Jan 01,2023 07:50

'కాశీపట్నం చూడర బాబు' నవల ద్వారా మణి వడ్లమాని రచనలతో నాకు తొలి పరిచయం. అప్పటికే ఆమె ఒక నవల, చాలా కథలు రాసి ఉన్నారు. వికసించినట్లుండే ముఖభావాలతో ఎపుడు కలిసినా ఆప్యాయంగా హత్తుకునే, తన వ్యక్తిత్వ లక్షణమేదో రచనల్లోకి కూడా ప్రవహిస్తుంది. దృష్టికోణానికి సంబంధించి ఆమె రచనలకీ జీవితానికి ఎక్కువ అంతరాలు లేవు. అందుకే తన భావజాలంతో ఏకీభావం ఉన్నవారిని, లేనివారిని కూడా ఆమె రచనలలోని నిజాయితీ ఆకట్టుకుంటుంది. సాహిత్యానికి ఉండాల్సిన ప్రధాన లక్షణాల్లో ఒకదాన్ని ఒడిసిపట్టిన మణి తాజా కథల సంపుటి 'గెలుపు గాయాలు'.
ఉత్తమ కథ, గొప్ప కథ నిర్వచనాలు చాలా మట్టుకు వ్యక్తిగత పాఠకానుభవం పరిధిలోనివి. కాబట్టి ఈ కథలకి అటువంటి విశేషణాలు ఇచ్చే పని పెట్టుకోవడం లేదు. నా అనుభవంలో నుంచి గుర్తించిన కొన్ని ప్రత్యేకతలను పంచుకుంటాను. అది కూడా చదువరుల ఏకాగ్రతకు భంగం కలుగకుండా, కథల ఉదాహరణల జోలికి పోకుండా. ఈ సంపుటిలోని పదమూడు కథల్లో దాదాపు అన్నీ స్త్రీ సమస్యల నేపథ్యంలో రాసినవి కావడం విశేషం. అందువల్ల స్త్రీల జీవితాల్లోని అనేక కోణాలను ఒకేచోట చదవడం వల్ల అవగాహన పదును తేలుతుంది. ముట్టుగదులు, వృద్ధాప్యం, మాచకత్వం, నిరంతర శ్రమ, అంతులేని హింస, అనుమానాలు, అవమానాలు, ప్రేమలు, త్యాగాలు, కురూపత్వాలు, సోదరీ తత్వాలు, ఇంటిపనివారు, చిరు వర్తకులు, స్వయంసిద్ధలు, ధీరలు, నల్లమ్మ, పళ్ళమ్మిలు.. ఒకరా ఇద్దరా! సంపుటి అంతటా పరుచుకున్న స్త్రీత్వం అపారమైన ప్రేమని పెంచుతుంది.
ఎంతటి కష్టంలో నుంచి అయినా సానుకూలతని వీడని పాత్రలు మరొక ప్రత్యేకత. నిజంగా మనుషులు ఇలా ఉంటారా అంటే, ఉండాలి అన్న ఆకాంక్ష ఉన్నవారి మనుసుని బలంగా తాకుతాయి ఈ కథలు. జీవితం, బరువెక్కిపోయి ఎంత కిందకి లాగుతున్నా, ఆ బరువును భుజానేసుకుని కొండలెక్కే జీవితేచ్ఛ మానవ జాతికి అత్యంత సహజం. ఆ సహజత్వాన్ని అలవోకగా ఎటువంటి శ్రమ లేకుండా చూపించారు మణి వడ్లమాని. ప్రతి కథలోనూ మంచిని గెలిపించారు. అయితే ఆ గెలుపు సులువుగా దొరకదు. అనేక గాయాలను చేస్తుంది అన్న ఎరుక కనబరిచారు. గెలుపోటములు రెండింటి వెనుకా అపారమైన విషాద అనుభవాలు ఉంటాయన్న తాత్విక ధోరణిని వ్యక్తం చేశారు.
ఆధ్యాత్మికతని కొత్తకోణంలో చూడటం ఈ సంపుటిలో కనబడుతుంది. స్వాములూ ఆశ్రమాల సాయాన్ని తీసుకుంటూనే కులమతాల మూర్ఖత్వాన్ని తిరస్కరిస్తూ అక్కడక్కడా వ్యాఖ్యలు కనబడతాయి. అదే సమయంలో ఆధునిక జీవన విధానాలు తెచ్చిన ఖాళీల పట్ల రచయిత్రికి స్పృహ ఉంది. అందుకే ఆ ఖాళీలను గుర్తించడంతో పాటు, వాటిని పూరించడానికి కావాల్సిన అన్వేషణని సూచనప్రాయంగా చెప్పారు. పరిగెత్తినంత మేరా బంగారం అవ్వాలని దురాశతో ప్రాణాల మీదకి తెచ్చుకున్న మిడాస్‌ రాజులా కాకుండా, మనకి దొరికే చిన్న చిన్న విషయాల నుంచి సంతోషాన్ని పొందడంలో శాంతి దొరకవచ్చని చెపుతారు.
సమకాలీనతని కథలకి ముడిసరుకుగా వాడుకున్నారు. కరోనా నేపథ్యంలో రెండు కథలు ఉన్నాయి. పిల్లల నిరాదరణకి గురైన తల్లుల వ్యథని చెప్పేవి, మీ టూ ఉద్యమాన్ని బలపరిచేవి, స్త్రీల మానసిక కల్లోలాలని పట్టించేవి, కాస్మోటిక్స్‌ రంగం రాజ్యమేలుతున్న వేళ స్త్రీల నల్లని శారీరక వర్ణం మీద సమాజం వివక్ష చూపే కథలు ఉన్నాయి. కొన్ని కథల్లో ఆశ్రమం, వృద్ధాప్యం, పెద్దవారి కష్టాల మీద ఎటువంటి తీర్పరితనం లేకుండా, బరువైన మాటలు వాడకుండా వ్యాఖ్యానించుకుంటూ వెళ్ళారు. వర్తమానం లో సమాజాన్ని అల్లకల్లోలానికి గురి చేసిన, చేస్తున్న అంశాలను కథా వస్తువులుగా, కథా నేపథ్యాలుగా ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా కరోనా సందర్భంలో ఆత్మీయులను, కుటుంబసభ్యులను కోల్పోవడం ఒక ఎత్తైతే ఈ విషాదాలు కొత్త మానవ సంబంధాల పరికల్పనకి పరోక్షంగా కారణమవడం ఒక కథలో చూస్తాము. మనిషికి మనిషి అవసరం ఎంత ముఖ్యమో తెలియజెప్పిన కరోనాకాలపు సంక్షోభం చిన్నకథలో ఇమిడిపోయింది.
ఈ పుస్తకం మొత్తం గంటా గంటన్నరలో చదివేయవచ్చు. సరళ శైలి మాత్రమే కాకుండా ఆపకుండా చదివించే ప్రవాహ గుణం ఈ సంపుటిలోని కథలకి ఉంది. వర్తమానం - గతం - వర్తమానం తరహాలో నడిచిన కథల్లో మొదటి వర్తమానంలో ఉత్కంఠ రేకెత్తించే ఘటనను ఎత్తుకుంటారు రచయిత్రి. అది గతానికి లీడ్‌ చేస్తుంది. అక్కడ కథా గర్భితమైన మూలం ఆవిష్కరింపబడుతుంది. రెండో వర్తమానంలో ఏదో ఒక పరిష్కారం వైపుకి పాత్రలు మరలుతాయి. నిడివి రీత్యా చిన్నవైన కథలో ఈ పరిణామం అంతా పొందుపరచడం శిల్ప ప్రత్యేకత. ఒకటి రెండు కథల్లో పాత్రల పేర్లు, ఘటనల విషయంలో కొంత గందరగోళం ఏర్పడటానికి ఈ టెక్నిక్‌ విఫలం కావడం కూడా కారణం కావొచ్చు. అయితే అది కథ చివరికి వచ్చేసరికి అనుభూతి గాఢతని ఏమాత్రం తగ్గించదు. యుద్ధం కథలో సాంప్రదాయక కథా నిర్మాణానికి భిన్నంగా కెమెరా కన్ను నుంచి కథని నడిపారు. ఒకనాటి రాత్రి రద్దీ రోడ్ల పక్కని ఫుట్‌పాత్‌ని త్రీడీ ఎఫెక్ట్‌లో చిత్రీకరించారు. బతకడమే యుద్ధమైన వారి జీవితాలు కెమెరా నుంచి చూస్తున్నట్లుగా రాయడం శిల్ప వైచిత్రికి ఉదాహరణ.
'మణి' అంటే మలయాళంలో కెంపు. 'ప్రవాళం' అంటే సంస్కృతంలో పగడం. ఈ రెంటిని కలిపి అల్లిన మిశ్రభాషలో రచనలు చేస్తే దానిని మణి ప్రవాళ శైలి అంటారు. భిన్న స్త్రీల జీవితాలను, వారి పోరాటాలను, గాయాలయినా సరే గెలిచినవారిని, గెలుపులో కూడా గాయాలను తప్పించుకోలేని వారిని ఈ సంపుటిలో చూస్తాము. ఒకరకంగా మణి అల్లిన భిన్న ప్రవాళ సంపుటం ఇది. ప్రేమమూర్తులు, త్యాగధనులు, అనాధలు, అశాంతులు, అన్నార్తులు, వంచితలు, తిరస్కృతులు, బహిష్కృతులు, స్త్రీలు - ఈ గెలుపు గాయాలు. లేపనం వంటి మణి వడ్లమానికి శుభాభినందనలు
 

- కె.ఎన్‌. మల్లీశ్వరి

గెలుపుగాయాలు
రచయిత : మణి వడ్లమాని
వెల: 100
అచ్చంగా తెలుగు పబ్లికేషన్స్‌
12-13-283, ఫ్లాట్‌:402
సహస్రత్రిపురా రెసిడెన్సీ
హైదరాబాద్‌ -500017
ఫోన్‌: 8558899478