై.ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రకటించింది. దాని తరువాత ఇరవై సంవత్సరాలు విద్యుత్‌ ఛార్జీలు పెరగలేదు. నేటికీ వ్యవసాయ ఉచిత విద్యుత్‌ కొనసాగుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు విద్యుత్‌ సంస్కరణలను మొండిగా అమలు చేయాలనే ప్రయత్నంలో భాగమే జెన్‌కో ప్రైవేటీకరణ.
        గౌతమ్‌ అదానీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అప్పగించింది. అదానీకి ఇండోనేషియాలో సొంత బొగ్గు గనులున్నాయి. సొంత షిప్పులున్నాయి. ఇప్పుడు జెన్‌కోను కూడా అప్పగిస్తే అదానీ విద్యుత్‌ రేటు ఎంత చెల్లించమంటే రాష్ట్ర ప్రభుత్వం అంత చెల్లించాల్సిందే. అందుకే మోడీతో జగన్‌పై వత్తిడి తీసుకొచ్చి మరీ అదానీ జెన్‌కోను కైవసం చేసుకోబోతున్నాడు. వేల కోట్ల రూపాయల ప్రజల ఆస్తులను ఈ విధంగా కార్పొరేట్లకు అప్పగించడానికి సి.ఎం కు ఎవరు అధికారం ఇచ్చారు!? ఐదు సంవత్సరాలపాటు మేనేజర్లుగా పాలించడానికే అధికారమిచ్చారు. అంతేగాని రాష్ట్ర సంపదను అమ్మడానికి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులకు ఓనర్‌ కాదు. 'ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌' (వ్యాపారాన్ని సులభతరం చేయడం) లో రాష్ట్రం వరుసగా మూడవ సంవతర్సం కూడా ఫస్ట్‌ వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర సంపదను అమ్మడం గొప్పతనం కాదు. మరో వైపున 6 షుగర్‌ ఫ్యాక్టరీలను మూసివేశారు. చిట్టివలస జూట్‌మిల్లును మూసివేశారు. డెయిరీలను మూసివేశారు. పారిశ్రామికీకరణ అంటే ప్రైవేటుపరం చేయడం లేదా మూసివేయడం అనే అర్ధం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2014 నుంచి అనేక రాష్ట్రాల్లో విద్యుత్‌ సంస్కరణలను అమలు చేయాలని ప్రయత్నించి ఘోరంగా విఫలమయింది. మోడీ నియోజకవర్గం వారణాసిలో విద్యుత్‌ పంపిణీని టాటా కంపెనీకి అప్పగించాలని ప్రయత్నించింది. కార్మికులు, అధికారుల ఐక్య పోరాటంతో యు.పి ప్రభుత్వం తోక ముడిచింది. యు.పి, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో విద్యుత్‌ పంపిణీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ పోరాటాలు జరిగాయి. విద్యుత్‌ సవరణ బిల్లును నాలుగు సార్లు కేంద్ర బిజెపి ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకతతో విరమించుకోవాల్సి వచ్చింది. గతంలో కేంద్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం మహారాష్ట్ర, ఢల్లీీ రాష్ట్రాల్లో చేతులు కాల్చుకుంది. అక్కడి తమ ప్రభుత్వాలను కోల్పోవాల్సి వచ్చింది. ఎ.పి లో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మొండిగా విద్యుత్‌ సంస్కరణలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. కార్మికులు, రైతులు, ప్రజలు ఉద్యమాలు చేపట్టడం అనివార్యం.

(వ్యాసకర్త : ఎ.పి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు)
సిహెచ్‌. నరసింగరావు

సిహెచ్‌. నరసింగరావు