Sep 04,2022 07:50

నాలుగు గోడల మధ్య పిల్లలకి పుస్తకాల్లో ఉన్న నాలుగక్షరాలు వల్లె వేయించడమే బోధన కాదు. విజ్ఞానం, వినోదం, వికాసం రంగరించి, సృజనాత్మకతను మేళవించి, పిల్లల మస్తిష్కంలో నింపే మనోవైజ్ఞానిక మహత్తర కార్యం బోధన. ఓ పక్కన చదువు నేర్పుతూనే పిల్లల్లో సాంస్కృతిక, భాషా, రాజకీయ, ప్రాపంచిక విలువలతో.. సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దడానికే బోధన. పిల్లల్లో అంతర్గతంగా దాగి ఉన్న శక్తులను వెలికితీయడమే బోధన. విద్యార్థులకు చరిత్ర చెప్తూ నవ్య సమాజం వైపు అడుగులు వేయించడమే బోధన. బోధన ఒక కళ. నేటి పరిస్థితుల్లో భావి సమాజ రూపశిల్పిగా ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం. సెప్టెంబర్‌ 5న 'ఉపాధ్యాయ దినోత్సవం' సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..

Future-architect-Guru

 

గురువు బోధించడం ఒక నేర్పు. ఒక ఓర్పు. ఉపాధ్యాయ వృత్తి ఎంచుకునేవారికి ఎంతో ఆసక్తి ఉంటేనేగానీ తరగతిగదిలో బోధన, అభ్యసన ప్రక్రియ విజయవంతం కాదు. తరగతిగదిలో పదుల సంఖ్యలో ఉండే విద్యార్థులు ఒక్కొక్కరూ ఒక్కో మనస్తత్వంతో, విభిన్న ఆలోచనలతో, వైరుధ్యమైన ఆర్థిక స్థితిగతులతో ఉంటారు. మరికొందరు శారీరక, మానసిక అసమానత్వంతో ఉంటారు. వీరందరినీ ఒకే ఆలోచన వైపు మళ్లించాలంటే ఉపాధ్యాయుడు పాఠ్య బోధన కంటే ముందుగా వాళ్లందర్నీ నేర్చుకోవడానికి సంసిద్ధుల్ని చేయాలి. ఉపాధ్యాయుడు సమర్థవంతంగా చెప్పగలిగితేనే బోధనా సారం విద్యార్థులందరికీ చేరుతుంది. అందుకోసం ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉండాలి. ఎప్పటికప్పుడు మారుతున్న పరిజ్ఞానాన్ని ముందు తాను ఆకళింపజేసుకోవాలి. నేర్పు ఓర్పు కలిగి, విద్యార్థులను దగ్గరికి తీసుకోగలగాలి. ఒక ఉపాధ్యాయుడు పట్ల ఉండే మక్కువే ఆ టీచర్‌ చెప్పే సబ్జెక్టు పట్ల విద్యార్థులకి ఆసక్తి ఏర్పడేలా చేస్తుంది.

11

 

                                                              మానవత్వానికి మకుటాలు..

వాళ్లు నడవలేరు.. రాయలేరు.. కనీసం సరిగా మాట్లాడలేరు. అటువంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లల్ని అక్కున చేర్చుకుని, అమ్మలా లాలిస్తూ.. వారికి నాలుగు అక్షరాలు బోధిస్తున్నారు.. వాళ్లే ఐ ఇ ఆర్‌ టి (ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ టీచర్‌) లు. 2010, ఏప్రిల్‌ 1 నుంచి విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చాక, సమాజంలో నూరు శాతం బాలలకి విద్య అందేటట్టుగా ప్రాథమిక హక్కులోకి చేరింది. ప్రత్యేకావసరాలున్న పిల్లలకు ప్రత్యేక విద్య బోధించే భవిత పాఠశాలలు వెలిశాయి. శిక్షణ పొందిన టీచర్లు పిల్లలు ఇళ్లకు వెళ్లి, ఎత్తుకొని లేదా మూడు చక్రాల బండి మీద తీసుకొచ్చి చదువు నేర్పుతున్నారు. కనీసం కదలలేని స్థితిలో ఉన్న పిల్లలకు ఇంటి దగ్గరికి వెళ్లి, ఫిజియోథెరపీ సేవలతో పాటు విద్యాబుద్ధులు కూడా నేర్పిస్తున్నారు ఈ టీచర్లు. ఎంతో ఓర్పు, నేర్పుతో పిల్లల్ని సాకుతూ.. చదువు నేర్పిస్తున్న ఈ తల్లిలాంటి టీచర్లకు మనం సెల్యూట్‌ చేయాల్సిందే !

                                                               అభ్యసనం మానసిక ప్రక్రియ..

అభ్యసనం అనేది విద్యార్థుల మానసిక ప్రక్రియ. ఉపాధ్యాయుడు కేవలం బోధిస్తే సరిపోదు. విద్యార్థులు నేర్చుకునేందుకు అవసరమైన పరిస్థితులు తరగతిగదిలో కల్పించాలి. విద్యార్థుల ప్రవర్తనలో శాశ్వతమైన మార్పు తీసుకొచ్చేదే అసలైన అభ్యసనం.. సరైన బోధన! ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మేధావులు ధృవీకరించిన అభ్యసనా సూత్రమిది. విద్యలో బట్టీ పట్టడం వంటి పద్ధతులకు స్వస్తి పలికి, మనో వైజ్ఞానిక పద్ధతుల్లో పిల్లలు ఆలోచించడం, తర్కించడం, ప్రశ్నించడం, తెలుసుకోవడం, అన్వేషించడం.. వంటి సృజనాత్మక వ్యక్తీకరణ రేకెత్తించే విధంగా బోధన ఉండటం ఆధునిక విద్యా ప్రక్రియ.

Future-architect-Guru

 

                                                                బోధన ఒక విశిష్ట వృత్తి..

ఉద్యోగానికి, వృత్తికి చాలా తేడా ఉంది. ఉద్యోగం అంటే నిర్ణీత కాలవ్యవధిలో తమ విధులు నిర్వహిస్తే సరిపోతుంది. విధులు నిర్వర్తించడంతోబాటు అంకితభావం, సామాజిక స్పృహ, నైతిక బాధ్యతలు కలిగి, విలువలతో మార్గదర్శకత్వం వహించేది వృత్తి. ఇవన్నీ ఉపాధ్యాయలకి ఉండే లక్షణాలు. అందుకే బోధన ఉపాధికి వెతుక్కునే ఉద్యోగం కాకూడదు. ఆసక్తిగా ఎంచుకున్న ఒక విశిష్ట వృత్తిలా ఉండాలి. సాధారణ ఉపాధ్యాయులు పాఠాన్ని బోధిస్తారు. ఉత్తమ ఉపాధ్యాయులు పాఠాన్ని వివరిస్తారు. ఆదర్శ ఉపాధ్యాయులు ఆ అంశం పట్ల పిల్లల్లో స్ఫూర్తిని రగిలిస్తారు.
 

                                                                      స్త్రీ విద్యోద్ధారకులు..

సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే కలిసి 1848, మే 12న పూణేలో బహుజనుల కోసం తొలి బాలికా పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆమె పాఠశాల నిర్వహించడం స్థానిక అగ్రవర్ణాలకు నచ్చలేదు. బడికి వెళ్లే సమయంలో ఆమెను నిత్యం వేధించేవారు. రాళ్లు, కోడిగుడ్లు, బురద ఆమెపై విసిరి, అవమానించి, దూషించేవారు. బాలికల చదువు ద్వారానే మహిళాభ్యున్నతి సాధ్యమని తలచిన ఆమె.. మడమ తిప్పలేదు. ఒక చీర కట్టుకొని, మరో చీర సంచిలో పెట్టుకుని, రోజూ బడికి వెళ్లేవారు. దురహంకారుల దాడులకు పాఠశాలకు వెళ్లేసరికి చీర పూర్తిగా బురదయ్యేది. పాఠశాలకి వెళ్ళాక సంచిలో చీర మార్చుకుని, పాఠాలు చెప్పేవారు. మళ్లీ బురద చీర కట్టుకుని ఇంటికి వెళ్లేవారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదిరించి, పాఠశాల నిర్వహించారామె. అంతేకాదు ఆమె మహిళా విద్య ఉద్యమాన్నీ విజయవంతంగా నిర్వహించారు. తర్వాత కాలంలో ఆమె ఎన్నో పాఠశాలల్ని స్థాపించారు. మరెన్నో పాఠశాలల ఏర్పాటుకు ఆలంబనగా నిలిచారు. తన చిట్టచివరి శ్వాస వరకూ మహిళా విద్య కోసం పాటుపడ్డారు. అందుకే భారతజాతి జనవరి మూడో తేదీ ఆమె జయంతిని 'జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా జరుపుకుంటోంది.
 

                                                           తల్లీతండ్రి తర్వాత గురువే !

'నాకు గురువు గోవిందుడు ఒకేసారి ఎదురైతే.. నేను ముందు గురువుకే నమస్కారం చేస్తా. ఎందుకంటే నాకు గోవిందుడుని దర్శింపజేసినవారు గురువే కాబట్టి' అన్నారు కబీర్‌. మన భారతీయ సంస్కృతిలో గురౌన్నత్యమది. తల్లిదండ్రుల తరువాత అంతటి మహోన్నతస్థానం గురువుకే దక్కింది. నాలుగ్గోడల మధ్య భావి సమాజాన్ని తయారుచేసే రూపశిల్పి గురువు. మట్టిముద్దను సుద్దులు పంచే బుద్ధునిగా ప్రవచినా, అణువణువు అణకువ నింపి, మంచి పౌరుడిగా తయారుచేసినా.. ప్రాణంపోసే వైద్యుడిగా మలచినా! దేశాన్ని రక్షించే సిపాయిగా తీర్చిదిద్దినా అది గురువుకే సాధ్యం. పిల్లలకి తల్లిదండ్రులు భౌతికంగా జన్మనిచ్చినా!? జ్ఞానాంకురాలు నాటి, మనో చైతన్యం నింపి, వారికి మరో పుట్టుకనిచ్చేది గురువులే.
 

                                                          మహోన్నతం గురుశిష్య బంధం..

గురుశిష్య బంధం మహోన్నతమైంది. తన దగ్గర చదువుకునే ప్రతి విద్యార్థి తనకంటే ఉన్నత స్థానం అందుకోవాలని ఆశించే నిస్వార్ధ బోధకులు ఉపాధ్యాయులు. లండన్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త హంప్రీ డేవి. ఆయన కార్మికులు బొగ్గు గనుల్లో పనిచేసేటప్పుడు వెలిగే దీపాన్ని కనిపెట్టారు. డేవి శిష్యుడు మిశ్చల్‌ ఫారడే. అయస్కాంత శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చడం, ఎలక్ట్రాలసిస్‌ వంటి పదుల సంఖ్యలో కీలకమైన ఆవిష్కరణలు చేశాడు ఫారడే. 'మీరు ఒకే విషయాన్నే కనిపెట్టారు. కానీ మీ శిష్యుడు చాలా ఆవిష్కరణలు చేశాడుగా?' అని ఒక విలేకరి హంప్రిని ఎద్దేవాగా అన్నాడు. అప్పుడు హంప్రీ 'ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫారడేను నేను కనిపెట్టాను. గురువుగా నేను అంతకుమించి సాధించాల్సింది ఏముంటుంది?' అని బదులిచ్చారు.
 

                                                       ఆధునిక సాంకేతికతకు ఆహ్వానం..

బోధన విధానంలో శరవేగంతో వస్తున్న ఆధునిక సాంకేతికతను ఆహ్వానించాలి. ఇటీవల కోవిడ్‌ నేర్పిన మరో పాఠం. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్యావిధానం అనేది గురువులకు, విద్యార్థులకు అనివార్యమైంది. ఈ పరిస్థితులను అందిపుచ్చుకోవడం అవసరమే. అయితే అందుకు తగ్గ భౌతిక పరిస్థితులు, వాటికి అవసరమైన వాటిని సమకూర్చుకోలేని వాళ్లే అత్యధికులు సమాజంలో ఉన్నారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వాలు ఆవైపు ఆలోచన చేయడం అత్యంతక కీలకమైనది. ఆ విద్యావిధానంలో గురువులకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో అందుకు అవసరమైన సాంకేతికతను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

Future-architect-Guru


                                                        కేరళ ఆదర్శం.. అనుసరణీయం..

సాంకేతికతలో కేరళ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుంది. కేరళలోని మలప్పురమ్‌ జిల్లాలోని మూర్కనాడ్‌ ప్రాంతంలో 'ఎఇఎంఎయుపి' స్కూలు ప్రయోగాత్మకంగా ఆగ్మెంటెడ్‌ రియాలిటీ పవర్స్‌ (ఏ టాపిక్‌ గురించి పాఠం చెబుతుంటే ఆ వస్తువు క్లాస్‌రూంలో ఉన్నట్లు విద్యార్థికి కనిపిస్తుంది) ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించి, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. పిల్లల్లో ఆసక్తిని కలిగిస్తూ వినూత్నంగా వారు నడిపిన ఆన్‌లైన్‌ క్లాసులు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. కొద్దికాలం క్రితం నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్టీ) ఒక సర్వే నిర్వహించింది. అందులో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. అవి సాంకేతికంగా, పిల్లల వైపు నుంచి వచ్చిన సమస్యలు. వాటన్నింటినీ అధిగమిస్తూనే అక్కడ ఉపాధ్యాయులు పిల్లలకు ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహించడం గొప్ప విషయం. మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా సమయంలో కొందరు ఉపాధ్యాయులు చెట్టులెక్కి మరీ ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించడం మనం చూసే ఉన్నాం. సెల్‌ఫోన్‌ సిగల్స్‌ అందని ప్రాంతాల్లో ఇళ్ల ముందు ప్రహరీగోడలపై పాఠాలు రాసి, వినూత్న ప్రయోగాలు చేసిన ఉపాధ్యాయులూ ఉన్నారు.

 

Future-architect-Guru

                                                              మారుతున్న విద్యా విధానం..

ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణతో చదువు సరుకుగా మారుతోంది. చదువు అంటే ర్యాంకులు, మార్కులు.. డబ్బు సంపాదించేదే విద్య అన్నట్లు మారిపోయింది. విషయ పరిజ్ఞానం కోసం కాకుండా పర్సంటేజ్‌ కోసం అక్షరాలను బుక్కించడం, పరీక్షల్లో కక్కించటంలా చదువులు మారుతున్నాయి. మానసిక వికాసం అందించలేని చదువులతో, ఒత్తిడితో.. విద్యార్థులు పెద్దయ్యాక చిన్నపాటి సమస్యను పరిష్కరించుకోలేకపోతున్నారు. ఫలితంగా క్షణికావేశంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రైవేట్‌ విద్యాలయాల్లో గురువుల యాంత్రికంగా తయారుచేస్తున్నారు. పిల్లలతో అనుసంధానం అయ్యే పరిస్థితులు అక్కడ మృగ్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నా గురువు తను నేర్పాల్సిన విద్య విషయంలో ఒత్తిడికి గురవుతున్నారు.
 

                                                         భవిష్యత్తు.. భవితపైనే దృష్టి

గతం కన్నా భవిష్యత్తుపైనే ఉపాధ్యాయులు ఎక్కువగా దృష్టి సారించాలి. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాబోయే కాలంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు భవితకు అవగాహన కలిగించాలి. అందుకు వారిని సంసిద్ధం చేయాలి. నాలుగు గోడల మధ్య పాఠ్యాంశాలకే పరిమితం కాకూడదు. ప్రపంచంలో నెలకొన్న అసమానతలకు, ఏర్పడిన పరిస్థితులకు కారణాలను, అందుకు పరిష్కారాలను గురువే ముందు బోధించాలి. తద్వారా సమసమాజాన్ని స్థాపించే ఆలోచన భీజాలను విద్యార్థిదశలో వేయగలిగినవాడు గురువే. కానీ సిలబస్‌ పూర్తిచేసేంతవరకే గురువులు పరిమితం అయితే, ఆ విద్యార్థులు అసమాన సమాజానికే సమిథవుతాడు.

Future-architect-Guru


                                                     అవార్డు కన్నా విద్యార్థి అభివృద్ధి ముఖ్యం..

'నాకు భారతరత్న కంటే నేను బోధించే శిష్యుడికి అందుబాటులో ఉండడమే నాకు ముఖ్యం' ఈ మాటలన్నది ఎవరో కాదు.. నోబెల్‌ పురస్కార గ్రహీత, భారతదేశం గర్వించే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త, భౌతికశాస్త్రంలో ఎంతో మందిని తీర్చిదిద్దిన గురువు సర్‌ సివి రామన్‌. 1954లో మన దేశానికి బాబు రాజేంద్రప్రసాద్‌ తొలి రాష్ట్రపతిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రామన్‌తో పాటు, తొలి భారత గవర్నర్‌ జనరల్‌ రాజగోపాలాచారి (రాజాజీ), ప్రముఖ తత్వ శాస్త్రవేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణలను తొలి భారతరత్నలుగా ఎంపిక చేసింది. అవార్డు కంటే పది రోజులు ముందొచ్చి రాష్ట్రపతి భవన్‌లో విడుదుండి, తమ ఆతిథ్యం స్వీకరించాలని రాజేంద్రప్రసాద్‌ రామన్‌కి ఆహ్వాన లేఖ పంపారు. 'శాస్త్ర పరిశోధన చేస్తున్న ఒక విద్యార్థికి నేను గైడ్‌గా ఉన్నాను. ఏ క్షణంలోనైనా ఆ విద్యార్థికి నా అవసరం రావచ్చు. అందువల్ల తమరి ఆహ్వానాన్ని నేను స్వీకరించలేక పోతున్నా. భారతరత్న పురస్కారం తీసుకోవడానికి కూడా సమయం అనుమతించక, రాలేకపోతున్నా!' అని సమాధానం ఇచ్చారు సర్‌ సి వి రామన్‌. తనకు భారతరత్న కీర్తి పురస్కారం కంటే ఆ విద్యార్థికి అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని గుర్తించిన మహోపాధ్యాయుడాయన. నేటి గురు తరానికి ఆయన అడుగుజాడ ఆదర్శ పథం.

Future-architect-Guru

                                                         ఆహ్లాదమైన తరగతిగదే కీలకం..

కేజీ అయినా పీజీ అయినా బోధనాభ్యసన ప్రక్రియ సక్రమంగా జరగాలంటే తరగతిగది ఆహ్లాదంగా ఉండాలి. నిత్య నూతనమైన బోధనతో ఉపాధ్యాయులు విద్యార్థుల్ని ఆకట్టుకోవాలి. అమ్మ ఒడి నుంచి బడికి వచ్చే పిల్లల్ని ఉపాధ్యాయులు తమ మాటలతో, హావభావాలతో మురిపించి, అమ్మను మరిపించాలి. ఇంటి వాతావరణాన్ని కొనసాగించేటట్టు బడి ఉండాలి. ఉపాధ్యాయుడు నవ్వుతూ విద్యార్థులతో కలిసి ఆడుతూ, పాడుతూ మమేకమవుతూ అనురాగం పంచుతూ.. ఆకాశపుటంచుల వరకూ పిల్లలను తీసుకెళ్లగలగాలి. పిల్లలు బడికి పరిగెడుతూ రావాలి. సాయంత్రం బడి విడిచిపెట్టిన తరువాత నడుస్తూ వెళ్లాలి. ప్రతి విద్యార్థి తన అంతరంగాన్ని ఉపాధ్యాయుల ముందు ఆవిష్కరించుకోగలగాలి. విద్యార్థుల్ని తరగతిగదిలో స్వేచ్ఛగా మాట్లాడనివ్వాలి, తమ మనోభావాల్ని పంచుకోనివ్వాలి.

Future-architect-Guru


                                                                 తల్లే తొలి గురువు..

ఈ ప్రపంచంలో అందరికీ తల్లే తొలిగురువు. పుట్టగానే సపర్యలతో సాకుతూ, ఉగ్గూ, ఉంగా మాటలతో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది అమ్మ. థామస్‌ అల్వా ఎడిసన్‌ అమెరికాలో చిన్నతనంలో ప్రాథమిక పాఠశాలలో చదువుకునే రోజుల్లో భౌతిక పరిశీలనలు తప్ప, చదువు పట్ల పెద్ద ఆసక్తి ఉండేది కాదు. 'మీ పిల్లవాడు చదువుకు పనికిరాడు' అంటూ లేఖ రాసి ఇంటికి పంపించేశారు ఆ పాఠశాల నిర్వాహకులు. అప్పటి నుంచి తల్లి నాన్సీ ఇలియటే గురువై, అతనికి సర్వం బోధించింది. పెద్దయ్యాక థామస్‌ ఆల్వా ఎడిసన్‌ వెలిగే బల్బుతో బాటు మోషన్‌ పిక్చర్‌ కెమెరా, ఫోనోగ్రాఫ్‌ వంటి వందల పరికరాలు కనిపెట్టి, మానవజాతిలో వెలుగులు నింపారు.

Future-architect-Guru

                                                        జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం..

ప్రముఖ తత్వవేత్త, భారతరత్న, విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని, ఏటా సెప్టెంబర్‌ ఐదున మనదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. మనదేశంలో విద్యాభివృద్ధికి విశేషకృషి చేసిన ఆయన సుదీర్ఘకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పేదరికంతో పూటకూళ్ల భోజనాలు చేస్తూ చదువుకున్నాడు. అతనికి ఫిజిక్స్‌ అంటే చాలా ఇష్టం. బిఎస్సీ ఫిజిక్స్‌ చదవాలని అతని కోరిక. ఆ రోజుల్లో టెస్ట్‌ పుస్తకాలు లేకపోతే తరగతులకు ప్రవేశం ఉండేది కాదు. పుస్తకాలు లేని కారణంగా చదువు మానేయాల్సి వచ్చింది. ఎవరో ఫిలాసఫీ పుస్తకాలు ఇస్తే వాటిని తీసుకుని బిఏ (ఫిలాసఫీ)లో చేరాడు. 'చదవడానికి ఏదైతేనేమి?' అనుకుంటూ.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. భారతీయ తత్వాన్ని వివరించడమే కాకుండా తత్వశాస్త్రంలో ప్రపంచ అగ్రగణ్యుల్లో ఒకరయ్యారు. ఆధ్యాత్మికతలో తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఉండే అగాథాన్ని ఆయనే భర్తీ చేశారు. అందుకే రాధాకృష్ణని ప్రపంచ మేధావులు ప్రాక్‌ పశ్చిమ వారథిó అని పిలుస్తారు. ఆయన ఎన్ని పదవులు అలంకరించినా, ఎన్ని బిరుదులు పొందినా ఉపాధ్యాయుడుగా ఉండటం, పాఠాలు చెప్పటమే ఆయనకి ఇష్టమైన వ్యాపకం.

Future-architect-Guru


                                                             ఆట.. పాటతో.. పాఠం..

గురువు అంటే పాఠం చెప్పడం.. మార్కులు వేయడం కాదు. విద్యార్థి కూడా మార్కుల కోసం తాపత్రయపడడం అంతకన్నా కాదు. మార్కులకన్నా.. మనసుకు ఆకళింపు చేసుకున్నది ఎంత అన్నదే కీలకం. పాఠాలు చెప్పేటప్పుడు ఉదాహరణలను, చరిత్రను, చుట్టూ జరిగే పరిస్తితులను జోడించి చెప్పడం అవసరం. ఇటీవల కొందరు టీచర్లు పిల్లలంతా క్లిష్టంగా భావించే సైన్సు, లెక్కలు వంటి సబ్జెక్టులపట్ల ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. అందుకు వారి సృజనాత్మకతను జోడించి, ఆట, పాటతో చెప్పేవారు కొందరు. చిత్రాలు గీసి వివరించే వారు ఇంకొందరు. మరికొందరు పిల్లలనూ భాగస్వామ్యం చేసి, ప్రాజెక్టు వర్కులు చేయడానికి ప్రోత్సహిస్తుంటారు.
     ఇంకొందరు గురువులు పిల్లల్ని పాఠ్యాంశాలకు సంబంధించిన ఫీల్డ్‌ ట్రిప్పులకు తీసికెళ్లి మరీ చూపిస్తారు. ఉదాహరణకు అన్నం, పప్పు ఎలా వస్తున్నాయనేది చాలా మంది పిల్లల్లో సందేహాన్ని రేకెత్తించే విషయం. అలాంటి పిల్లల్ని దగ్గరలో ఉన్న పొలానికో, పక్కనున్న గ్రామానికో తీసికెళ్లి అక్కడ పంటల్ని చూపించి బోధించే గురువులు ఉన్నారు.
   ఇలాంటి పద్ధతుల్లో పిల్లలకు బోధించడం వల్ల ఆ విజ్ఞానం వారిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంతేకాదు పంట ఎలా పండుతుందో అన్న ఒక్క విషయమే కాకుండా, రైతు గురించి, భూమి, పర్యవసానాలూ పిల్లల్ని విస్తృతంగా ఆలోచింపజేసేలా చేస్తాయి. పరిసరాల పరిజ్ఞానం పిల్లల్లో విజ్ఞాన కుసుమాలు వికసింపజేస్తాయి. ఫలితంగా విద్యార్థిలో ఆ రకమైన విజ్ఞాన సముపార్జన ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడుతుంది.

చిలుకూరి శ్రీనివాసరావు
ఫోన్‌ : 8985945506