- ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరం
- 50వ జిఎస్‌టి కౌన్సిల్‌లో గందరగోళం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వాలను కానీ, రాజకీయ పక్షాలను కానీ సంప్రదించకుండానే, ఎటువంటి ముందస్తు సమాలోచనలు జరపకుండానే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరో ఏకపక్ష నిర్ణయాన్ని బలవంతంగా రుద్దేసింది. వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్ (జిఎస్‌టి-ఎన్)ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) పరిధిలోకి చేర్చింది. దీనిపై ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు భగ్గుమన్నాయి. 'మీ పాటికి మీరు ఏకపక్ష నిర్ణయాలను నిరంకుశంగా రుద్దుతూ పోతే ఇక ఈ కౌన్సిల్‌తో పనేంటి?' అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ పరిణామాలతో న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన 50వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో కాసేపు గందరగోళం నెలకొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం నాడిక్కడ విజ్ఞాన్ భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐటి సిస్టమ్ సంస్కరణలపై ప్రజెంటేషన్ అనంతరం జిఎస్‌టిఎన్‌ని పిఎంఎల్‌ఎ కింద చేర్చడంపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. కాగా కొన్ని వస్తువులు, సేవలకు సంబంధించిన జిఎస్‌టిని సవరిస్తూ కౌన్సిల్ నిర్ణయాలు చేసింది.
బెంగాల్, మహారాష్ట్రలో అప్పిలేట్ ట్రిబ్యునళ్లు
పశ్చిమ బెంగాల్‌లో రెండు, మహారాష్ట్రలో ఏడు అప్పిలేట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్ నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కౌన్సిల్ సమావేశ అనంతరం నేషనల్ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహారాష్ట్రలో మొదటి దశలో నాలుగు జిఎస్‌టిఎటి బెంచ్‌లను, రెండవ దశలో మరో మూడు బెంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో జిఎస్‌టి అప్పీలేట్ ట్రిబ్యునల్‌లు ఎక్కువగా రాష్ట్రాల రాజధాని నగరాల్లో, హైకోర్టు బెంచ్‌లు ఉన్న చోట ఏర్పాటు చేయనున్నామని ఆమె చెప్పారు.
సినిమా హాళ్లలో కాస్త ఊరట !
ప్రత్యేక వైద్య అవసరాల కోసం ఆహారం (ఎఫ్‌ఎస్‌ఎంపి) వంటి ఫార్మా ఉత్పత్తులపై జిఎస్‌టిని మినహాయించినట్లు తెలిపారు. కాగా సినీ ప్రేక్షకులకు కాస్త ఊరట నిచ్చే కబురును మంత్రి తెలియజేశారు. సినిమా హాళ్లలో విక్రయించే ఆహార పదార్థలపై జిఎస్‌టి రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. కాగా ప్రయివేటు అంతరిక్ష పరిధోశన సంస్థలకు మరో నజరానా ప్రకటించారు.
ప్రైవేట్ సంస్థలు ప్రయోగించే ఉపగ్రహలపై జిఎస్‌టి పూర్తిగా మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంయువిలపై 22 శాతం సెస్ రేటును కౌన్సిల్ ఆమోదించినట్లు తెలిపారు. కరిగే పేస్ట్, ఎల్‌డి స్లాగ్‌తో సహా నాలుగు వస్తువులపై రేట్లను 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించామని తెలిపారు.
క్యాసినోలపై 28 శాతం జిఎస్‌టి
ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలపై ఇక నుంచి 28 శాతం జిఎస్‌టి విధించనున్నట్లు తెలిపారు. అయితే ప్రత్యేక పరిశ్రమను లక్ష్యంగా చేసుకొని ఈ నిర్ణయం చేయలేదని మంత్రి వ్యాఖ్యానించారు. పర్యాటక రంగంలో క్యాసినో కీలక భాగమని ఆమె అన్నారు. జిఎస్‌టి కౌన్సిల్ ఉద్దేశ్యం కాసినోలతో ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమను లేదా రాష్ట్రాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదన్నారు. అయితే దీనిపై కొన్ని రాష్ట్రాలు ఆందోళనలను వ్యక్తం చేశాయని పేర్కొన్నారు.










