
వినాయకుడు ఇంకా నిద్ర లేవటానికిముందే ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది తల్లి పార్వతి. మూషికుడు కూడా ముందుగానే సిద్ధమయ్యాడు. అనునయంగా ఒకసారి, ఆదుర్దాగా ఇంకోసారి, అత్యవసర మోడ్‌లో మరోసారి- పార్వతమ్మ పిలిచి, తట్టి, గట్టిగా ఊపితే తప్ప వినాయకుడు కళ్లు తెరవలేదు.
''ఇంకాసేపు నిద్రపోనివ్వొచ్చు కదా, మమ్మీ...'' అన్నాడు ముద్దుగా.
''పోవొచ్చు పోవొచ్చు.. కానీ, ఈరోజు నీ పుట్టిన్రోజు. ఇప్పటికే నీ పండగ సంబరాలు మొదలై పోయాయి. తొందరగా రెడీ అవ్వు. బయటికి వెళ్లి మండపాలను సందర్శించండి. ప్రసాదాలు స్వీకరించండి.'' అని తొందరపెట్టింది పార్వతమ్మ.
బొజ్జ తడుముకుంటూ విసుగ్గా వీక్షించిన గణేషుడిని చూసి, కిసకిసా నవ్వుకున్నాడు మూషికుడు.
''రాత్రి ఎంత లేటుగా పడుకున్నానో నీకు తెలుసు కదా! ఎందుకంత విలాసంగా నవ్వుతున్నావు?'' అని మూషికుడిని మురిపెంగా కసురుకొని, వాష్ రూమ్‌లోకి నడిచాడు వినాయకుడు.
''నిద్ర కోసమే ఇంత కోపమా దేవా ...
మున్ముందున ఇడుములెన్నో, రావా..'' అని తనలో తానే అనుకోబోయి, బయటకే అనేశాడు మూషికుడు.
''ఏంటీ, ఇడుములా?'' అని కంగారుగా లోపలి నుంచి అరిచాడు లంబోదరుడు.
''ఇడుములు కాదు, కుడుములు కుడుములు ..'' అని బదులిచ్చి, కూనిరాగం తీసుకుంటూ పార్వతమ్మకు సాయపడటానికి వంటింట్లోకి దూరాడు మూషికుడు.
స్నానపానాలు ముగించి, ఒకపరి అక్కడి నుంచి నేరుగా మండపాల వైపు తేరిపారా చూశాడు గణపతి. ఏర్పాట్లు ఘనంగా జరిగి, మండపాలు కనుల పండగగా అమర్చి, రకరకాల కొత్త కొంగొత్త రూపాల్లో అలంకరణలు జరిగి కనిపించేసరికి- మనసుకు మహోత్సాహంగా అనిపించింది. ఎలుక వాహనం వైపు ఓరకంట చూసి ఒకింత సంబరంగా నవ్వాడు.
ఎలుక వాహనం ఏదో వైపు చూస్తున్నట్టు చూసి, లోలోపల నవ్వింది.
''ఏమైంది నీకు? ఇందాకటి నుంచీ నీ వరస తేడాగానే ఉంది.'' అనడిగాడు.
''ఏం లేదు నాయకా.. సిద్ధం కండి. బయల్దే రదాం.'' అన్నాడు మిస్టర్ మూషిక్.
''సరే .. నీ ముసిముసి ముసలి నవ్వులు సరిపెట్టి, డ్రెస్ సెలెక్టు చేయడంలో సహాయపడు కాస్త. ఏ మండపంలో కొత్త మోడల్ ఉందో వెతికి పెట్టు.'' అని అడిగాడు వినాయకుడు.
ల్యాప్‌టాప్ తెరచి, ఇంటర్నెట్‌లో వీక్షించటం మొదలెట్టాడు మూషిక్. ఓ మండపంలో వినాయక విగ్రహానికి ''తగ్గేదేలే'' స్టయిల్లో గెటప్ కనిపించింది. ఓ తెలుగు సినిమా హీరో అభిమానులు ఏర్పాటు చేసిన మండపం అది.
మూషికుడు ఆ డ్రెస్ చూపించాడు. వినాయకుడికి తెగ నచ్చేసింది. వెంటనే ఆ డ్రెస్‌లోకి మారిపోయి, ''తగ్గేదేల్యా'' అని గడ్డం కింద నుంచి స్టయిల్‌గా చేతిని పోనిచ్చి, పోజిచ్చాడు. మూషికుడు మళ్లీ వెనక్కి తిరిగి నవ్వుకున్నాడు.
''చూడమ్మా .. ఈ ఎలక వాహకుడు ఎలా నవ్వుతున్నాడో ...'' అమ్మకు ఫిర్యాదు చేయబోయేంతలో- పార్వతి అక్కడికి వచ్చింది. వస్తూ వస్తూ తన వెనక సనాతన వినాయకుడిని తోడ్కొని వచ్చింది!
సనాతన వినాయకుడు ఈ వినాయకుడికి అవటానికి అన్నయ్యే కానీ, మరీ చిన్నోడిలాగ కనిపిస్తాడు. ఒళ్లంతా పసువు పూసుకొని, జుట్టును పిలకలాగా ముడివేసుకొని, చిన్న గావంచా మాత్రమే కట్టుకొని ఉన్నాడు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆధునిక గెటప్‌లో ఉన్న వినాయకుడు. తమ్ముడి వైపు తటపటాయిస్తూ వీక్షించాడు సనాతన వినాయకుడు.
''ఇద్దో గణపతీ... నీతో పాటు ఈ సనాతన అన్నను కూడా పర్యటనకు తీసుకొని వెళ్లు. నీలా లోకం పోకడ తెలిసినవాడు కాడు. కాస్త కని పెట్టుకొని ఉండు.'' అంటూ అప్పగింతలు మొదలు పెట్టింది అమ్మ.
పొద్దున్నుంచి ఎలకయ్య ఎందుకు నవ్వుతున్నాడో అర్థమైంది గణేషుడికి. గుర్రుగా చూశాడు. ఈసారి పకపకా నవ్వాడు మూషికుడు. ఇంకా నిండా ఆరగించలేదు కాబట్టి వినాయకుడి పొట్ట పదిలంగానే ఉంది కానీ, లేకుంటే ఆ నవ్వుకి పగిలిపోయేది.
''ఇదంతా నీకు ముందే తెలుసన్నమాట! ఇంటి దగ్గరే అనేకనేక విషయాల మీద సనాతన అన్న ఎన్నెన్ని అభ్యంత రాలు చెబుతాడో నీకు తెలుసు. ఇక అన్నను వెంట బెట్టుకొని వెళితే - సందర్శన సాగినట్టే!'' అని ఉస్సూరమనిపోయాడు వినాయకుడు.
''అమ్మా .. అన్న ఎందుకమ్మా నాతో. తనను విడిగా వెళ్లమనొచ్చు కదా!'' అన్నాడు.
''బుజ్జి కన్నా .. అన్న ఆ పూజా మండపాల దారులూ తీరులూ మరిచి ఎన్నో వేల ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఒంటరిగా వెళితే కంగారు పడతాడు. నీ వెంటే క్షేమం.'' అంది అనునయిస్తూ.
ఈలోగా సనాతన అన్న తమ్ముడి డ్రెస్సు మీద అభ్యంతరం లేవనెత్తాడు. ఇలాంటి వస్త్రధారణ మన ఇంటా వంటా ఉందా?'' అని తండ్రి పులి చర్మధారణ కథను వివరించటం మొదలు పెట్టాడు. సాంప్రదాయాన్ని మంట గలుపుతున్నాడని తమ్ముడు వినాయకుడి మీద విరుచుకుపడ్డాడు.
''ఔరా.. ఆదిలోనే హంసపాదు'' అని నెత్తికొట్టుకున్నాడు మూషికుడు.
''చేసిందంతా చేసి, ఇందాక నాకు డ్రెస్సు కూడా సెలక్టు చేసి, ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావు కదా?'' అన్నాడు వినాయకుడు.
''అలా ఏం లేదు ప్రభూ... పొద్దున మీరు హాయిగా బజ్జొని ఉన్నప్పుడే అమ్మ ఈ అన్నయ్య సంగతి నాకు చెప్పింది. ఇంకా ముందే తెలిస్తే మీకు విన్నవించకుండా ఉంటానా? సరే.. పర్యటనకు ఆలస్య మవుతోంది. బయల్దేరదామా?'' అని వినమ్రంగా అడిగాడు మూషిక్.
''నాన్నా .. డ్రెస్సు మార్చుకోరా మరి!'' గోముగా అంది పార్వతమ్మ.
దబదబా కాళ్లు నేలకు తాడిస్తూ, లోపలికి వెళ్లాడు గణపతి.
నారపంచె ధరించి, నీరసంగా బయటికి వచ్చాడు.
''ఎంత మంచి పిల్లాడో ...'' అని మురిపెంగా చూసింది అమ్మ.
''నాన్నా .. అన్న చెప్పినట్టే విను. అన్న ఉద్దేశాలు ఏమిటో ఇప్పుడు విను. లక్షరాలా అవే పాటించు.'' అంది. ''ఇప్పుడు నువ్వు వివరించు సనాతనా ...'' అని సనాతన వినాయకుడి వైపు చూసింది.
సనాతనుడు శ్లోకాలు కొన్ని పఠించి, ఇలా వివరించటం మొదలు పెట్టాడు.. : ''పసుపుతోనూ, మట్టితోనూ చేసిన బొమ్మలనే తిలకించాలి. ఆధునిక పొయ్యిల మీద తయారు చేసిన కుడుములను భుజించరాదు. నదులు, వాగుల వెంబడి ప్రవహించు నీటినే తాగాలి. ధనధనామని శబ్దములు చేయు సంబరాలను వీక్షించరాదు. కళ్లు మిరుమిట్లు గొలుపు విద్యుత్ దీపాలంకరణల దరికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాదు. ఇతర దేశ్యముల నుంచి వచ్చి ఇచట సాగు చేసిన ఎలాంటి ఫలాలను ముట్టుకోరాదు. మైకులు మైషాసురుడు వంటివి. అందు మంత్రాలను, వ్రత కథలను చదవరాదు. చదివినా వినరాదు. పెద్ద పెద్ద లడ్డుల తయారీ, వాటి వేలం వేసే వెర్రితనమూ నిషేధించవలెను. ఆధునిక వస్త్రాలు ధరించిన భక్తులు ఉండు చోటుకు పోరాదు. మండపాలన్నీ గడ్డితోనూ, మట్టితో మాత్రమే నిర్మించి ఉండాలి. అలాంటి చోట్లనే మనం దర్శించాలి. ఇవి ఇప్పటికి కొన్ని. ఆయా సందర్భాలను బట్టి మరికొన్ని సనాతన ధర్మాలు అప్పటికప్పుడు వివరిస్తాను.'' అని ముగించాడు.
''ఇక నడవండి వెనక్కు. కాదు కాదు ముందుకు..'' అన్నాడు మూషికుడు నవ్వుతూ.
''నడవాలా? ఓలా వాహనం బుక్ చేయలేదా?'' అని నీరసంగా అన్నాడు వినాయకుడు.
''ఇంతవరకూ సనాతన అన్న గారి ఉపన్యాసం విని కూడా ఈ మాటా?'' అని నసిగినట్టు నసిగి పుసుక్కున నవ్వాడు వాహకుడు.
''ఇక పర్యటన సాగినట్టే! ప్రసాదాలు తిన్నట్టే! కుడుములు దక్కవు, ఇడుములు దక్క...'' అనుకుంటూ నీరసంగా నడక మొదలు పెట్టాడు ఆధునిక వినాయకుడు.
- సత్యాజీ