Sep 09,2022 06:55

బిజెపి ప్రభుత్వం బరితెగించి... 75 సంవత్సరాల స్వతంత్ర పాలన కాలంలో ఎన్నడూ లేని విధంగా... పేద, మధ్యతరగతి ప్రజలు నిత్యం వాడే అన్ని రకాల సరుకులు, సేవలపై భారీగా పన్నులు వేసి జేబులు ఖాళీ చేస్తున్నది. ప్యాకింగ్‌ బియ్యంపై 5 శాతం, గోధమ పిండిపై 8 శాతం, శ్మశాన సేవలపై 18 శాతం పన్ను విధించిన ప్రభుత్వం, వజ్రాలపై 1.5 శాతం, బంగారంపై 3 శాతం మాత్రమే పన్ను వేయడం ద్వారా అది ఎవరి పక్షమో స్పష్టమౌతుంది. యువతను పెద్ద ఎత్తున తప్పుదారి పట్టిస్తున్న ఆన్‌లైన్‌ గేమ్‌లు, గుర్రపు పందేలు, క్యాసినోలు, లాటరీలపై 28 శాతం పన్నులు వేయాలనే ప్రతిపాదనను కేంద్ర పాలకులు కనీసం పరిశీలించకుండా తిరస్కరించారు. జిఎస్‌టి వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు ఆ మొత్తం ఐదు సంవత్సరాల వరకు చెల్లిస్తామన్నారు. ఆ నిధులు రాబట్టుకునేందుకు కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వాలు సాగిలపడేలా దిగజార్చి రాజ్యాంగంలోని ఫెడరల్‌ వ్యవస్థను బలహీనం చేస్తున్నారు.

కే దేశం, ఒకే పన్ను అంటూ బిజెపి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జిఎస్‌టి (వస్తుసేవల పన్నుల విధానం) కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా మారింది. ఒకే పన్ను వల్ల పన్నుల భారం తగ్గి చౌకగా వస్తువులు, సేవలు పొందవచ్చు అని ప్రభుత్వం ఊరించింది. కాని అమలులో మాత్రం అందుకు విరుద్ధంగా ఆహారపదార్ధాలు మొదలు, శ్మశాన సేవల వరకు పన్నుల భారం వేసి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నది. సామాన్య ప్రజలు కొనుగోలు చేసే అన్ని రకాల సరుకులపై జిఎస్‌టి పన్నులు వేస్తున్న బిజెపి పాలకులు, కార్పొరేట్‌ కంపెనీల యజమానులకు మాత్రం లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారు.
 

                                                        కాదేదీ బిజెపి పన్నుకు అనర్హం

జుట్టు పన్ను, పెళ్ళి పన్ను, చావు పన్ను ... అని మనం చరిత్రలో చదువుకున్నాం. నేడు చూస్తున్నాం, చెల్లిస్తున్నాం. పరాయి పాలన కాలం నాడు మన పూర్వీకులు చెల్లించిన ఆహార పదార్థాలపై పన్నులను 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' సంవత్సరంలో మనం చెల్లించాల్సి రావడం 'స్వదేశీ' జపం చేసే బిజెపి పాలన తీరుకు నిదర్శనం. బియ్యం, గోధుమలు, తృణధాన్యాలు, పప్పులు, పాలు, పెరుగు, పన్నీరు, లస్సీ, తేనె, చేపలు, మాంసంపై 5 నుండి 18 శాతం జిఎస్‌టి పన్నులు వేశారు. చిన్నారులు వాడే పెన్సిల్‌, షార్ప్‌నర్‌, రైటింగ్‌, డ్రాయింగ్‌, ప్రింటింగ్‌ ఇంకులు, చార్టులు, మ్యాప్‌లు, గ్రాఫ్‌ పేపర్లు, నోట్‌బుక్కులపై పన్ను విధించారు. మహిళలు వాడే శానిటరీ నేప్‌కిన్లనూ వదలలేదు. బ్యాంకు చెక్కులు, ఎల్‌ఇడి ల్యాంప్‌లు, సోలార్‌ వాటర్‌ హీటర్‌, సేంద్రియ వ్యవసాయ పరికరాలు, హోటల్‌, హాస్పిటల్‌ గదుల అద్దెలపై కూడా పన్ను వేశారు. చెప్పులు, బ్లేడ్లు, కత్తెరలు చివరకు శ్మశాన సేవల వరకు జిఎస్‌టి పన్నులు భారీగా పెంచి...కాదేదీ బిజెపి పన్నుకు అనర్హం అని చాటుతున్నారు.
 

                                               మతతత్వ ఎజెండాలో భాగమే 'ఒకే పన్ను'

ఒకే దేశం, ఒకే జాతి, ఒకే ఎన్నిక, ఒకే పన్ను అంటే జాతీయత అనుకొని మభ్యపడిన ప్రజలు ఈ నినాదాల అసలు సారాన్ని కొంతైనా గమనించడం పెరిగింది. ప్రత్యేకంగా కేంద్ర పాలకుల పన్నుల భారం మరింత స్పష్టం చేస్తుంది. ఒకే సరుకుపై కేంద్రం, రాష్ట్రం పన్నుల వేయడం సరికాదని, దేశమంతా ఒకే పన్ను విధానం అమలు చేసి పన్నుల భారాన్ని తగ్గిస్తామన్నారు. బిజెపి పాలకులకు వంత పాడే 'గోడి మీడియా' పెద్ద ఎత్తున జిఎస్‌టి ప్రచారం చేసింది. ఈ జిఎస్‌టి ని 2016 ఆగస్టు 12న అస్సాంలో అమలు చేసి, దానిని 2017 మార్చి 29న దేశ పార్లమెంట్‌లో చట్టంగా మార్చి, అదే సంవత్సరం జులై 1 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చారు. బిజెపి తన మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ మతతత్వ ఎజెండాను అమలు చేయడంలో భాగంగా ఫెడరల్‌ వ్యవస్థను బలహీనం చేయడానికి 'ఒకే పన్ను' నినాదాన్ని ఎత్తుకుంది. దీనికి మసిపూసి మారేడు కాయ చేసేందుకు పన్నుల భారం తగ్గుతుందని ప్రచారం చేసింది. కాని గత ఐదు సంవత్సరాలుగా జిఎస్‌టి విధానం అమలు చూస్తే 'మేడిపండు' చందంగా తయారైంది.
 

                                                           సామాన్యులపై భారాల మోత

సాధరణంగా పన్నులు విధించేటప్పుడు ఆదాయం ఎక్కువ వున్న వారిపై, విలాస వస్తువులు కొనగలిగే వారిపై ఎక్కువ పన్ను విధించడం, నిత్యావసర సరుకులపై పన్నుల భారం లేకుండా చూడడం సరైన పాలనా పద్ధతి. అయితే గత ప్రభుత్వాలు క్రమంగా కోటీశ్వరులు చెల్లించే ప్రత్యక్ష పన్నులు తగ్గిస్తూ, పేద, మధ్యతరగతి వారు చెల్లించే పరోక్ష పన్నులు పెంచుకుంటూ వచ్చాయి. ప్రస్తుత బిజెపి ప్రభుత్వం బరితెగించి...75 సంవత్సరాల స్వతంత్ర పాలన కాలంలో ఎన్నడూ లేని విధంగా...పేద, మధ్యతరగతి ప్రజలు నిత్యం వాడే అన్ని రకాల సరుకులు, సేవలపై భారీగా పన్నులు వేసి జేబులు ఖాళీ చేస్తున్నది. ప్యాకింగ్‌ బియ్యంపై 5 శాతం, గోధమ పిండిపై 8 శాతం, శ్మశాన సేవలపై 18 శాతం పన్ను విధించిన ప్రభుత్వం, వజ్రాలపై 1.5 శాతం, బంగారంపై 3 శాతం మాత్రమే పన్ను వేయడం ద్వారా అది ఎవరి పక్షమో స్పష్టమౌతుంది. యువతను పెద్ద ఎత్తున తప్పుదారి పట్టిస్తున్న ఆన్‌లైన్‌ గేమ్‌లు, గుర్రపు పందేలు, క్యాసినోలు, లాటరీలపై 28 శాతం పన్నులు వేయాలనే ప్రతిపాదనను కేంద్ర పాలకులు కనీసం పరిశీలించకుండా తిరస్కరించారు. జిఎస్‌టి వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు ఆ మొత్తం ఐదు సంవత్సరాల వరకు చెల్లిస్తామన్నారు. ఆ నిధులు రాబట్టుకునేందుకు కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వాలు సాగిలపడేలా దిగజార్చి రాజ్యాంగంలోని ఫెడరల్‌ వ్యవస్థను బలహీనం చేస్తున్నారు. జిఎస్‌టి నష్టాన్ని చెల్లించే విధానాన్ని కొంత కాలం పొడిగించాలనే రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులపై ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేశారు.
 

                                                  ప్రజలపై భారాలు, సంపన్నులకు రాయితీలు

ఏప్రిల్‌-జూన్‌ మూడు నెలల కాలంలో ధరలు ఆకాశాన్నంటాయి. అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా హోల్‌సేల్‌ ధరలు 15.8 శాతం పెరిగాయి. ఆయిల్‌ ధరలు 40.63 శాతం, ఆహార పదార్ధాలు 14.4 శాతం పెరిగాయి. ఇదే సమయంలో దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో గత నెల రూ. 1.48 లక్షల కోట్లు (గత సంవత్సరం కంటే 28 శాతం అధికం) జిఎస్‌టి పన్నులను కేంద్రం వసూలు చేసుకుంది. ధరలను అదుపు చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ఈ ధరల పెరుగుదల వల్ల వచ్చే పన్నుల ఆదాయాన్ని మాత్రం కొల్లగొట్టింది. బిజెపి ప్రభుత్వానికి ఆర్థిక విధానాల్లో కూడా రెండు ముఖాలు వున్నాయి. ఒకటి పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు వేయడం. మరొకటి కార్పొరేట్‌, సంపన్నులకు భారీగా ఆదాయాన్ని పెంచడం. కార్పొరేట్‌ కంపెనీలు చెల్లించాల్సిన కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించారు. దీనివల్ల ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రూ. లక్షన్నర కోట్ల ఆదాయం తగ్గింది. బాంబే స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లో నమోదు చేసుకున్న కంపెనీలు ఈ సంవత్సరం గరిష్టంగా రూ.9 లక్షల కోట్లు లాభపడ్డాయి. గత సంవత్సరం కంటే 70 శాతం ఎక్కువ లాభపడ్డాయి. క్రోనీ పెట్టుబడిదారుల ఆదాయం 29 శాతం నుండి 43 శాతం పెరిగింది. అదానీ ప్రపంచ కుబేరుడుగా మారాడు. ఇంత లాభపడిన కంపెనీలపై, వ్యక్తులపై పన్ను వేయకపోవడమే కాదు, వున్న పన్నులను తగ్గించడం బిజెపి ద్వంద్వనీతికి నిదర్శనం.
 

                                                        కేరళ ప్రభుత్వ ప్రత్యామ్నాయం

కేరళ లో సిపిఐ(ఎం) నేతృత్వంలో అధికారంలో వున్న వామపక్ష ప్రభుత్వం పెట్రోలియం ధరలపై వ్యాట్‌ తగ్గించడం, నిత్యావసర సరుకులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌకగా అందించడం, అసంఘటిత రంగ కార్మికులతో పాటు, వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో దేశంలో అగ్రస్థానంలో వుంది. దేశ ప్రజలపై భారాలు వేసే జిఎస్‌టి పన్నుల విధానాన్ని మార్చాలని, పన్నుల భారాన్ని ఉపసంహరించాలని మొదటి నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. జులైలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశానికి చాలా ముందుగా గత నవంబర్‌ లోనే ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి రాతపూర్వకంగా కేంద్రానికి తమ అభ్యంతరం తెలిపారు. సమాఖ్య వ్యవస్థను ఏ మాత్రం గౌరవించకుండా ఏకపక్షంగా కేంద్ర బిజెపి ప్రజలపై భారాలు వేసింది. ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలు, పాలు, మజ్జిగ వంటి వాటిపైన కుటుంశ్రీ (డ్వాక్రా వంటిది) ఉత్పత్తులపైన జిఎస్‌టి విధించబోమని ప్రకటించింది. మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు లొంగిపోయి జిఎస్‌టి పెంపును మౌనంగా అంగీకరించింది. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో అధికారంలో వున్న పార్టీ, 22 మంది లోక్‌సభ సభ్యులున్న పార్టీ ఈ రకంగా వ్యవహరించడాన్ని ప్రజలు ప్రశ్నించాలి. అలాగే ఈ జిఎస్‌టి విధానంపై తెలుగుదేశం వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేయాలి.
 

                                                               పాలకులను ప్రశ్నిద్దాం

నిత్యం ప్రజల పక్షాన నిలిచి సమస్యలపై పోరాడుతున్న వామపక్షాలు, ప్రత్యేకించి సిపిఐ(ఎం) దేశ వ్యాపితంగా బిజెపి వినాశకర ఆర్థిక, మతతత్వ విధానాలకు ఎదురొడ్డి నిలుస్తున్నాయి. మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతాంగ స్ఫూర్తితో, కార్మిక హక్కుల కోసం పోరాడుతున్న కార్మికవర్గ పట్టుదలతో పన్నుల భారానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలి. జిఎస్‌టి పన్నుల భారాన్ని ఉపసంహరించాలని, పెట్రోలియం ఉత్పత్తులపై సెస్‌, సర్‌చార్జీలను రద్దు చేయాలని కదలాలి.

/ వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు /
వి. రాంభూపాల్‌

వి. రాంభూపాల్‌