Oct 30,2022 11:01

బాలాజీ లారీని వోనర్‌కి వొప్పగించి డ్యూటీ దిగాడు. భుజానికి బ్యాగు తగిలించుకుని, ఇంటికి వెళ్తూ జేబు తడిమి చూసుకున్నాడు. నిండుగా డబ్బు. బట్టలు మురికిపట్టిపోయాయి. డ్యూటీ ఎక్కి14 రోజులైంది.
ఇక్కడనించి అపరాలు అస్సాంలోని గుహవటికి తీసుకుపోయాడు. అక్కడ్నించి టీపొడి కోయంబత్తూరు, అక్కడ నించి బట్టలు కేరళ, కేరళ నించి వస్తూ కొబ్బరి బోండాల లోడ్‌! మొత్తం మీద 14 రోజుల ప్రయాణం.
తనే డ్రైవర్‌. స్పేర్‌ లేడు. తనకి తోడు క్లీనర్‌. వాడికీ కొంచెం డ్రైవింగ్‌ వచ్చు.
ఈ ట్రిప్‌లో డబ్బు బాగా మిగిలింది. యజమాని ఇచ్చే రోజు బత్తా, దానిని బేటా అంటారు. అదీ, ప్యాసింజర్స్‌ని ఎక్కించుకుని వసూలు చేసిన సొమ్ము. ప్యాసింజర్స్‌ని ఎక్కించుకుంటే ఒక్కోసారి ప్రమాదం పొంచి వుంటుంది. వాళ్ళ రూపంలో దొంగలు ఎక్కి, దార్లో కొట్టి, సొమ్ము దోచుకుపోతుంటారు. ప్రమాదం వున్నా ప్యాసింజర్స్‌ని ఎక్కించుకోవడంలో తను వెనక్కి తగ్గేదిలేదు. జీతం, బేటాల కంటే అవే ఎక్కువ వస్తాయి మరి.
ఎంత సంపాదించినా ఏం లాభం? అంతా సారాయిలవాళ్లకి పోయడమే! చాలా డబ్బు తన తాగుడు వ్యసనానికి ఖర్చయిపోయింది.
ఇంతకు ముందు, డ్యూటీ దిగడమే ఆలస్యం ఫుల్‌గా తాగే ఇంటికి వెళ్ళేది. ఇంటికాడ వున్నన్ని రోజులూ మత్తులోనే, మందులోనే. తాగిందే తాగడం.. ఇంట్లో రూపాయి ఇచ్చేది లేదు.
ఏడాది క్రితం కొంచెం పక్షవాతంగా కనిపించింది. ఆస్పత్రికి పోతే తాగుడు మానుకొమ్మని, తాగితే ఇక చచ్చిపోవడమేనని డాక్టర్‌ చెప్పాడు. అప్పట్నించీ తాగుడు చాలావరకూ తగ్గించుకున్నాడు బాలాజీ. పూర్తిగా మానుకోవాలనుకుంటున్నాడు కానీ మానుకోలేకపోతున్నాడు.
ఇంటి దగ్గర భార్యాపిల్లలు ఎదురు చూస్తుంటారు. ఎదురుగా స్వీట్‌షాప్‌. డ్యూటీ దిగితే పిల్లలకి స్వీట్లూ, పండ్లూ తీసుకుపోవడం ఏడాది నించీ అలవాటైంది. స్వీట్‌షాప్‌ లోనికి దారితీసాడు. షాప్‌లో ఒకపక్కగా కూర్చుని, జేబులో డబ్బు తీసి లెక్కించాడు.
ఇంట్లో భార్యకి ఇచ్చేది తీసి ఒక జేబులో పెట్టుకున్నాడు. మళ్లీ డ్యూటీ ఎక్కేవరకూ తన మందు ఖర్చుకి తీసి, వేరేగా మరో జేబులో దాచాడు.
మళ్ళీ డ్యూటీ ఎక్కేది వారంరోజులకో, పది రోజులకో! అప్పటివరకూ రోజూ సందకాడ ఒక క్వార్టర్‌ తీసుకోవాలి.. అంతే! అదే ఎక్కువ. అంతకుమించి దాటకూడదు. వీలైతే మధ్యలో ఒక్కోరోజు మానుకోవాలి.
అందుకే, వీలైనంత తక్కువ మందుకి కేటాయించాడు. నివాసం వుండేది పట్టణశివార్లలో రేకుల గూడు. దానికి అద్దె పాతిక వందలు.
భార్య అక్కడ వున్న పొలాల్లో రోజూ కూలి పనులకి వెళ్తుంది.
నాలుగు లడ్లూ, నాలుగు మైసూరు కేకులూ ఇంకా ఏవో రెండురకాల స్వీట్లూ, అరకేజి మిక్చరూ తీసుకున్నాడు. కాలనీ పేరు చెప్పి, ఆటో ఎక్కి ఇంటికి వచ్చాడు.
'నానొచ్చాడు నానొచ్చాడు' అంటూ చిన్నోడు ఎగురుకుంటూ ఎదురొచ్చాడు. నవ్వుతూ వాడి చేతికి స్వీట్లు వున్న కవరు అందించాడు.
'బడికి పోకుండా ఇంటికాడ వున్నారేందిరా?'
'ఇయ్యాల ఆదివారం నాన్నా! బడిలేదు' పెద్దోడు చెప్పాడు.
'ఓ.. మర్చిపోయా, ఆదివారం కదూ! అమ్మ యాడికి పోయింది?'
'పనికి పోయింది!'
'తను వచ్చే రోజయినా ఇంటికాడ వుండొచ్చుగా!' అనుకున్నాడు బాలాజీ. ఉదయం ఫోన్‌ చేసి చెప్పాడు వస్తున్నట్లు.
బాత్‌రూంకి వెళ్ళి షాంపుతో తలంటుకుని వచ్చాడు. కొద్దిసేపు టీవీ చూసి, ఒంటిగంట కావడంతో అన్నం పెట్టుకుని తిని, మంచం ఎక్కాడు.
సాయంత్రం ఆరుగంటలకి మెలకువ వచ్చింది. అప్పటికే భార్య వచ్చి టీ పెట్టుకుని తాగి, తనకీ ఇచ్చింది. టీ తాగి చొక్కా వేసుకుని బయల్దేరాడు.
'ఇయ్యాల్టికి పోకపోతే ఏమయిద్దయ్యా, ఇంటికాడ వుండరాదూ! మినప్పప్పు నానేసాను, గారెలు చేస్తాను. మానుకుంటాను అంటంటవీ, మళ్ళీ పోతంటవీ! పైగా బాగలేని మడిసివీ!'
'పెద్దగా తీసుకోనులేవే, చాలా రోజులవతందిగా!'
బాలాజీకి ఇంతకుముందు చాలామంది స్నేహితులు వుండేవాళ్ళు. మందు దగ్గరే అందరూ సావాసం. నెమ్మదిగా వాళ్ళ స్నేహం తగ్గించాడు. వాళ్ళవలన తనూ, తనవలన వాళ్ళూ ఒకర్ని చూసి ఒకరు ఉత్సాహంగా తాగేవాళ్ళు. మానుకుందాం అని నిర్ణయించుకున్న తరువాత వాళ్ళనించి దూరం జరిగాడు.
'మన కడుపుకి మనం తింటేనూ, మన బతుకు మనం బతికితేనూ అదికాదు అసలు బతుకు. ఆపదలో వున్నోడికీ, కష్టంలో వున్నోడికీ, బాధల్లో బతుకుతున్నోడికీ చేతనయినంత మటుకి సాయం చేస్తే అదీ బతుకు. అప్పుడే ఆ బతుక్కి సార్ధకత' అనేది బాలాజీ అభిప్రాయం. లేనోళ్ళూ, ముసలోళ్ళూ లారీ ఎక్కితే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోక పోవడమే కాదు,వాళ్ళ వరిస్థితి బాగా లేదని తను అనుకుంటే, వాళ్ళకి ఎదురు ఎంతో కొంత ఇచ్చేవాడు. అంత మంచివాడు బాలాజీ. అయితే సారాయి వ్యసనం అతన్ని ఎక్కువ ఇబ్బంది పాలు చేసింది.
చిన్నగా నడుచుకుంటూ సారాయి షాపు దగ్గరకి వచ్చాడు. జనం. 14,15 ఏళ్ళపిల్లలు కూడా నిలబడి వున్నారు. క్యూ చాలా పొడవు వుంది.
ఇంత చిన్న పిల్లలు కూడా తాగుడు అలవాటు చేసుకుంటున్నారంటే ఇక లోకం ఏం బాగుపడుతుందీ.. అనిపించింది బాలాజీకి. లోకం కంటే ముందు వాళ్ళ జీవితాలు నాశనమైపోతాయి.
వాళ్ళ విషయం తరువాత, తన జీవితం నాశనమై పోలేదూ.. తను జీవితంలో ఎంత ఖర్చు చేసాడు సారాయికి. ఆ డబ్బు అంతా ఎవరు తిన్నట్లు?
ఊళ్ళో వున్న ఎకరం పొలం తన వ్యసనానికీ, తాగుడుకీ, తను చేసిన అప్పుకీ ఖర్చయిపోయింది. ఇప్పుడు ఆ పొలం ఎంత ధర పలుకుతున్నదో! తను ఖచ్చితంగా తాగుడు మానుకోవాల్సిందే. ఇంటికి వెళ్దామనిపించింది.
'సార్సార్‌! ఒక్క రూపాయి ధర్మం చేయండి సార్‌. మీకు పుణ్యం వుంటుంది సార్‌. ఒక్క రూపాయి చాలు సార్‌. పది మంది పది రూపాయలు ఇస్తే మా అమ్మకీ, నాన్నకీ మందులు కొనుక్కుంటాం సార్‌. మీ మేలు మరచిపోం సార్‌' ఒక పిల్లాడు దీనంగా యాచిస్తున్నాడు.
వాడికి తొమ్మిదీ, పదేళ్ళు వుంటాయేమో. వాడి వెంట ఐదారేళ్ళ చిన్నపిల్ల అనుసరిస్తోంది. ఆ పిల్లలు ఇద్దరూ ఎంత ముద్దుగానూ, పాలు కారే బుగ్గలతో ఎంతో మృదువుగానూ, సున్నితంగానూ, అందంగానూ వున్నారు.
క్యూలో నిలబడిన వాళ్ళని మొండికి పడి అడుక్కుంటున్నాడు. కొంతమంది ఇస్తున్నారు. కొంతమంది విసుక్కుంటున్నారు. ఇంకొంతమంది 'ఏహై పోరా దొంగ నాకొడకా! దొంగ వేషాలు!' అని తిడుతున్నారు.
ఒక పక్కగా నిలబడి చాలాసేపు ఆ పిల్లల్ని గమనించాడు. ఆ పిల్లలకి సహాయం చేద్దామనిపించింది బాలాజీకి. 'రేరు బాబూ ఇలా రారా!'
'ఏం సార్‌, ఒకరూపాయి ఇవ్వండి సార్‌. మా అమ్మకీ నాన్నకీ బాగులేదు సార్‌. మందులు కొనాలి' దీనంగా అడిగాడు.
'ఈ పాప ఎవర్రా?'
'మా చెల్లి'
'అన్నారు, నాకు ఆకలవతంది అన్నారు, ఏమన్నా కొనిపెట్టు అన్నారు!' ఆ పాప ఏడుస్తూ వాడ్ని వేధిస్తోంది.
'ఇప్పుడు కాదు, మందులకి డబ్బులు సరిపోవు' అంటూ వాడు ఆ పిల్ల మాటల్ని పట్టించుకోవడంలేదు.
'నీ పేరేంట్రా?'
'నాపేరు సుమన్‌. చెల్లిపేరు సుహాసిని'
'మంచి పేర్లే! నీ వెంట మీ చెల్లి ఎందుకురా?'
'దీనికి ఇంటి దగ్గర ఏం తోచదు. ఒక్కతే ఆడుకోదు. నాతోనే వుంటుంది.'
'మీ అమ్మానాన్నకి బాగు లేదా? నువ్వు చెప్పేది నిజమేనా? డబ్బు సంపాదించడానికి మీ అమ్మానాన్న మిమ్మల్ని ఇలా అడుక్కురమ్మని పంపించారు కదా?'
'లేదు సార్‌, అమ్మ తోడు! మా అమ్మానాన్న ఇద్దరకీ బాగులేదు సార్‌. అబద్ధం ఎందుకు చెపుతాను? వాళ్ళు బాగుంటే మేం ఎందుకు అడుక్కుంటాం?'
సుమన్‌ తెలివిగా, చురుకుగా వున్నాడనిపించింది బాలాజీకి. వాడి మాటల మీద నమ్మకం కలగలేదు.
'మీనాన్న ఏం పని చేస్తాడ్రా?'
'ఏంపని చేయడు సార్‌, మంచంలో వుంటాడు.'
'ఎప్పుడూ పని చేయడా?'
'ఇంతకుముందు లారీలు నడిపేవాడు. డ్రైవరు. ఇప్పుడు బాగలేదు.'
'లారీ డ్రైవరా? పేరేమిటి?'
'చెంచు సార్‌!'
'చెంచునా?' ఆశ్చర్యపోతూ అడిగాడు బాలాజీ.
'అవును సార్‌'
'మీ ఇల్లు ఎక్కడా?'
'ఇల్లా? మాది గుడిసె సార్‌! ఎదురు పేటలోనే. దగ్గరే, జనం ఎక్కువగా వుంటారని అడుక్కోవడానికి ఇక్కడకి వచ్చా సార్‌!'
'సరే, పదరా మీ గుడిసె దగ్గరకి. మీ నాన్ననీ, అమ్మనీ చూస్తాను.'
'వద్దు సార్‌! మీరు ఎందుకు మా గుడిసెకి? మీరు డబ్బులు ఇస్తే చాలుసార్‌!'
'పదరా! వాళ్లకి మందులు కొనిపెడతాను.'
సుమన్‌ అయిష్టంగానే కదిలాడు. ముగ్గురూ వాళ్ల గుడిసె దగ్గరకి వచ్చారు. పైన టార్పాలిన్‌ కప్పిన చిన్న గుడిసె అది. తలుపు కూడా లేదు.
సుమన్‌ వాకిలి ముందు నిలబడి అన్నాడు 'అమ్మా! మిమ్మల్ని చూడాలని ఒకాయన వచ్చాడు!'
వాకిలి ఎదురు బొంత మీద పడుకున్న ఆడమనిషి లేచి కూర్చుని, బయట నిలబడి వున్న బాలాజీని చూసి అడిగింది 'ఎవరు కావాలి?'
'లోపలికి రావచ్చా?' అడుగుతూనే బాలాజీ గుడిసె లోపలికి వచ్చాడు.
కుక్కి నులక మంచం మీద కూర్చున్న సుమన్‌ తండ్రి, వచ్చిన మనిషిని చూసి సంతోషంగా అన్నాడు 'అన్నా! నువ్వా? ఇటు వచ్చావేందన్నా?' అన్నాడు. అతనికి మోకాలి పైభాగం వరకూ లేదు.
'ఓరేరు చెంచూ.. ఏమైందీ, కాలు ఏమైందిరా?'
'కూచో అన్నా!' మంచం మీద ఒక పక్కకి జరిగి, చోటు ఇస్తూ అన్నాడు చెంచు.
గుడిసెలో నిలబడటానికి కూడా లేదు. బాలాజీ ఒక పక్కగా మంచం మీద ఒదిగి కూర్చున్నాడు. 'బాలాజీ అన్న.. ఈ అన్నే నాకు డ్రైవింగ్‌ నేర్పింది. అన్న ఎంత మంచోడో, చేతికి ఎముకే లేదు. ఎవురన్నా ఆపదల్లో వుంటే ఎనకా ముందాలోచించకుండా పేణం అయినా ఇచ్చే మనిషి. ఎంత మంచిబుద్ధో!' భార్యకి పరిచయం చేసాడు చెంచు.
ఆమె రెండు చేతులూ ఎత్తి, దణ్ణం పెట్టింది.
'ఏం జరిగిందిరా? కాలు ఎందుకు పోయింది?'
'ఏం చెప్పమంటావన్నా? నా కర్మ ! మా అత్తగారి వూళ్ళో తెల్సినవాళ్ళు లారీ కొన్నారు. వాళ్ళకి డ్రైవర్‌ కావాలంటే నీ దగ్గర మానుకుని, అక్కడకి పోయానా? బాగానే వుంది. నాలుగేళ్ళు పని చేశా! ఒకరోజు తాగి, లారీ నడుపుతా రోడ్‌ పక్కన ఆగిన ట్రక్‌ని గుద్దేశా. చావు తప్పింది కానీ, కాలు నుజ్జు నుజ్జు అయింది. అప్పుడే పోతే పీడా పోయేది.'
''ఛ.. అయ్యేం మాటల్రా? బిడ్డలున్నారు కదా? పిల్లలు ఎంత ముద్దుగా, ముచ్చటగా వున్నార్రా! వాళ్ళ కోసం అయినా బతకాలి.'

                                                                                  ***

బాలాజీకి గతం గుర్తొచ్చింది. అప్పుడు ఈ చెంచుకి లారీ డ్రైవింగే కాదు, తాగుడూ నేర్పింది తనే! వయసులో చెంచు తన కంటే ఒకటీ రెండేళ్ళు చిన్న వుండొచ్చు. అంతకుముందు ఏవో రకరకాల పనులు చేసి, ఎందులోనూ కుదురుకోక లారీకి క్లీనర్‌గా చేరాడు. అప్పటికి తనకి డ్రైవర్‌గా ఐదారేళ్ళ సర్వీస్‌.
ప్యాసింజర్ల దగ్గర వసూలుచేసే డబ్బు క్లీనర్లకి కొంత ఇవ్వాలి. డ్యూటీ దిగి ఇంటికి పోయేటప్పుడు, సారాయి కొట్టుకి వెళ్తూ చెంచుని కూడా వెంట రమ్మనేవాడు.
'కాదులే అన్నా ! డబ్బిస్తే ఇంటికి పోతాను. ఇంటికాడ నా పెళ్లాం ఎదురుచూస్తా వుండిద్ది!'
'నీకేనా పెళ్లాం వుందీ? నాకు లేదా? నా పెళ్ళాం ఎదురుచూడదా? తోడు రారా' అంటూ వెంట తీసుకుపోయేవాడు.
ముఖమాటస్తుడు.. పాపం, కాదనకుండా వచ్చేవాడు.
'నువ్వు కూడా కాస్త తీసుకోరా, ఏంకాదు' అని తను బలవంతం చేసినా మొదట్లో తీసుకోలేదు.
'వద్దులే అన్నా, ఏదయినా మరగటం తేలికే.. కానీ మానుకోవటం కష్టమంట. ఇసుంటి అలవాట్లు అయితే ఇక కొంప కొల్లేరయిద్ది. కూలికి పోతేనే కుండకాలే, లేకపోతే కడుపులు కాలే బతుకులు మాయ్యి. మా పెద్దబ్బ కొడుకు చెప్పేవాడు. ముందు మనం సారాయిని తాగితే తరవాత అది మన నెత్తుర్ని తాగిద్దంట! ఎందుకు లేనిపోని అలవాటు?' అనేవాడు.
తను వత్తిడి చేసేసరికి మొదట్లో గట్టిగా కాదూ కూడదన్నవాడు, నెమ్మదిగా కొద్ది కొద్దిగా అలవాటు చేసుకున్నాడు. ఇక కొంతకాలానికి తనని మించిపోయాడు.
'ఓరేరు మనం ఎంత తాగుబోతులమైనా తాగి ఎప్పుడూ బండి ఎక్కకూడదురా. నీకు అప్పుడు చాలాసార్లు చెప్పాను, తాగి బండి ఎక్కకూడద. నీకే కాదు, నేను డ్రైవర్లు అందరికీ ఇదే మాట చెపుతా. తాగి నడిపితే మనం పోతే పోయాం, ఒక్కోసారి ఎదుటోడ్నీ, వరస తప్పితే ఇంకా చాలా మందిని కాజేస్తాం. అది అంత ప్రమాదం.'
'నిజమే అన్నా, ఏమయిద్దిలే అని నేను కొద్దిగానే తీసుకున్నా. అది మత్తు.. విషం ఎంత కావాలి చావటానికి? ఇది విషం కన్నా ప్రమాదం.. విషం ఒక్కసారే చంపిద్ది. మత్తు రోజూ చంపేసిద్ది. తాగుడు మరీ ఎక్కువయ్యే సరికి నాకు లివర్‌ చాలా చెడి పోయిందన్నా. కాలు పోవటమే కాదు, లివర్‌ చెడిపోయేసరికి కడుపులో మెలికలు తిరిగిపోయే నొప్పి. అయిపోయింది.. ఇంక ఎక్కువ కాలం బతకను అన్నా. నా మీద నాకు ఆశ లేదు. దీనికి కడుపులో గడ్డ. ఆస్పత్రికి పోతే ఆపరేషన్‌ చేయాలన్నారు. బిడ్డలు పసోళ్ళు. వాళ్ళే రూపాయీ, అద్ద రూపాయీ అడక్కొచ్చి తిండికీ, చిన్న చిన్న మందులకీ జరుపుతున్నారు. కష్టాలు అన్నీ ఒక్కసారే చుట్టుముట్టినయ్యన్నా.'
'అరే, ఒక దెబ్బ కాదుకదరా. కుటుంబం మొత్తం చితికి పోయిందే. ఎన్ని బాధల్రా? చెల్లెమ్మా.. నువ్వేం భయపడవాకు. రేప్పొద్దున నిన్ను ఆస్పత్రికి తీసుకుపోయి చూపెడతా. కష్టం వచ్చినప్పుడే మనం ధైర్యంగా వుండాలి. భయపడి బెంబేలు పడవాకండి, పిల్లలు బెదిరిపోతారు.'
జేబులో వున్న డబ్బు మొత్తం తీసి చెంచు చేతికి ఇచ్చాడు బాలాజీ.
'వద్దులే అన్నా' అంటూనే ఆ డబ్బు తీసుకున్నాడు చెంచు.
'సరే నేను వెళ్తాన్రా! రేప్పొద్దున వస్తా, ఆస్పత్రికి పోదాం చెల్లెమ్మా !' అని వీధిలోకి వచ్చాడు బాలాజీ.
'తాగుడు ఎంత ప్రమాదం, ఎన్ని కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తోంది.. ఎన్ని పచ్చని సంసారాల్లో కణకణ మండే నిప్పులు పోస్తోంది?! తన తాగుడు అలవాటు వలన తను పోతే? రేపు తన కుటుంబానికి కూడా ఇదే గతి పడుతుంది. చెంచుని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఇక జన్మలో ఎన్నడూ తాగకూడదు. ఊపిరి పోతున్నా మందు వైపు కన్నెత్తి చూడకూడదు. చెంచు బిడ్డల ఈడే తనబిడ్డలకి కూడా. బిడ్డల కోసమైనా.. కాదు కాదు.. తన కోసమైనా తను సారాయి మానుకోవాలి!' అని ధృఢంగా నిర్ణయించుకున్నాడు బాలాజీ.
'వీలైనంత వరకూ చెంచు కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి!' అనుకున్నాడు. ఇప్పుడు బాలాజీ మనసు హాయిగా, ప్రశాంతంగా వుంది. చెంచు కుటుంబాన్ని ఆదుకోవాలని అనుకున్నందుకు సగం ఆనందం, తను తాగుడు పూర్తిగా మానుకోవాలని అనుకున్నందుకు మరోసగం ఆనందం. అలా మది నిండా ఆనందంతో ఉత్సాహంగా ఇంటివైపు అడుగులు వేశాడు బాలాజీ.

మొలకలపల్లి కోటేశ్వరరావు
9989224280