Aug 25,2023 10:44

టోక్యో / సియోల్‌ : ఫుకుషిమా అణు విద్యుత్‌ ప్లాంట్‌ నుండి అణు ధార్మిక వ్యర్ధ జలాలను పసిఫిక్‌ మహా సముద్రంలోకి విడుదల చేయడాన్ని జపాన్‌ గురువారం నుండి ప్రారంభించింది. దేశీయంగా, విదేశాల నుండి ఈ చర్యపై తీవ్రంగా విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోకుండా జలాల విడుదలకు ఉపక్రమించింది.
              ఈ కార్యాక్రమాన్ని ప్లాంట్‌ ఆపరేటర్‌ టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ (టెప్కో) ప్రత్యక్ష ప్రసారం చేయడం గమనార్హం. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్లాంట్‌ సిబ్బంది అణు వ్యర్థాల పంపును సముద్రంలోకి మళ్లించారు. దీంతో వివాదాస్పదమైన అణు వ్యర్థ జలాల విడుదల మొదలైంది. దీనిపై స్థానిక జాలర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. జపాన్‌ పొరుగు దేశాలు, పసిఫిక్‌ ఐలాండ్‌ దేశాల నుండి కూడా తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అణు వ్యర్థ జలాలను దశలవారీగా శుద్ధి చేసిన తర్వాతే సముద్ర జలాల్లోకి పంపుతునన్నట్లు నిర్వాహక కంపెనీ టెప్కో తెలిపింది. ఆ తర్వాత ప్లాంట్‌ నుండి ఒక కిలోమీటరు సొరంగం ద్వారా సముద్రంలోకి వదులుతున్నామని పేర్కొంది.
           2011 మార్చి 11న రెక్టార్‌ స్కేలుపై 9 తీవ్రతతో సంభవించిన భారీ సునామీతో ఫుకుషిమా విద్యుత్‌ ప్లాంట్‌ దెబ్బతింది. దాంతో అణు ధార్మికత వెలువడింది. దీన్ని లెవల్‌-7 అణు ప్రమాదంగా వర్గీకరించారు. అప్పటి నుండి పెద్ద మొత్తంలో వెయ్యి స్టోరేజీ ట్యాంకుల్లో ఈ నీటిని నిల్వ చేస్తూ వచ్చింది. నిల్వ చేయడం పెను భారంగా మారడంతో సముద్రంలోకి విడుదల చేయాలని నిర్ణయించారు.
 

                                                 'తీవ్రవాద చర్య' : దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత విమర్శ

కలుషితమైన అణు ధార్మిక వ్యర్ధ జలాలను పసిఫిక్‌ మహా సముద్రంలోకి విడిచిపెట్టడాన్ని 'తీవ్రవాద చర్య' గా దక్షిణ కొరియా ప్రధాన ప్రతిపక్ష పార్టీ చీఫ్‌ లీ జే ముయాంగ్‌ వ్యాఖ్యానించారు. 'ఈ సామ్రాజ్యవాద దురహంకార చర్యతో పొరుగు దేశాల్లోని ప్రజల జీవిత హక్కుకు జపాన్‌ ముప్పు కలిగిస్తోంది. తద్వారా దక్షిణ కొరియాకు, పసిఫిక్‌ మహా సముద్ర దేశాలకు మరో కోలుకోలేని ముప్పును తీసుకురాబోతున్నారు.'' అని పార్టీ సమావేశంలో లీ పేర్కొన్నారు. జపాన్‌ ఇలా అణు వ్యర్ధ జలాలను వదలడం రెండో పసిఫిక్‌ యుద్ధంగా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. జపాన్‌ తీసుకున్న ఈ చర్యతో దక్షిణ కొరియా మత్స్య పరిశ్రమ మొత్తంగా కుప్పకూలుతుందని లీ హెచ్చరించారు. ఈ చర్యపై తాము పోరాటం జరపనున్నట్లు ప్రకటించారు.