
జి-20 దేశాలు నిర్వహించే వర్కింగ్ గ్రూప్ సమావేశాల నిర్ణయాలన్నింటిలోనూ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు, డబ్ల్యుటిఓ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలే కీలక పాత్ర పోషిస్తాయి. స్ధూలంగా ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా పట్టణ సంస్కరణలను అమలు చేయటమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశాలు కొనసాగాయి. పట్టణ ప్రణాళికను ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా మార్చాలనేది ముఖ్యమైనది. దీనిలో అంతర్భాగంగా ప్రస్తుత పట్టణ జోనింగ్ వ్యవస్ధను కూడా మార్పు చేయాలని కోరుతున్నారు. పట్టణ మౌలిక సదుపాయాల కల్పన పూర్తిగా ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడం, పబ్లిక్-ప్రైవేట్-భాగస్వామ్యం (పిపిపి)లో మౌలిక సదుపాయాలు చేపట్టటం, పౌరసేవలకు, ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ చార్జీలు, యూజర్ చార్జీలు, సర్వీసు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయిస్తున్నారు.
ఈ ఏడాది జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు భారత్ వేదికగా సెప్టెంబర్‌లో జరగనున్నాయి. దీనికి సన్నాహకంగా విశాఖపట్నంలో మార్చి 28 నుండి 31 వరకు ''రేపటి ఆర్థిక నగరాలు-అభివృద్ధి-మౌలిక సదుపాయాల కల్పన'' అనే అంశంపై రెండో వర్కింగ్ గ్రూపు సమ్మిట్ జరిగింది. దీనికి 14 సభ్యదేశాలు, 8 అతిథి దేశాలు, 10 అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు చెందిన 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకుండా పూర్తిగా మహా విశాఖ నగర పాలక సంస్థ (జివిఎంసి) మీదే ఆర్థిక భారం మోపింది. జివిఎంసి బడ్జెట్ నుండి దాదాపు రూ.157 కోట్లు ఖర్చు చేయించింది. ఇందులో అత్యధిక భాగం దుబారా ఖర్చే. సగం సొమ్ము పాలక పార్టీ జేబుల్లోకి వెళ్ళిందన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎయిర్‌పోర్టు నుండి ఆర్.కె బీచ్, అక్కడ నుండి సముద్రపు తీర ప్రాంతమైన భీమిలి బీచ్ వరకు ఈ నిధులను ఖర్చు చేశారు. బాగున్న రోడ్ల మీదే తిరిగి రోడ్లు వేశారు. ఫుట్‌పాత్‌ల విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్స్, గోడలకు, చెట్లకు రంగులు, ఖరీదైన మొక్కలు పెట్టడం, రోడ్ల మధ్య భాగంలో బ్యూటిఫికేషన్లు, జాతీయ రహదారికి ఇరువైపులా పేదల ఇళ్లు, మురికివాడలు, కొండవాలు ప్రాంతాలు కనిపించకుండా ఇరవై అడుగుల ఎత్తులో పట్టాలు కట్టడం వంటి వాటికి విచ్చలవిడిగా ఖర్చు చేశారు. వీధివిక్రయదారులను తరిమేశారు. పశ్చిమ దేశాల నగరాల స్థాయిలో విశాఖపట్నం అభివృద్ధి అయ్యిందని చూపించటానికి తీవ్ర ప్రయత్నం చేశారు. విశాఖలో ప్రైవేట్ పెట్టుబడులు ఏఏ ప్రాజెక్టుల్లో అమలు చేస్తున్నారో హాజరైన ప్రతినిధులకు చూపించి మెప్పు పొందటానికి తెగ ఆరాటపడ్డారు.
విశాఖపట్నంలోనే కాదు. దేశవ్యాప్తంగా 200 చోట్ల 30 అంశాల మీద జి-20 వర్కింగ్ గ్రూపు సమావేశాలు జరుగుతున్నాయి. జి-20 దేశాల కూటమి ఏర్పడిన తరువాత ఇవి 18వ శిఖరాగ్ర సమావేశాలు. ఈసారి ఈ సమావేశాలకు భారతదేశం అధ్యక్షత వహిస్తున్నది. అధ్యక్షత వహించే దేశంలో 20 దేశాల అధినేతలు సమావేశం జరిపేముందు దీనికి సన్నాహకంగా వ్యవసాయం, వాణిజ్యం, పెట్టుబడులు, లేబర్, ఉపాధి, అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పర్యావరణం, పట్టణ మౌలిక సదుపాయాలు తదితర అనేక అంశాల మీద వర్కింగ్ గ్రూపులు సమావేశమై చర్చించి వాటి అమలుకు జి-20 శిఖరాగ్ర సమావేశాలకు ఎజెండాలు రూపొందిస్తాయి. ఇవి కూడా రెండు విధాలుగా ఉంటాయి. ప్రపంచ స్థూల ఆర్థిక సమస్యల మీద ప్రత్యేకంగా వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు, డిప్యూటీ గవర్నర్లతో వర్కింగ్ గ్రూపులు ఏర్పడి చర్చిస్తాయి. రెండో తరహా వర్కింగ్ గ్రూపులు వివిధ దేశాల ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖలలోని సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ హోదాలోని అధికారులతో ఏర్పడతాయి. ఈ రెండో తరహా వర్కింగ్ గ్రూపులు దేశాల స్థాయిలో వివిధ రంగాల్లో ప్రత్యేకంగా చేపట్టాల్సిన ఆర్థిక సంస్కరణల మీద కేంద్రీకరిస్తాయి. అమలుకు తగు నిర్ణయాలు చేస్తాయి. అలాగే శిఖరాగ్ర సమావేశాలలోనే ప్రధాన ఎజెండాలుగా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఐఎంఎఫ్‌లో వివిధ దేశాల ఓటు విలువ, విదేశీ మారక ద్రవ్య సహాయం, పేద దేశాలకు రుణాలు, మారటోరియం, ఆర్థిక సంస్కరణలు, డబ్ల్యుటిఓ, బేసిల్ సంస్కరణల అమలు వంటివి కూడా ప్రధాన ఎజెండాలుగా చర్చించబడతాయి.
జి-20 దేశాల ఎజెండాల్లో పట్టణ రంగం చాలా ముఖ్యమైనది. అందుకే అర్బన్-20 పేర జి-20లో ప్రత్యేక ఫోరంను 2017లో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఈ ఫోరంకి భారతదేశం లోని అహ్మదాబాద్ నగరం చైర్ సిటీగా వ్యవహరిస్తున్నది. జులై 2023లో ప్రపంచం లోని అనేక దేశాల మేయర్లతో అర్బన్-20 సమ్మిట్ జరుగుతుంది. ఇప్పటికే పట్టణ మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వనరుల సేకరణ అంశాలపై ఈ ఏడాది జనవరిలో పూణేలో, మార్చిలో విశాఖలో జరిగిన జి-20 దేశాల వర్కింగ్ గ్రూపుల రెండు రౌండ్ల సమావేశాల్లో ఆమోదించబడ్డ సంస్కరణలు, విధానాలను అర్బన్ 20 మేయర్ సమ్మిట్‌కి కూడా సమర్పిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా పట్టణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా విధానపరమైన చర్యలు తీసుకోవాలని దీర్ఘకాలం నుండి సామ్రాజ్య వాద దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యూరప్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో సైతం పట్టణ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, పౌర సేవలు ప్రభుత్వ పెట్టుబడులతో విస్తృత స్థాయిలో కొనసాగుతున్నాయి. సోవియట్ యూనియన్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇది చోటు చేసుకుంది.
అంతేగాక ప్రపంచ జనాభాలో సగభాగం పట్టణ జనాభాయే. మరో 20 ఏళ్లలో మూడింట రెండొంతుల జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉంటుందని అంచనా. అలాగే ఆయా దేశాల స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో పట్టణ ఆర్థిక వ్యవస్థలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణ మౌలిక సదుపాయాలు, పౌర సేవలపై సంస్కరణల అమలుకు జి-7, జి-20, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు, డబ్లు.టి.ఓ తదితర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు దాడిని పెంచాయి. భారతదేశం వీటి ఒత్తిడికి లొంగిపోయి సంస్కరణల అమలకు పూనుకుంటున్నది. పూనే, విశాఖలో జరిగిన రెండు వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు పట్టణ మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలని, ప్రైవేట్ ఫైనాన్స్‌ను ఆకర్షించేలా నగరాలను, పట్టణాలను తయారు చేయాలనే ఎజెండా ముందు తెచ్చింది కూడా భారతదేశమే.
ఈ సమ్మిట్‌కి ముందు గత ఏడాది నవంబర్‌లో ప్రపంచ బ్యాంకు భారతదేశంలో పట్టణ రంగంలో తీసుకు రావలసిన సంస్కరణలపై ఒక నివేదికను (ఫైనాన్సింగ్ ఇండియాస్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరాలు: అవరోధాలు-విధానపరమైన చర్యలు) రూపొందించింది. ఈ నివేదికలో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఏమిటంటే వచ్చే 15 ఏళ్లలో పట్టణ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏడాదికి 55 బిలియన్ డాలర్ల (రూ. 4.56 లక్షల కోట్లు) చొప్పున 840 బిలియన్ డాలర్లు (రూ. 69.72 లక్షల కోట్లు) అవసరమని తెలిపింది. 2036 నాటికి భారత పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరుతుందని, ఇది దేశ జనాభాలో 40 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ మౌలిక సదుపాయాలపై 75 శాతానికి పైగా నిధులను సమకూరుస్తుండగా, పట్టణ స్థానిక సంస్థలు కేవలం తమ సొంత మిగులు రాబడిలో 15 శాతం మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాయని నివేదిక విమర్శించింది. 2011-18 సంవత్సరాల మధ్య దేశంలో అన్ని పట్టణాల్లో వచ్చిన ఆస్తి పన్ను జిడిపి లో 0.15 శాతం లోపే ఉందని, అదే అల్పాదాయ దేశాల్లో దీనికంటే ఎక్కువగా ఉందని, అభివృద్ధి చెందిన దేశాల్లో రెండు నుండి మూడు శాతం వరకు ఉందని తెలిపింది. ప్రస్తుతం 10 అతి పెద్ద నగరాలు మాత్రమే వాటి క్యాపిటల్ బడ్జెట్‌లో రెండో వంతు మాత్రమే ఖర్చు చేయగలుగుతున్నాయని పేర్కొన్నది. మౌలిక సదుపాయాల కల్పనలో నేడు కేవలం 5 శాతం మాత్రమే నగరాలు ప్రైవేట్ పెట్టుబడులు సమీకరించుకోగలుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చింది. మున్సిపల్ పౌర సేవలు, మౌలిక సదుపాయాలకు చార్జీలు వసూలు చేయకపోవడం, ఎక్కడన్నా వసూలు చేస్తున్నా అదీ కూడా నామమాత్ర రుసుముగా ఉండడం వల్ల ఈ చర్యలు ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణని నిరుత్సాహ పరుస్తున్నాయని తెలిపింది. అందువల్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాలైన విధానాలపరమైన చర్యలు తీసుకోవాలని, పట్టణ సంస్కరణల అమలు వేగవంతం చేయాలని నివేదికలో కోరింది. ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొన్న అంశాలనే...భారత రిజర్వుబ్యాంకు (ఆర్‌బిఐ) కూడా ఇటీవల 27 రాష్ట్రాలలో ముఖ్యమైన 201 మున్సిపల్ కార్పొరేషన్ల ఆదాయ వ్యయాలపై అధ్యయనం చేసి ప్రైవేట్ పెట్టుబడులను పెద్దఎత్తున పట్టణ మౌలిక సదుపాయాల కల్పనలోకి ఆహ్వానించాలని, పన్నులు పెంచాలని, బాండ్ల రుపాల్లో రుణాలు సమకూర్చుకోవాలని నివేదికలో చెప్పింది. దీనికి అనుగుణంగానే 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు చేశారు.
జి-20 దేశాలు నిర్వహించే వర్కింగ్ గ్రూప్ సమావేశాల నిర్ణయాలన్నింటిలోనూ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు, డబ్ల్యుటిఓ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలే కీలక పాత్ర పోషిస్తాయి. స్ధూలంగా ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా పట్టణ సంస్కరణలను అమలు చేయటమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశాలు కొనసాగాయి. పట్టణ ప్రణాళికను ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా మార్చాలనేది ముఖ్యం. దీనిలో అంతర్భాగంగా ప్రస్తుత పట్టణ జోనింగ్ వ్యవస్ధను కూడా మార్పు చేయాలని కోరుతున్నారు. పట్టణ మౌలిక సదుపాయాల కల్పన పూర్తిగా ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడం, పబ్లిక్-ప్రైవేట్-భాగస్వామ్యం (పిపిపి)లో మౌలిక సదుపాయాలు చేపట్టటం, పౌరసేవలకు, ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ చార్జీలు, యూజర్ చార్జీలు, సర్వీసు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, గ్రాంట్లు సంస్కరణలకు ముడిపెట్టి ఇవ్వాలని అలాగే ఆస్తిపన్నును జిడిపిలో కనీసం 2 శాతం స్ధాయికి పెంచాలని, పట్టణ స్థానిక సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమీద నిధుల కోసం ఆధారపడే స్ధితిని తగ్గించుకోవలని ప్రతిపాదిస్తున్నారు. నగరాలు, పట్టణాలను ప్రైవేట్ ఫైనాన్సింగ్‌ను ఆకర్షించేలా సిద్ధం చేయాలని అందుకు క్రెడిట్ రేటింగ్ సంస్థలల ద్వారా మూన్సిపల్ సంస్థల ఆర్థిక పనితీరును మధింపు చేసి క్రెడిట్ రేటింగ్ ర్యాంకులు ఇవ్వాలని ఆదేశిస్తున్నరు. ప్రతి నగరం స్టాక్ ఎక్స్చేంజ్‌లో నమోదయి ప్రైవేట్ ఫైనాన్సింగ్ సంస్థల నుండి రుణాలను సేకరించుకోవాలని, బాండ్ల రూపంలో కూడా నిధులు సమకూర్చుకోవాలని సూచిస్తున్నారు.
/ వ్యాసకర్త సెల్ : 9490098792 /
డా|| బి. గంగారావు