May 21,2023 08:09

చిరునవ్వుల చిగురుల్ని తొడిగి
పలకరింపుల పూతా పిందెల్ని కల్గి
కొమ్మా రెమ్మలతో కలివిడిగా పెరిగి
పసిరిస్తూ మసలాల్సిన
చెట్టులాంటి మనిషి
నీటి ఎద్దడి నెరల నేలమీద
అస్థి పంజరాల్ని మరిపించే
పుల్లిరిగిన ఎండుకంపల్లా
మలమలా మాడే ముఖాలేసుకుని
వైద్యంలేని అహం రోగానికి చిక్కి
కొట్టుమిట్టాడుతోంది మా పేటిప్పుడు
మాట పట్టింపుల కొండెక్కి కూర్చుని
పంతాల ప్రహారాల్ని
కట్టుదిట్టంగా కట్టుకుని
ఎవరి నోళ్ళకు వాళ్లే
మౌన తాళాలు బిడాయించుకుని
ఇప్పటికే.......
నాలుగు క్యాలెండర్లు పాతసామాన్ల
''కొట్టుకెల్లిపోయాయి''
జీవించడమే మర్చిపోయేంతగా
నటనకు జీవంపోస్తూ
ఇరుగు పొరుగులు
దారుల్లో దసూలవుతున్నా
చూసీ చూడనట్టుగా
ఒకోసారి మోరపైకెత్తుకుని నడుస్తూ
గొప్పుల్ని తన్నుకోవడం
ఒకోసారి చూపుల్ని నేల్లో పాతేసుకుని
చెట్టునో గుట్టనో తన్నుకోవడం
అవార్డులు కూడా చిన్నబోయేంతగా
ఎంతటి నటనాచాతుర్యం!?
కరువు బరువుల్ని మోసినన్నాళ్లు
కల్సిమెల్సి బతికినోళ్లకు
రెండుపూటలా నాలుగు వేళ్ళూ
నోట్లోకి వెళ్లేసరికల్లా
ఆకలి రోగం చచ్చి
అహం రోగం పుట్టు కొచ్చి
ఎవరికి వారుగా ఎడ ముఖం
పెడ ముఖంగా తగలడే మా పేటకు
అపార్థాల పెనుమంటల్నార్పి
మానవత్వ మూలాల్ని నిలబెట్టడానికి
ప్రేమ జలనిధుల్ని గుండెల్నిండా నింపుకున్న గంటల కారులాంటి
నా కన్నతండ్రి నాతండ్రి కాలంనాటి మర్మమెరగని మనసున్న మనుషులు
మళ్లీ మళ్లీ పుట్టుకు రావాలేమో
అపార్థాల పెనుమంటల్ని తగలెట్టడానికి!?

మోకా రత్నరాజు
99890 14767