Jul 16,2023 07:43

'అన్నా! కరపత్రం రెడీ అయిందా?' అడుగుతున్నాడు మిత్రుడు ఫోన్లో.
'సాయంత్రానికిచ్చేస్తాను' అన్నాను.
ఆకుపచ్చని కొండలు. దొంతర్లు దొంతర్లుగా కొండలనానుకొని పంట పొలాలు. కొండల మీంచి జారుతున్న జలపాతం.. ఆకుపచ్చదనం. కోతిపిన్లకర్రాట, బొండాట, సిర్తా బిల్లాట.. సింతపిక్కలాట.. ఒకటేమిటి నా బాల్యమంతా ఆటలు దిద్దుకున్న ఆకుపచ్చదనం. నన్నెత్తుకున్న ప్రతిచెట్టూ.. నన్ను హత్తుకున్న ప్రతి పుట్టా ఈ రోజు కనిపిస్తూ వుండొచ్చు. కానీ రేపు? కన్నెదార కొండా.. బోడికొండా.. ఎర్రమంటి కొండా.. ఒక్కొక్కటీ మాయమైపోతూ, సాలూరు కొండలూ, బాక్సైటు గనులూ.. అన్నీ ఆదివాసీ నివాసాలే. తవ్వకాలూ, సంపదా, అభివృద్ధి పేరుతో ఆదివాసీల్ని తరిమేయడం.
దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఐటీడీయేని ముట్టడించే కార్యక్రమం చేపట్టింది. దాని గురించే రాయాల్సి వుంది కరపత్రంలో.
టైమ్‌ చూశాను. స్కూలుకి వెళ్ళాల్సి ఉంది.
తరగతి గదిలో చెప్పాల్సిన పాఠం.. రాయాల్సిన కరపత్రం మదిలో మెదులుతున్నాయి.
చుట్టూ చూశాను. బస్‌ ఇంకా రాలేదని నిర్ధారించుకున్నాను. నాతో పాటు బస్సు ఎక్కాల్సిన వాళ్ళు అక్కడే వున్నారు. ఆ సెంటర్‌ ఒకప్పుడు నిర్మానుష్యంగా వుండేది. ఇప్పుడది మండల ముఖ్య వ్యాపార కేంద్రం. రోడ్డు పక్కనే ఎత్తయిన భవనాలు. వ్యాపార సముదాయాలు. జీడి పిక్కల వ్యాపారులు, కిరాణా, బట్టలు, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్లూ, బజాజ్‌ బైక్‌ షోరూములు, మారుతీ కారు షోరూములూ.. అన్నీ ఒకటేమిటి అన్నీ వ్యాపారంగా మార్చే అత్యాధునిక స్థలాలు. అన్నీ గిరిజనేతరులవే. ఈ భూములన్నీ స్థానిక గిరిజనులకే దక్కాల్సి వుండగా ఇవన్నీ ఎలా సాధ్యం? ఇక్కడ ఒన్నాఫ్‌ సెవెంటీ చట్టం వుందా? ఈ భూముల్ని కాపాడడానికి ఒక స్పెషల్‌ డెప్యుటీ కలెక్టరు కార్యాలయం కూడా వుంది. కానీ అది కూలడానికి సిద్ధంగా, ఏళ్ళ తరబడి ఆ పోస్టు ఖాళీగా. ఆ రోజు ఒకటి రెండు కుటుంబాలు మాత్రమే ఇక్కడ వుండి గిరిజన సంపదపై కన్నేసేవి. మరిప్పుడు? ఇవన్నీ ఎలా వచ్చాయి? ఈ భవంతులన్నీ ఎలా లేచేయి? ఈ కార్లన్నీ ఎక్కడినుండొచ్చాయి?
బస్‌ రావడంతో బడి గుర్తొచ్చింది. నేనటు నడిచాను.
గదిలోకి అడుగుపెట్టగానే పిల్లలు ముఖాల్లో వెలుగు. అందరూ గిరిజన పిల్లలే. అసలు పాఠశాలే గిరిజన సంక్షేమానికి చెందినది. నాతో సహా అందరూ కొండా కోనల్లోంచి వచ్చినవారే.
ఎన్వైర్న్‌మెంట్‌లో ''వాటీజ్‌ మేన్‌ వితౌట్‌ బీస్ట్స్‌'' పాఠం. రెడ్‌ ఇండియన్ల చీఫ్‌ సీటెల్‌ అమెరికా వాసులనుద్దేశించి చేసిన ప్రసంగం అది. వాషింగ్టన్‌ నిర్మించడానికి ఆ భూముల్ని తమ నుండి బలవంతంగా లాక్కున్నపుడు అయిష్టంగానే అంగీకరిస్తూ చేసిన ప్రసంగమది. మూవింగ్‌ స్పీచ్‌..! అందరి గుండెల్లో ఎప్పటికీ మారుమ్రోగుతున్న ఆకుపచ్చ సందేశం.
అసలు సీటెల్‌ అయిష్టంగానైనా తమ భూముల్ని ఇవ్వడానికి ఎలా అంగీకరించి వుంటాడు? ఐరోపా నుండి వలస వచ్చిన అమెరికన్లు స్థానిక నివాసులైన రెడ్‌ ఇండియన్ల భూములు లాక్కోవడానికి ఏ ప్రలోభాలు చూపించి వుంటారు? లేదా ఏమని బెదిరించి వుంటారు? అసలు అమెరికన్ల రాజధాని నిర్మాణం కోసం తన భూముల్ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?
'రెడ్‌ ఇండియన్లు ఎవరు సార్‌?' అడిగాడొక కుర్రాడు.
ఔను.. ఎవరు? భూములు కోల్పోయిన వాళ్ళు. ఎవరు రెడ్‌ ఇండియన్లు? రాజధాని రైతులని చెప్పాలా? పోలవరం గిరిజనులని చెప్పాలా? ఎలా చెబితే పిల్లలకు అర్థమవుతుంది?
చెప్పాను.. వాళ్ళూ మనలాగ గిరిజనులు. అతి పురాతన ప్రిమిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్‌. ప్రకృతిని దేవతలా కొలిచే అత్యంత సహజమైన మానవులు. ఈ భూమిపైన అణువణువూ పవిత్రమైనదేనని భావించే సమూహం. తన పూర్వీకుల జ్ఞాపకాలు చెట్లలో ప్రవహించే జీవరసమనీ.. పరిమళించే ప్రతి పువ్వూ అక్కచెల్లెళ్ళేనని.. పలకరించే ప్రతిజీవీ తమ అన్నదమ్ములే అని భావించే అతి పురాతన మానవ సమాజం అని చెప్పాను.
'కెన్‌ యు బై ఆర్‌ సెల్‌ ది స్కై? ఆర్‌ వార్మ్త్‌ ఆప్‌ ది ల్యాండ్‌?' అని అడుగుతున్నాడు సీటెల్‌ తరగతిగదిలో.
తరగతి గది సడెన్‌గా అడవిలా మారిపోయింది. సీటెల్‌ ఓ రాయి మీద కూర్చొని అక్కడికొచ్చిన అమెరికన్లనుద్దేశించి మాట్లాడుతున్నాడు. చుట్టూ రెడ్‌ ఇండియన్లు తమ తమ పెంపుడు జంతువులైన గుర్రాల మీద బర్రెల మీద కూర్చొని ఆసక్తిగా వింటున్నారు. వాళ్ళలో కొంతమంది డెస్క్‌ బెంచీల మీద కూడా కూర్చొని వున్నారు. జాగ్రత్తగా చూస్తే వాళ్ళు మా పిల్లలు.
రాయి మీద నుండి మాట్లాడుతున్నది నేనా? చీఫ్‌ సీటెలా?
అది రెడ్‌ ఇండియన్ల నేలా? తరగతి గదా?
'ఈ రోజు తెల్లవాడి నుండి ఒక వర్తమానం అందింది.' నా గొంతు నాకే గంభీరంగా వినిపిస్తోంది. దాదాపు మూడు చదరపు కిలోమీటర్ల మేర నిలబడి వున్న ప్రజలు సులభంగా వినపడగల ధ్వని ప్రసరిస్తోంది నా గొంతులోంచి. 'ఈ నేలను కొనాలనుకుంటున్నాను.. దేశ రాజధాని నిర్మించుకుంటానని.. ఈ నేల నుండి మనల్ని ఖాళీ చేయమని అంటున్నాడు.. ఇచ్చేద్దామా మన భూములూ?' ఇంకా బిగ్గరగా అడిగాను.
'నీకెందుకిస్తానూ భూమీ?' తిరిగి ప్రశ్నించిందొక గొంతు. అటు చూస్తే అది నాన్న. అతడికెదురుగా మా ఎమ్మార్వో చేతిలో ఏవో కాగితాలు పట్టుకుని. 'ఇక్కడ నర్సరీ ఎక్సటెన్షన్‌ చేస్తున్నాం ఈ పాక వున్న భూమిని ఇవ్వాల్సి వుంటుంది' అంటున్నారు.
'ఇవ్వనంతే ఇవ్వను' అంటున్నాడు నాన్న.
'సార్‌! ఏమ్మాట్లాడుతున్నారు?' పిల్లలెవరో అరిస్తే ఈ లోకానికొచ్చేను.
దేశమేదైనా..
కాలమేదైనా.. భూములు లాక్కోవడం. ఆదివాసీల్ని నిర్వాసితులుగా మార్చేయడం. ఇదే కదా చరిత్ర?! కాదు కాదు ఇదే కదా వర్తమానం?!
నేనున్నది గతంలోనా? వర్తమానంలోనా?
'మన కోసం పునరావాసం కొత్తగా నిర్మిస్తున్నారని, మనల్నందరినీ అక్కడికి వెళ్ళమని కోరుతున్నాడు. ఆ స్వరంలో అభ్యర్థన కంటే ఆదేశమే వినబడుతోంది. వెళ్దామా?' సీటెల్‌ అడుగుతున్నాడు మరోవైపు తరగతి గదిలో రాయి మీద కూర్చొని.
'వద్దు సార్‌! ఈ భూముల్ని రాజధానికోసం ఇవ్వొద్దు సార్‌! ఇది మన నేల. మన బతుకు లేకుండా ఆర్భాటం, హంగుల రాజధాని కోసం మనల్ని మనం కోల్పోవద్దు సార్‌!' పిల్లలు అరుస్తున్నారు.
అరుస్తున్నది పిల్లలా? భూములు కోల్పోతున్న రైతులా?
హఠాత్తుగా తరగతి గదిలో అలజడి.
'మీకోసం అత్యంత ఆకర్షణీయమైన పేకేజీ ఇస్తున్నాం. మీ భూముల్ని ప్రపంచ పెట్టుబడుల్తో అందంగా తయారుచేస్తాం. అభివృద్ధి చేసి మీకో ప్లాటిస్తాం. అక్కడ మీరు వ్యాపారం చేసుకోవచ్చు..' తాయిలాలు మండమీద బెల్లం రాసినట్టు.
'వ్యవసాయం ఎలాగూ లాభసాటిగా లేదు.. వ్యాపారమే మేలు.. ఒప్పుకుంటున్నాం ఒప్పుకొంటున్నాం. మీ పేకేజీ బహు బాగున్నది' గుంపులోంచి ఒకరు లేచి తన భూముల్ని అప్పగించేస్తున్నట్టు ప్రకటించేడు. అతని వెంట మరికొందరు. వాళ్ళకి శాలువా కప్పేరు ప్రతినిధులు. కడుపు నిండా భోజనం పెట్టి పంపించేరు.అక్కడి నుండి వెళ్ళిపోతున్న వాళ్ళు అస్థిపంజరాల్లా మారిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.
'ఆగండి! అందరూ అలాగే అనుకుంటే.. ఇక్కడ వ్యవసాయం ఎవరు చేస్తారు? రాబోయే తరాలు ఏమి తింటాయి? ప్లాస్టిక్కుతో నిండిపోతున్న భూమి మీద మనిషి తినాల్సింది అన్నమే కదా? ఒకటి కాదు రెండు కాదు. యాభైవేల ఎకరాలు. అది మామూలు సంఖ్య కాదు. ఒక తరానికి తరం కోల్పోతున్న అన్నం ముద్ద. వేలకు వేల కుటుంబాలు నిర్వాసితులుగా మారిపోతున్న సందర్భం.. ఆలోచించండి.. ఆలోచించండి.. ఆగండి!' మరికొందరు అరుస్తున్నారు.
వారి వెనక మరికొందరు.
ఆ సంఖ్య పెరిగిపోకుండా ఆ నేల మీద రెండు అస్త్రాలు ప్రయోగించారు.
ఒకటి భూసేకరణ. రెండు భూ ఆక్రమణ. రెంటి అర్థమూ ఒక్కటే. ప్రజల భూముల్ని ప్రభుత్వం లాక్కోవడం.
ఆ రెండూ ఖాకీ రంగులో అక్కడి గాల్లో వ్యాపించాయి. ప్రజలు ఒక్కసారిగా అరిచారు. ప్రాణ భయంతో చెల్లా చెదురైపోయారు.
సీటెల్‌ కళ్ళు మూసుకున్నాడు. ఈ దృశ్యం ముందే ఊహించగలిగాడతడు. అందుకే భూముల్ని తెల్లవాడికి అప్పగించడానికి అంగీకరించాడు.. మౌనంగా.
'నాయకా! ఏమిటీ మౌనం?' ఎవరో ప్రశ్నిస్తున్నారు.
ప్రశ్న ఒకటే.
గొంతులే వందలు..
కాదు వేలు..
కాదు కాదు.. లక్షలు..
కాదు కానేకాదు.. అనంతం.. బృందగానంలా.
కళ్ళు తెరిచాను. ఎదురుగా అడవుల్ని మోస్తోన్న అడవిబిడ్డలు. యూనిఫామ్‌ తొడుక్కుని అమాయకంగా డెస్క్‌ బెంచీలపై కూర్చొని.. ఒక్కొక్కరూ ఒక్కొక్క ప్రశ్నలాగా.
నిజం కదూ! వీళ్ళంతా ఇళ్ళూ, భూములు కోల్పోయిన నిర్వాసితులు.
ఔను.. నిర్వాసితులు.
హక్కుల్ని కోల్పోతున్న నిత్య నిర్వాసిత ఆదివాసీలు.
సీటెల్‌ చుట్టూ.. మోకరిల్లి నేల మీద తలలు వాల్చి కూర్చున్న ప్రిమిటివ్‌ ట్రైబల్‌ పిల్లలు.
సీటెల్‌ మళ్ళీ గొంతు విప్పాడు.. 'తప్పదు. మనం ఈ నేలను విడిచి వెళ్ళక తప్పదు. లేదంటే మన జాతే అంతరించిపోతుంది. ఆధునిక కుట్రపూరిత శక్తుల ముందు ఆదివాసులమైన మనం ఎదురు నిలబడి పోరాడలేం. ఇది చీకటి కాలం. ఇప్పటికిప్పుడు యుద్ధానికి దిగితే మరణం తథ్యం. అది నాకిష్టం లేదు. ప్రవాసం అనివార్యం. ఎవరో కవి అన్నట్టు 'ప్రవాసమూ ఒక యుద్ధ రహస్యమే'. తప్పదు.. ఈ నేలని ఖాళీ చేసి ఆ నిర్వాసిత కట్టడాల్లోకి వెళ్దాం పదండి' సీటెల్‌ నన్నావహించాడు. నా గొంతు నాలోనే ధ్వనిస్తోంది రహస్యంగా.. స్పష్టంగా..
స్వరంలో కన్నీళ్ళు..! లక్ష గొంతుల నిర్వాసిత హోరు..!
'నిర్మాణాలు..! ఆధునిక నిర్మాణాలు...!!
ప్రజని నిర్వాసితులుగా మార్చే దు:ఖ నిర్మాణాలు..!!
ఓట్లకోసం..
పడగలెత్తే కోట్ల కోసం..
అందలమెక్కించే అసెంబ్లీ సీట్లకోసం..
నిర్మాణాలు.. ఆధునిక నిర్మాణాలు..' నా గొంతు తరగతి గోడలమీద రాసిన అక్షరాల్లా ధ్వనిస్తోంది.
'సార్‌! కవిత్వమా!' ఎవరో అడుగుతున్నారు. తరగతి తదిలోపలి నుంచా? గుండెగది లోపలినుంచా?
'కాదు కాదు. ప్రజల గొంతు. వారి కన్నీళ్ళను అనువదిస్తున్నాను' నేనే చెప్పానా మాట.
'అర్థం కాలేదు. మరోలా చెప్పండి. ఒక ఉదాహరణమివ్వండి.' నా ఒడిలోకొచ్చి నా చెక్కిలి మీద చేయాన్చి అడుగుతున్నాడు మరొకరు.
గొంతు సవరించుకున్నాను. నా ఎదురుగా కుతూహలం కుప్పల్లా కూర్చొని ఉంది. బెంచీల మీద.. పుస్తకాలు ముందేసుకొని.
'ఇది నిర్వాసిత కాలం. ప్రజలంతా నిర్వాసితులుగా మారే కాలం. నేలను మాత్రమే కాదు, తమ బతుకుల్ని తాము కోల్పోతున్న కాలం. తమకు తెలీకుండానే నిర్వాసితులుగా మారిపోతున్న కాలం. మనిషి మనిషన్న సంగతి మర్చిపోతున్న కాలం. ఒక జాతి అంతరిస్తున్న కాలం. ఔను! ఒక తరం తరవాతి తరంతో బంధనాల్ని తెంపుకుంటోన్న కాలం.'
' కాలం సరే! కారణాలు చెప్పండి' కాలాన్నీ, కవిత్వాన్నీ అర్థం చేసుకోలేకపోతున్న మరో విద్యార్ధి అడిగాడు.
వాడిని దగ్గరగా చేర్చుకున్నారు. అవే మాటల్ని మరోలా చూపించాను.
'ఇక్కడ చూడండి! మరొక నిర్మాణం' అని కొన్ని పాత దిన పత్రికల్ని చూపించాను.
'సార్‌! ఇది పోలవరం! నవ్యాంధ్ర మెడలో పూలహారం' అరిచాడో కుర్రాడు.
నవ్వొచ్చింది. బిగ్గరగా నవ్వేను.
'ఎందుకు నవ్వుతున్నారు సార్‌!' అయోమయంగా అడిగాడు అదే కుర్రాడు.
వాడి భుజమ్మీద చెయ్యేసి నడిపించాను. మా వెనుక తరగతి నడుస్తోంది. 'కవిత్వమంటే కళాత్మకంగా చెప్పడమొక్కటే కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పడం కూడా' అన్నాను.
'అంటే? నేను చెప్పింది అబద్ధమా సార్‌?'
'ఔనన్నాను. నీ కవిత్వానికి దినపత్రికల సమాచారం మాత్రమే ఆధారం కకూడదు.'
'ఎందుకని సార్‌?'
'పత్రికలు చెప్పినవన్నీ నిజాలు అవ్వాలని రూల్‌ లేదు.'
'మరి?'
'కవిత్వం నిజాన్ని ప్రతిబింబించాలి. పత్రికల్లో వచ్చిందీ, ప్రభుత్వాలు చెప్పిందీ మాత్రమే నిజం కాదు. అందుకే పోలవరం పూలహారం అంటే నవ్వాను.'
'మరి నిజమేంటో ఎలలా తెలుస్తుంది సార్‌?'
'పోలవరం అంటే ప్రాజెక్టు మాత్రమే కాదు. పోలవరం అంటే ఆదివాసీ నిర్వాసితుల శాపం కూడా. వాళ్ళతో మాట్లాడితే తప్ప నిజాలు తెలీవు.'
'నిజం. అక్కడికి వెళ్ళకుండా, ఆ నిర్వాసితులతో మాట్లాడకుండా పోలవరం గురించి మాట్లాడే హ్కఉ్క మనకెవరికీ లేదు.' చివరి బెంచీ విద్యార్థి అన్నాడు.
'అందుకే ఇక్కడికొచ్చాం' అని ఆగాను. నా వెనుక వాళ్ళు..
తరగతి గది ఇప్పుడు..
రేకుల షెడ్డులతో..
ఉన్న ఊరికి దూరంగా సిమెంటు గోడలతో..
మనుషుల నిండా కన్నీళ్ళతో..
భూములు కోల్పోయి పనుల్లేక దిక్కుతోచని మనుషులతో..
ఒక నిర్వాసిత గ్రామంగా మారిపోయింది.
విద్యార్ధులు ఇంటర్వ్యూ చేస్తున్నారు.
వారితో మాట్లాడుతున్నది నేనో! పోలవరం నిర్వాసితుడినో!? రెడ్‌ ఇండియన్ల చీఫ్‌ సీటెల్‌నో..! మాట్లాడుతున్నాం అంతే..
'నేనూ.. నిర్వాసితుడిని! ఈ నేలమీద నన్ను నేను కోల్పోయిన ఒక నిర్వాసితుడిని.. ఒక ఆదివాసీని. నా నేలను కోరుకున్నావంటే నా హక్కుల్నీ కోరుతున్నట్టే..
పిల్లలు శ్రద్ధగా వింటున్నారు.
'నీ పిల్లలకు చెప్పాలి.. వాళ్ళ పాదాల కింద ఉన్న నేల మా పూర్వీకుల అస్థికలతో నిండి ఉన్నదని. ఈ మాటనే ఆధునిక కవి మరోలా అన్నాడు. 'నేలంటే తాత ముత్తాతల మాంసాస్థికలలోంచి పుట్టుకొచ్చిన బతుకు పువ్వు' అని. ఆ మాటకు అర్ధం తెలుసా? ఈ సందేశం పంపించి నా నేలను సొంతం చేసుకోవాలనుకున్నావు.. అలా అనుకోవడంలో ఈ నేలను జయించానని విర్రవీగుతున్నావు.. కానీ ఈ నేల అలా అనుకోదు. నీ వెర్రి తనానికి నవ్వుకుంటుంది. ఎందుకంటే నేలను ఎవ్వరూ జయించలేదు. నేలే మన్ని జయిస్తూ వస్తోందో. మనిషి నేలకు చెందినవాడు కానీ నేల మనిషికి చెందింది కాదు. ఈ సత్యాన్ని ఎప్పుడు నువు గ్రహిస్తావో నాకర్ధం కావడం లేదు. ఎందుకంటే నీ దృష్టిలో నేనొక ఆదివాసీని.. అడవి మనిషిని.. అజ్ఞానిని.'
'మా హక్కులు మాక్కావాలి'
'ములిగిపోయింది భూమి కాదు.. మా బతుకు. మా ఉనికి.. మా చిరునామా'
'మాకు మా షెడ్యూల్డ్‌ ఏరియా హక్కులు కాఆలి' నినాదాలు..
జెండాలు.. మనుషులై ఎగురుతున్న నిరసనలు.. సీటెల్‌ మాటలకు కొనసాగింపులా. అధికారం ఆలకించని ఆర్తనాదాల్లా.
'మిష్టర్‌ సీటెల్‌! ఎక్కడున్నామో తెలుస్తోందా మీకు?' ఏ ప్రదేశం గురించి మాట్లాడుతున్నామో తెలుసా అని అర్ధంలో అడుగుతున్నాడు మూడో బెంచీ మీదున్న గ్రామస్తుడు.
'తెలుసు! దేశమేదైనా భూమొక్కటే. మనిషెక్కడి వాడైననా జీవమొక్కటే. బాధ ఎక్కడిదైనా ఆక్రందన ఒక్కటే! నా మాట నమ్మకపోతే అటు వినండి!' అని నా చూపుడు వేలుని అటుగా చూపించాను.
పిల్లలందరూ ఒకేసారి అటువేపు తలలు తిప్పి చూశారు.
భారీ తవ్వకాలతో పోలవరం! ఎత్తైన ఇనుపగోడల నిర్మాణం!!
అవతల గోదావరి..!
నిండా నీళ్ళతో..!
కాదు కాదు ములిగిపోతున్న ఆదివాసీల కన్నీళ్ళతో..!
మాయమైపోతున్న అడవి నేల మూగరోదనతో..!
ఇవతల..
నిర్వాసిత కట్టడాలుగా ఊళ్ళు..!
దళారి చేతుల్లో దగాపడుతూ ఆదివాసీ!
ఎంగిలి మెతుకుల్ని పేకేజీల్లో విసురుతూ.. చిద్విలాసంగా నాయకులు!
'సార్‌! బెల్‌ అయి చాలాసేపయింది' గది బయట తర్వాతి పీరియడ్‌ చెప్పాల్సిన మాష్టారు దీనంగా ఉన్నారు.
ఔను! ఒక పీరియడ్‌ పూర్తయింది.
బయటికొస్తుండగా స్టాఫ్‌ రూమ్‌లో నా మొబైల్‌ మోగింది. మిత్రుడు గుర్తు చేస్తున్నాడు. 'మిత్రమా! కరపత్రం తయారయ్యిందా? మనకంతగా సమయం లేదు ప్రింటింగ్‌కిచ్చేయాలి' అని.
ఔను..
సమయం లేదు.

మల్లిపురం జగదీష్‌

(విశాఖ ఫెస్ట్‌ 2018 కథలపోటీలో ప్రథమ బహుమతి పొందినది)