Jun 17,2023 06:59

              'ఆడుదాం ఆంధ్రా' పేరిట 46 రోజుల పాటు క్రీడా సంబరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. క్రీడాభివృద్ధికి తగిన కృషి చేస్తామని ప్రకటించింది. ఇది స్వల్ప కాలపు సంబరాలూ, ఆడంబరాలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా కొనసాగాలి. ఆడడం, పాడటం అనేది మనిషి సహజమైన స్వభావం. పిల్లల్లో ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆటల పట్ల అమితాసక్తి చూపిస్తారు. ఆటల వల్ల ఆరోగ్యం, ఆనందం రెండూ ఒనకూడతాయి. వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన తొలి పాఠాలు మైదానంలోనే పరిచయం అవుతాయి. అభిరుచులకు తగ్గ స్నేహాలు అక్కడే మొగ్గ తొడుగుతాయి. ఆరో తరగతి అబ్దుల్లాకు, ఏడో తరగతి ఏకాంబర శర్మకు ఆటస్థలంలోనే చెలిమి కుదురుతుంది. కబడ్డీలో గాయపడ్డ కరణ్‌సింగ్‌కు సపర్యలు చేసే సావకాశం అక్కడే సాధ్యమవుతుంది. ఎగిరెగిరి వస్తున్న వాలీబాల్‌ను ఎప్పుడు ఎత్తి కొట్టాలో, ఎప్పుడు దించి నొక్కాలో ఒక వ్యూహం. బరిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో, జట్టుగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలో కబడ్డీ ఒక కర్తవ్య బోధ. తోటివారిని అందుకోవడం, అందించటం ఖోఖోలో ఒక అప్రమత్త విద్య. ఇలా ఆట ఏదైనా అందులో మనకు పనికొచ్చే పాఠం ఒకటి ఉంటుంది. సమన్వయం, సహకారం, సమిష్టితత్వం, ఆచితూచి వ్యవహరించటం, అప్రమత్తంగా ఉండడం, అంచనా వేయడం ... వంటి జీవన నైపుణ్యాలు ఆటల ద్వారా అలవడతాయి.
             ఆటపాటల మధ్య చదువు నేర్పించాలి అనేది అందరూ అంగీకరించే మాటే ! పిల్లలు ఆడుకోవాలి అంటే - పాఠశాలల్లో కచ్చితంగా ఆట స్థలం ఉండాలి. ఆట వస్తువులు అందుబాట్లో ఉండాలి. ఆడించే ఉపాధ్యాయులు ఉండాలి. ఈ అన్నింటిలోనూ మన ప్రభుత్వాల ఆచరణ అధ్వానస్థితిలో ఉంది. మన దేశంలో ఆటస్థలాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం పంజాబ్‌. అక్కడ గ్రామీణ క్రీడలు ఇప్పటికీ ఇంతలా వర్థిల్లటానికి అదొక కారణం. తరువాతి స్థానాల్లో చండీగడ్‌, మహారాష్ట్ర ఉన్నాయి. ఒక లెక్క ప్రకారం ... మనదేశంలో 56.58 శాతం పాఠశాలలకు ఆటస్థలాలు ఉన్నాయి. హర్యానా, ఢిల్లీ, కేరళ, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడులో జాతీయ సగటు కన్నా ఎక్కువ ఆటస్థలాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచే వివిధ క్రీడల్లో ఎక్కువమంది తర్ఫీదు పొంది వస్తున్నారు. దక్షిణ భారతదేశంలో తక్కువ స్కూలు ప్లే గ్రౌండ్సు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. కార్పొరేట్‌ విద్యాసంస్థల కాగితపు లెక్కలతో సహా 54.95 శాతం పాఠశాలల్లో మాత్రమే ఆటస్థలాలు ఉన్నాయి. ఇది జాతీయ సగటు కన్నా తక్కువ. పైగా ఉన్న వాటిని కూడా వివిధ నిర్మాణాల పేరిట నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి గత ప్రభుత్వంలోనూ ఉంది. ఇప్పుడూ కొనసాగుతోంది. ఇక ప్రయివేటు, కార్పొరేటు స్కూళ్ల పరిస్థితి మరీ దారుణం. కోళ్ల ఫారాల లాంటి ఇరుకిరుకు భవనాల్లో అనేక ప్రయివేటు, కార్పొరేటు విద్యాసంస్థలు నడుస్తున్నాయి. నిబంధనల కోసం స్కూలుకు దగ్గరగా ఉన్న ఏ ఖాళీ స్థలాన్నో మైదానంగా చూపించి అనుమతులు పొందుతున్నారు. అయినా, అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ఆటల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపునకు ఇదొక నిదర్శనం.
              పిల్లలకు ఆటలు వేరు.. చదువు వేరు... అని అనుకోవటమే పెద్ద పొరపాటు. పిల్లలను అన్ని విధాలా తీర్చిదిద్దడంలో ఆటలు కీలకపాత్ర పోషిస్తాయి. కిక్కిరిసిన గదుల్లో ఎక్కించే పాఠాల నుంచి పిల్లలకు రిలీఫ్‌నిస్తాయి. పేరుకుపోతున్న ఒత్తిడిని దూది పింజలా ఎగరగొడతాయి. పాఠాలను అర్థం చేసుకునే బలాన్నిస్తాయి. గెలుపోటములు సహజమనే జీవిత సత్యాన్ని ప్రబోధిస్తాయి. కులమతాలకు, భాష, ప్రాంతం వంటి భావాలకు అతీతంగా సమైక్యత, సమభావం ఆటల ద్వారా అలవడతాయి. అందుకే ఆటలు చదువులో ఒక భాగం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం 'ఆడుదాం ఆంధ్రా'ను కొన్ని రోజుల సందడికే పరిమితం చేయకుండా, వ్యవస్థాగతమైన ఏర్పాట్లతో నిరంతర కృషి కొనసాగించాలి. అన్ని పాఠశాలల్లోనూ ఆటలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలి. వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి, ఆటలను కరికులంలో కచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. విజేతలైన ఒకరో, ఇద్దరో క్రీడాకారులను భారీ సన్మానాలూ, కానుకలతో ముంచెత్తటం కాదు; వేలాది మంది క్రీడాకారులు పాఠశాల మైదానాల నుంచి పుట్టుకొచ్చేలా చూడాలి! అదే అసలు సిసలు క్రీడాభివృద్ధి అవుతుంది.