
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై జిఎస్టీ విధించడంతో దేశ ప్రజలు ముఖ్యంగా సామాన్యులు ఛీఎస్‌టి అని చీదరించుకుంటున్నారు. వినిమయ ధరల సూచీ 7 శాతానికి పైగా, టోకు ధరల సూచీ 15 శాతానికి పైగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిన సమయంలో ఇలా జిఎస్‌టి విధించడం అమానుషం. నిరుద్యోగం పెచ్చరిల్లడం, రూపాయి అధోగతి, అనూహ్యమైన వాణిజ్య లోటు, జిడిపి వృద్ధి రేటు స్తంభించడం వంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నిత్యావసరాల ధరలు పెరిగేందుకు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే కారణం కావడం క్షంతవ్యం కాదు. నిత్యావసరాలపై పెంచిన జిఎస్‌టిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంటు ఆవరణలో నిరసన తెలపవలసి వచ్చింది. గాంధీజీ విగ్రహం వద్ద ప్రతిపక్ష సభ్యులు పాలు, పెరుగు, రొట్టె, పన్నీర్, గ్యాస్ సిలిండర్‌తో ధర్నా నిర్వహించి జిఎస్‌టి రద్దు చేయాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని నినాదాలు హోరెత్తించారు. నిత్యావసరాలపై జిఎస్‌టి విధింపునకు వ్యతిరేకంగా పార్లమెంట్ లోపల నిరసనలు వ్యక్తం చేసిన ప్రతిపక్ష పార్టీలు ప్రజా క్షేత్రంలోనూ ఆందోళన చేపట్టడం అవసరం.
ఆహార పదార్ధాలపై పన్ను విధించడమనే వలసవాద బ్రిటీష్ ప్రభుత్వ విధానాన్ని స్వాతంత్య్రానంతరం భారతదేశం విడనాడింది. బియ్యం, గోధుమలు, పప్పులు తదితర ఆహార పదార్ధాలపైన, పాలు, మజ్జిగ, పెరుగు, పన్నీర్, మాంసం, చేపలు, బెల్లం వంటి వాటిపై ఎన్నడూ పన్నులు విధించలేదు. కానీ ఇప్పుడు, అజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో భారత ప్రజలకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన కానుక ఇది. ఆఖరుకు శవ దహన చార్జీలు, ఆస్పత్రి పడకల వంటి వాటిపైనా జిఎస్‌టి పెంచేశారు. కేంద్ర ప్రభుత్వం తన ఆదాయాలను పెంచుకోవాలనుకుంటే మొదట అతి సంపన్నులపై పన్నులు విధించాలి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ అయిన కంపెనీలు 2021-22 సంవత్సరంలో మొత్తంగా రూ.9.3 లక్షల కోట్లు లాభాలు ఆర్జించాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 70 శాతం ఎక్కువ. ఇటువంటి వారిపౖౖె పన్నులు విధించడానికి బదులుగా మోడీ ప్రభుత్వం వారికి మరింతగా పన్ను రాయితీలు కల్పించడం, వారి రుణాలను రద్దు చేయడం దారుణం. బంగారం కొనుగోళ్ళపై మూడు శాతం పన్ను, వజ్రాలపై 1.5 శాతం విధించి ఆహార పదార్ధాలపై మాత్రం 5 శాతం, అంతకంటే ఎక్కువ జిఎస్‌టి వేయడాన్నిబట్టి ఈ సర్కారు ఎవరి పక్షమో ఇట్టే తేలిపోతోంది.
ఇంతా చేసి జిఎస్‌టి పెంపుదలపై ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదని మోడీ ప్రభుత్వం కొండంత అబద్ధాన్ని చెబుతోంది. కేరళ ప్రభుత్వం తరపున తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధానికి ఇంతకుముందే లేఖ రాశారు. నిత్యావసర వస్తువులపై జిఎస్‌టి విధించడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది కాబట్టి దీనిపై ప్రధానమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. చాలా మంది చిన్న దుకాణదారులు నిత్యావసర సరుకులను ముందుగా ప్యాక్ చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచుతారని ఆ లేఖలో విజయన్ పేర్కొన్నారు. ప్యాక్ చేసి విక్రయించే వస్తువులపై జిఎస్‌టి విధించడం వలన చిన్న దుకాణాల్లో కొనుగోలు చేసే వినియోగదారులపై భారం పడుతుందని వివరించారు. అయినా కేంద్రం స్పందించలేదు సరికదా జులై 18 నుండి అమలుకు పూనుకుంది. దాంతో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం 'కుటుంబ శ్రీ' లేదా చిన్న చిన్న దుకాణాల్లో ఒకటి రెండు కేజీల ప్యాకెట్ల రూపంలో ఉండే నిత్యావసర సరుకులపై జిఎస్టీని అమలు చేయరాదని నిర్ణయించడం శ్లాఘనీయం. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వంతో సమస్యలు తలెత్తినా సరే, ఈ అంశంపై రాజీ పడేది లేదని ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ అసెంబ్లీలో ప్రకటించారు. చిన్న వ్యాపారులు, చిన్న దుకాణాలపై జిఎస్‌టి విధించే ఉద్దేశం తమకు లేదు' అని చెప్పారు. వామపక్ష ప్రభుత్వం ఎల్లపుడూ ప్రజల పక్షమేననిపించారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలూ జిఎస్‌టి పెంపును వ్యతిరేకిస్తున్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం కిమ్మనకుండా ఉండడం తగదు. కేంద్ర ప్రభుత్వం పన్ను పెంపును ఉపసంహరించుకునేలా అన్ని బిజెపి యేతర పార్టీలు ఒత్తిడి పెంచాలి. ప్రజా ఉద్యమంగా సాగాలి.