
సెప్టెంబరు మొదటి తేదీన ఉద్యోగులు, ఉపాధ్యాయుల 'చలో విజయవాడ' భగ్నం చేయడానికి ప్రభుత్వం, పోలీసులు సమస్త ఆయుధాలు, నిర్బంధాలు ప్రయోగించడంతో మొదలుపెట్టి అమరావతి మహా పాదయాత్ర, కోర్టులలో అక్షింతలు, సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి దాఖలు, పోలవరం పునరావాస చర్చ, అయిదు రోజుల శాసనసభా సమావేశాలు, మధ్యలో ఎన్టీఆర్ పేరు మార్పు, అమరావతి మునిసిపాలిటీగా మార్పు, వరుసగా తెలుగుదేశం సభ్యుల సస్పెన్షన్, వివిధ తరగతులు, ఉద్యోగులు, కార్మికుల ఆందోళనలు, సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్టు విడుదల ఇలా ప్రతిదీ విమర్శాపాత్రంగా పరిణమించిన స్థితి. రాజకీయ వివాదాలను పెంచడం తప్ప నిజమైన సమస్యలను చర్చించి ప్రజాస్వామిక పరిష్కారాల దిశలో నడవడం ఊహించలేని ఘర్షణాత్మక వైఖరి. ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, పాలకపక్ష నేతలు తమ విధానమే సరైందని సమర్థించుకోవడం, ఎదురుదాడి చేయడం తప్ప ఒకింత పునరాలోచన, కాస్తంత చర్చ చేయడానికి సిద్ధంగా లేని స్థితి. ఈ మధ్యలో ఆర్థిక విధానాలకు సంబంధించిన భిన్న కథనాలు, కేంద్రం సహాయ నిరాకరణ కొనసాగడం అత్యంత ఇబ్బందికర వాతావరణానికి దారితీశాయి. వాటిని అలా వుంచి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో పోటాపోటీ పర్యటనలు, ఉద్రిక్తతలతో రెండు పార్టీలూ రెండేళ్ల ముందే ఎన్నికల జ్వరాన్ని పెంచేస్తున్నాయి.
అవిశ్వాసం, అసహనం
ఇక్కడ విశేషమేమంటే ఇరు పార్టీల అధినేతలు ఇతరులపై విమర్శలతో పాటు స్వంత పార్టీనేతల తీరుపై కూడా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడం. సీనియర్లు పనిచేయకపోతే టికెట్లు దక్కవని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మంత్రులు ప్రభుత్వాన్ని, తన కుటుంబాన్ని కూడా సమర్థించడం లేదని ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహోదగ్రులయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కోవర్టులు వున్నారని వారి సోషల్ మీడియాలోనే కథనాలు ఇస్తున్నారు. ఆర్థికశాఖ పత్రాలు లీక్ అవుతున్నాయని గతంలో చర్యలు తీసుకున్నారు కూడా. వైసిపి టిడిపిల పరిస్థితి ఇంటా బయిటా కూడా ఏమంత బాగాలేదని ఈ పరిణామాల సారాంశం. ఈ మధ్యలో బిజెపి కేంద్ర రాష్ట్ర నేతలు తమ తరహా మత ఎజెండా రాజేయడానికి కేంద్రాన్ని గొప్పగా చూపించడానికి తంటాలు పడుతున్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం బాగానే వున్నా తమ మిత్రపక్షమైన బిజెపి ఊసే వినిపించడంలేదు. వైసిపి, తెలుగుదేశంలు కూడా తమలో తాము తిట్టుకోవడం తప్ప కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి రావలసినవి రావాలనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బిజెపికి ప్రత్యామ్నాయం, రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం వంటి వాటిపై వివిధ ప్రాంతీయ పార్టీలు తమ తమ ధోరణిలో కదలికలు చూపిస్తుంటే ఈ రెండు పార్టీలు ఆ ప్రక్రియకు పూర్తి దూరం పాటిస్తున్నాయి. మోడీ పట్ల తమ పూర్తి విధేయత చాటుకుంటున్నాయి. ఈ మధ్య ప్రభుత్వం కేంద్రం నుంచి రావాలనే మాట కొంత వరకూ చెబుతున్నా అందుకు ఒత్తిడి పెంచే మార్గాలు అన్వేషించడం లేదు. అఖిలపక్షం ఆలోచనే లేకుండా పోయింది. ఈ పరిస్థితిలో నిజమైన సమస్యలపై పోరాడే ధోరణి లేదు గనక ఉద్యమాలలో దిగడం లేదు. వ్యక్తిగత అంశాలు, పాక్షిక వివాదాలతోనే కాలం గడిపేయడం మూడేళ్లుగా చూస్తున్నాం.
రాజధాని ప్రతిష్టంభన తీవ్రం
వచ్చే ఏడాది తర్వాత ఎన్నికలే గనక వాటిని మరింత తీవ్రం చేయడం ఊహించదగిందే. అమరావతి మార్పు నిర్ణయం దానిపై దీక్షలు మొదలై మూడేళ్లు కావస్తుంది. వెయ్యి రోజుల సందర్భంగా పాదయాత్ర తలపెట్టారు. దానికి ముందు 'అమరావతిపై వివాదాలు, వాస్తవాలు' అనే పుస్తకం విడుదల చేశారు. అది పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలను పొగిడేందుకు ఉద్దేశించింది. ఆయన ముఖ్యమంత్రిగా వుండగా పర్యావరణం, భూ సమీకరణ వంటి అంశాలపై ఆందోళన చేసిన ప్రతిపక్షాలు చలి కాచుకున్నాయని ఈ పుస్తకంలో చెప్పడం పొరబాటు. అదే పుస్తకానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు ఎ.పి లో మేధావులుగా చలామణి అయ్యేవారికి అసూయ, కక్ష తప్ప దూరదృష్టి వుండదని ఆరోపించడం మరింత పొరబాటు. కేంద్రం సరిగా సాయం చేసి వుంటే, గతంలో అన్నీ సక్రమంగా జరిగివుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఏమైనా ఈ ప్రభుత్వం అసలే ఎసరు పెట్టడంతో సమస్య మరింత జటిలమైంది. వైసిపి యేతర పార్టీలన్నీ అమరావతిని పూర్తి చేయాలనే కోరాయి. హైకోర్టు ఆవిధంగానే స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వాటిని పాటిస్తామని జగన్ ప్రభుత్వం అంగీకరించింది కూడా.
హైకోర్టు ఇచ్చిన ఆరు మాసాల గడువు ముగిసిపోతుందనగా ఇప్పుడు సుప్రీం కోర్టులో తీర్పును సవాలు చేసింది. బిల్లు ఉపసంహరించామంటూ గతంలో ఉపశమనం పొందిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అదే పాట పాడుతున్నది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో స్వల్ప వ్యవధి చర్య అంటూ పెట్టి వికేంద్రీకరణ అంటూ అమరావతి చర్చ మొత్తం తిరగదోడారు. అసైన్డ్ భూముల విషయంలో మాజీ మంత్రి నారాయణ తదితరులపై కేసు కూడా ఇప్పుడే విచారణకు వచ్చింది. అక్రమాలు కోర్టులో తేలితే ఎవరిపైనైనా చర్య తీసుకోవచ్చు. కాని దానికి రాజధాని నిలిపేయడానికి సంబంధం ఏమిటి? విశాఖకు ముఖ్యమంత్రి వచ్చేస్తారని మంత్రివర్గ సహచరులు ప్రకటనలే చేస్తున్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్న గందరగోళం. సుప్రీంలో కేసు దీనికి పరాకాష్ట. పైగా ఈ మొత్తం చర్చలో కులపరమైన విభజన, పదేపదే కులాల చిచ్చు ఒక జాడ్యంగా మారింది. బిల్లు ఉపసంహరించుకున్నా హైకోర్టు తీర్పు చెప్పడం తప్పని ఒక వాదన, మరోవైపు రాజధాని నిర్ణయం రాష్ట్రం పరిధి లోది గనక హైకోర్టు ఉత్తర్వు సరికాదని మరో వాదన వినిపిస్తున్నారు. బహుశా ఇవి సుప్రీం కోర్టు ముందు నిలవకపోవచ్చు, మళ్లీ హైకోర్టుకు తిరిగివచ్చినా రావచ్చు, లేదంటే నోటీసులు స్వీకరణ తిరస్కరణ వంటివి కూడా సాధ్యమే. ఏదైనా సమస్య మాత్రం అలా సాగదీయబడుతుందనేది నిర్వివాదాంశం. కోర్టులు ఏం చెప్పినా ప్రస్తుత ఆర్థిక స్థితిలో అమరావతికి నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేయలేమని ఇందులో పదోవంతు వ్యయంతో విశాఖలో రాజధాని పెంపొందిస్తామని ముఖ్యమంత్రి సూటిగా చెప్పనే చెప్పారు. మరోవైపున ఇదే సమయంలో ఎపిసిఆర్‌డిఎ చట్టాన్ని మార్చడం ద్వారా మొత్తం మాష్టర్‌ప్లాన్ అమలును తలకిందులు చేసేందుకు సిద్ధమైనారు.
దారి మళ్లింపు ఎత్తులు
ఈ చర్చ న్యాయపరంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందనే మీమాంస వుండగానే ఎన్ట్‌ఆర్ ఆరోగ్య వర్సిటీకి వైఎస్‌ఆర్ పేరు మార్పు పేచీ మొదలైంది. ఆరోగ్య వర్సిటీ ఆలోచనకు ఆద్యులు ఎన్టీఆరే. ఆయనకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైసిపి ఎప్పుడూ ఆరోపిస్తుంటుంది. కాని చెప్పా చేయకుండా అనవసరంగా ఈ మార్పు చేసి మరో వివాదాన్ని రగిలించింది. ఈ చర్య సరికాదని కొందరు వైసిపి నేతలతో సహా అత్యధికులు ఖండించారు. ఎన్టీఆర్‌ను వివాదంలోకి లాగడం ప్రభుత్వాలు మారితే పేర్ల మార్పు తతంగం సరికాదు కూడా. ఇలాంటివి గతంలోనూ జరిగిన మాట నిజమే గాని ఇప్పుడు సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదం రగలించిందనేది స్పష్టం. రాజధాని, పోలవరం, ఉద్యోగుల ఒపిఎస్ వంటి కీలకాంశాల నుంచి దృష్టి మరల్చడం కోసమే ఇదంతా జరుగుతుందనేది కాస్త రాజకీయాలు తెలిసిన వారంతా చెబుతున్న మాట. ఈ అభిప్రాయం రావడంతో ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్టు ముందుకొచ్చింది. గన్నవరం విమానాశ్రయంలో దొరికిన బంగారానికి సంబంధించిన ఆరోపణల పోస్టును ఆయన తన గ్రూపులో ఫార్వర్డ్ చేశారనే నెపంతో రాత్రి వేళ ఆయన వయసు, ఆరోగ్యం కూడా చూడకుండా సిఐడి పోలీసులు తీసుకుపోయారు. సమగ్ర సమాచారం కూడా వెల్లడించలేదు. సరైన పద్ధతిలో 41 నోటీసు ఇవ్వలేదనే కారణంతో సాయంత్రానికి కోర్టు విడుదల చేసింది. ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలా జరిగినా ప్రభుత్వం, పోలీసులు కళ్లు తెరవడం లేదు. పరస్పర అసహనాలు తాండవిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో ఇవి విద్వేషాల పెంపుదలకే దారి తీస్తున్నాయి. వివాదాలలో భాగంగా నాయకుల కుటుంబాలు మరీ ముఖ్యంగా మహిళల పేర్లు తీసుకురావడం జుగుప్సాకర స్థాయికి చేరింది. వామపక్షేతర పార్టీలు ఈ క్రమంలో ఉద్యోగలు, శ్రమజీవుల దీర్ఘకాలిక సమస్యలపై అసలు దృష్టి పెట్టకపోవడం కూడా విచారకరం. వ్యవసాయంపైన చర్చలే వెనక్కుపోయాయి.
బిజెపికి మహానందం
ప్రజలకు సంబంధం లేని నిత్య ఘర్షణలు, బూతు దాడులు ఇలా సాగిపోతుంటే మరోవైపు చాప కింద నీరులా బిజెపి అల్లుకుపోవడానికి పాచికలు వేస్తున్నది. దక్షిణాదిన కాలూనడం కోసం సినిమా తారలను, మతాలను, ఈడీ దాడులను ప్రయోగిస్తున్నది. మెగాస్టార్ చిరంజీవి భీమవరం సభలో ప్రధాని మోడీ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాక జూనియర్ ఎన్టీఆర్‌ను రప్పించారు అమిత్‌షా. ఇదంతా విజయేంద్ర ప్రసాద్ రాసే ఆరెస్సెస్ చరిత్ర సినిమాలో నటించేలా ఒప్పించడానికేనని ఒక కథనం చలామణిలో వుంది. ఇలాంటి తరుణంలో చిరంజీవి విడుదల చేసిన సినిమా లోని రాజకీయ డైలాగు కొంత చర్చకు దారితీసింది గాని ఆయన తాను సినిమా ప్రమోషన్ కోసమే దాన్ని ప్రసారం చేశానని స్పష్టం చేయడంతో ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంబంధం వుందంటూ తెలుగు రాష్ట్రాల నేతలపై ఇ.డి కత్తి వేలాడతీసింది.
అంతిమంగా మత విభేదాలనూ రగిలించేందుకు బిజెపి హేమాహేమీలు దిగివస్తున్నారు. అమరావతి, పోలవరంతో సహా చాలా కీలకాంశాలలో ద్వంద్వ క్రీడ సాగిస్తున్నారు. విభజిత రాష్ట్రమైన ఎ.పి ని ఆదుకోకపోగా అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. తెలంగాణ, ఎ.పి అపరిష్కృత సమస్యలపై 27న సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాలు సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు కేంద్ర నిర్లక్ష్యాన్ని, కుటిల వ్యూహాలను తిప్పికొట్టవలసిన సందర్భంలో పరస్పర కీచులాటలు అందరికీ హాని చేస్తాయి. కులమతాల చిచ్చు మరింత వినాశకరం.
తెలకపల్లి రవి