Mar 29,2023 12:29

గన్నవరం (విజయవాడ) : ఇక నుండి నేరుగా విజయవాడ గన్నవరం నుండి కువైట్‌ కు వెళ్లేందుకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈరోజు చాలామంది కువైట్‌కు వెళ్లేందుకు టికెట్లను బుక్‌ చేసుకున్నారు. కానీ తొలిరోజే ఎయిరిండియా చేసిన పొరపాటుకు ప్రయాణీకులంతా ఖంగుతిన్నారు.

షెడ్యూల్‌ ప్రకారం ... ప్రతి బుధవారం ఉదయం 9.55 గంటలకు విజయవాడ గన్నవరం నుండి విమానం బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కువైట్‌ కు చేరుకుంటుంది. మళ్లీ కువైట్‌లో సాయంత్రం 3.40 గంటలకు బయలుదేరి రాత్రి 8.35 గంటలకు తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకుంటుంది.

కువైట్‌ కు వెళ్లాల్సిన విమానం ఈరోజు ఉదయం 9.55 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, వారికి ఇష్యూ చేసిన టికెట్లలో మాత్రం మధ్యాహ్నం 1.10 గంటలకు అని ఎయిరిండియా పేర్కొంది. టికెట్లపై మధ్యాహ్నం 1.10 గంటలకు విమానం అంటూ ముద్రించారు. గన్నవరం నుండి కువైట్‌కు 85 మంది ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకోగా.. ఉదయం 9.55 గంటలకు విమానం బయలుదేరే సమయానికి 67 మంది ప్రయాణికులు మాత్రమే గన్నవరం చేరుకుని కువైట్‌ కు వెళ్లిపోయారు.. టికెట్‌ పై మధ్యాహ్నం 1.10 గంటలకు అని ఉండటంతో ఆలస్యంగా 11 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు.. మరికొంత మంది ప్రయాణికులు కూడా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. విమానం ఎప్పుడో కువైట్‌ కు బయలుదేరిపోయిందన్న విషయం తెలిసి ప్రయాణీకులు ఖంగుతిన్నారు. ఆందోళన చెందిన ప్రయాణీకులంతా ఎయిరిండియా తప్పదంపై ప్రశ్నించగా డబ్బులు రీఫండ్‌ చేస్తామని సిబ్బంది చెప్పడంతో.. ఎయిరిండియా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇకేముంది... గత్యంతరం లేక తిరిగి ఇంటి దారి పట్టారు.