అన్ని రకాల పండ్లకు మద్దతు ధరల విధానం ప్రవేశపెట్టాలి. పండ్ల తోటలకు, దిగుబడి ఆధారిత వాతావరణ సమగ్ర పంటల బీమా పథకం అమలు పరచాలి. బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి. హార్టీకల్చర్ హబ్ ఏర్పాటుకై ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలి. ఉద్యాన పంటలు సాగు అవుతున్న ప్రాంతాలను మండలాన్ని యూనిట్‌గా తీసుకొని స్థానికంగా కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలి. పెట్టుబడి సాయం, కుటుంబం ఆధారంగా కాకుండా, ఎకరాల ఆధారంగా ఎకరాకు కనీసం రూ.10 వేలు ప్రకారం 10 ఎకరాల వరకు ఇవ్వాలి. పండ్ల తోటలకు అనుబంధంగా స్థానికంగా జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలి. చీనీ మార్కెట్‌లో ఈనామ్ వ్యవస్ధను రద్దు చేసి, వేలం పాట ద్వారా అమ్మకాలు జరపాలి. రైతు భరోసా కేంద్రాలలో అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో వుంచి 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలి.
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు పెరుగుతున్నది. ఆహార పంటలు గిట్టుబాటుకాక వాటి సాగు తగ్గడంతో ఉద్యాన పంటల సాగు మరింతగా పెరుగుతున్నది. నిమ్మ, బొప్పాయి, టమోటా, మిరప, నూనె పంటల ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రానిది మొదటి స్థానం. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పండ్లలో మన రాష్ట్రం నుండి 15.6 శాతం ఉత్పత్తి అవుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014-15లో 91.00 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన పంటల దిగుబడి వస్తే అది 2020-21లో కోటి 95 లక్షల టన్నుల దిగుబడికి పెరిగింది. సాగు విస్తీర్ణం సుమారు 45 లక్షల ఎకరాలకు పెరిగింది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 5,69,775 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఈ పురోగతి మా గొప్పతనం అంటూ గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి తమ ఖాతాల్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ పండ్ల తోటల సాగు ఎందుకు పెరుగుతున్నది, ఆ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? వాటిని పరిష్కరించడంలో తమ పాత్ర ఏమిటి? పండ్ల తోటల ఉత్పత్తిలోకి చొరబడుతున్న కార్పొరేట్ కంపెనీలను నివారించకపోతే వచ్చే ప్రమాదాలు ఏమిటి? అని పాలకులు శ్రద్ధ పెట్టడంలేదు.
తగ్గిన ఆహార పంటల సాగు-పెరిగిన పండ్లతోటలు
ఆంధ్ర రాష్ట్రం ధాన్యాగారం అన్నది ఒకప్పటి గొప్పగా మారింది. 1990 నుండి పాలకుల విధానాల్లో మార్పు వచ్చింది. ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలను ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను తీర్చే వ్యవసాయ ఉత్పత్తులకు కృత్రిమ గిరాకీ పెరిగింది. దానికితోడు ఆహార పంటలకు గిట్టుబాటు ధరలు అందని రైతాంగం సులభంగా ఇతర పంటల వైపు మళ్ళారు. దీని ప్రభావం స్పష్టంగా మన రాష్ట్రంలో కనిపిస్తుంది. 2010-11లో 45.56 లక్షల హెక్టార్లలో ఆహారధాన్యాలు సాగు కాగా, 2021-22లో 41.34 లక్షల హెక్టార్లు, 2022-23లో (ముందస్తు అంచనా ప్రకారం) 39.59 లక్షల హెక్టార్లకు పడిపోయింది.
రాష్ట్ర విభజన నాటికి పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం నాల్గవ స్థానంలో ఉన్నది. గత తొమ్మిది సంవత్సరాలలో పెరిగిన దిగుబడుల కారణంగా మన రాష్ట్రం ... దేశంలో కీలక స్థానానికి చేరింది. ముఖ్యంగా అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో సాగవుతున్న అరటి, బత్తాయి, మామిడి, బొప్పాయి సాగులో దేశంలోనే మనం ముందుపీఠిన ఉన్నాము. అనంతపురం జిల్లాలో 2018-19లో రెండున్నర లక్షల ఎకరాల్లో సాగయిన పండ్లతోటలు, 2023-24 నాటికి నాలుగు లక్షల 30 వేల ఎకరాలకు విస్తరించాయి. కాయగూరలు సుమారు 52 వేల ఎకరాల నుండి 11,97,750 ఎకరాలలో, మసాలా దినుసులు 20 వేల ఎకరాల్లో, పూలతోటలు 5 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. జిల్లాలో 37,078 హెక్టార్లలో సాగయిన బత్తాయి 8,89,879 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయ్యింది. టమోటా 66,265 ఎకరాల్లో సాగు పెరిగింది. మన రాష్ట్రంలో పండే పండ్లు, మసాల దినుసులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 22 నుండి 26 రకాల పళ్లు, 28 రకాల కూరగాయలు, 16 రకాల సుగంధ ద్రవ్యాలు రాష్ట్రంలో రైతులు సాగు చేస్తున్నారు. పండ్ల తోటలతో పాటు ఉల్లి, టమోటా, వివిధ రకాల పూలు వేల హెక్టార్లలో సాగు అవుతున్నది. అత్యంత వెనుకబడిన రాయలసీమ జిల్లాలలో ఈ పంటలు ఎక్కువగా సాగవుతున్నాయి. నేల స్వభావం పండ్ల తోటల సాగుకు తోడ్పతుంది.
కొత్త పంటలు- కొత్త సమస్యలు
వస్తున్న మార్పులకనుగుణంగా వ్యవసాయంలో కొత్త పంటలు సాగు కావలసిందే. ఈ కొత్త పంటలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. అందుకు అవసరమైన విజ్ఞానాన్ని అందించడానికి అవసరమైన సిబ్బంది, విత్తనాలు, పురుగు మందులు, రుణ సదుపాయాలు అందివ్వాలి. ప్రభుత్వమే మర్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. ఉద్యానపంటల ఆధారిత పరిశ్రమలు స్థానికంగా నిర్మించాలి. కానీ ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకోవడంలేదు. అందువల్ల ఉద్యాన పంటల రైతులు తీవ్ర సమస్యల్లో కూరుకుపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రాయలసీమ ప్రాంతంలో గత నాలుగు సంవత్సరాలుగా అతివృష్టి, అనావృష్టితో అన్ని రకాల పండ్లతోటలు భారీగా నష్టపోయాయి. పండ్లతోటలు ఒక్కసారి ఇలా నష్టం పోవడం అంటే ఒక పంట నష్టపోయినట్లు కాదు, ఐదు నుండి ఏడు సంవత్సరాల పెట్టుబడి నష్టం జరిగినట్లు, ఒక తరం అంటే సుమారు 35 సంవత్సరాల పంట నష్టం జరిగినట్లు. అలాంటి విపత్కర పరిస్థితులను పేదరైతులే కాదు మధ్యతరగతి రైతులు కూడా తట్టుకోవడం సాధ్యం కాదు. అసాధారణ నష్టం జరిగినప్పుడు అసాధారణంగా ప్రభుత్వాలు ఆదుకోవాలి. కానీ దశాబ్దాల క్రితం రూపొందించిన నిబంధనల పేరుతో ఉద్యాన పంటల నష్టానికి ప్రభుత్వం తగిన సహాయం చేయడంలేదు. గత సంవత్సరం వడగండ్ల వానలు, భీకరగాలుల వల్ల అరటి, బొప్పాయి, మామిడి, టమోటా లాంటి అనేక పంటలు అప్పులు చేసి, పంటలు సాగు చేస్తే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద విశ్వాసం కోల్పోయి, గత నాలుగు సంవత్సరాల్లో అనంతపురం జిల్లాలో 2019లో 46 మంది, 2020లో 67 మంది, 2021లో 44 మంది, 2022లో 62 మంది, 2023లో ఇప్పటివరకు 26 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కావున పెరుగుతున్న సాగు ఖర్చులు తగ్గించి ఆత్మహత్యల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని రైతుల ఆత్మహత్యలు నివారించాలి.
దళారుల దగా
పండిన పంటను అమ్ముకోవడానికి స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేదు. పన్నుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ సదుపాయం కల్పించడంలో ఉద్దేశ్యపూర్వకమైన అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని దళారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లాలో పది టన్నుల బత్తాయి అమ్మితే ఒకటిన్నర టన్ను ఉచితంగా దళారీలకు రైతులు చెల్లిస్తున్నారు. అరటి ధర మీద 10 శాతం కమీషన్ దళారులకు చెల్లిస్తున్నారు. అలాగే ద్రాక్ష, మామిడి, నిమ్మ, దానిమ్మ ఇలా అన్ని పంటల ధరలపై 10 నుండి 15 శాతం కమీషన్ చెల్లిస్తే తప్ప రైతులు అమ్ముకోలేని పరిస్థితి. వీరికి తోడు పంటల పెట్టుబడికి అప్పులు ఇచ్చే వడ్డీవ్యాపారుల దోపిడి పెరిగిపోతున్నది. మిరప, ఉల్లి లాంటి పంటల సాగుదార్లలో అత్యధికమంది కౌలు రైతులు. వీరు ముందస్తు కౌలు చెల్లించాల్సి రావడం, ప్రభుత్వ రుణ సదుపాయం లేకపోవడంతో ఈ ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తుంది. అలాగే ఫెర్టిలైజర్ షాపు యజమానులు రైతులను లూటీÄ చేస్తున్నారు. అప్పు అంటే నాశిరకం విత్తనాలు, పురుగు మందులు ఇచ్చే పరిస్థితి చాలా చోట్ల కొనసాగుతున్నది. వీటిని తనిఖీ చేసే విధానం అమలులో నిర్వీర్యం అయ్యింది.
ప్రభుత్వ నిరాదరణ
ఈ పంటలను ప్రోత్సహించడానికి గతంలో ప్రభుత్వాలు తుంపర సేద్యం పేరుతో డ్రిప్, స్ప్రింక్లర్లు అధిక సబ్సిడీతో ఇచ్చారు. పండ్ల మొక్కలు ఉచితంగా ఇవ్వడం, తొలుత మూడు సంవత్సరాల పాటు ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకానికి నిధులు ఇవ్వటం, తైవాన్ స్ప్రేయర్లు, టార్పాలిన్లు ఇవ్వటం వంటి కొన్ని ప్రోత్సాహకాలను అందించారు. దీనివల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2003-04లో 5,001 మంది రైతులకు 8,787 హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్లు మంజూరు కాగా, 2017-18 నాటికి 18,677 మంది రైతులకు 22,717 హెక్టార్లకు విస్తరించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాను కూడా కలిపి చూస్తే 2003-04 సంవత్సరంలో 9,737 మంది రైతులు 17,468 హెక్టార్లు, 2017-18 నాటికి 29,720 మంది రైతులు 34,814 హెక్టార్లకు ఈ సదుపాయం విస్తరించింది.
ప్రస్తుత వైసిపి రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్, స్ప్రింక్లర్లు మంజూరు చేయడాన్ని నిలిపివేయడంతో సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు, రైతులపై అదనపు భారం పడింది. 2022-23లో 11,061 మంది రైతులు 13,671 హెక్టార్లలో, 2023-24 సంవత్సరంలో మరింతగా తగ్గి 6,827 మంది రైతులు 8,349 హెక్టార్లలో మాత్రమే ఈ పరికరాలు అందాయి. పండ్లతోటల సాగు మధ్యలో ప్రభుత్వం సబ్సిడీ నిలిపివేయడంతో పంటలను రక్షించుకోవడానికి ఎకరాకు రూ. 60 వేల వరకు ఖర్చు చేసి డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది.
ప్రభుత్వ ఉదాసీనతను కార్పొరేట్ శక్తులు సొమ్ము చేసుకుంటున్నాయి. ఉద్యాన పంటల రైతులతో పంట ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. పండిన పంటను గ్రేడింగ్ పేరుతో నిలువునా ముంచుతున్నారు. వేల ఎకరాల్లో ఒకే రకం కాయగూరలు సాగు చేయించే ప్రయత్నం ఈ కంపెనీలు పెద్దఎత్తున చేస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలు
అన్ని రకాల పండ్లకు మద్దతు ధరల విధానం ప్రవేశపెట్టాలి. పండ్ల తోటలకు, దిగుబడి ఆధారిత వాతావరణ సమగ్ర పంటల బీమా పథకం అమలు పరచాలి. బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి. హార్టీకల్చర్ హబ్ ఏర్పాటుకై ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలి. ఉద్యాన పంటలు సాగు అవుతున్న ప్రాంతాలను మండలాన్ని యూనిట్‌గా తీసుకొని స్థానికంగా కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలి. పెట్టుబడి సాయం, కుటుంబం ఆధారంగా కాకుండా, ఎకరాల ఆధారంగా ఎకరాకు కనీసం రూ.10 వేలు ప్రకారం 10 ఎకరాల వరకు ఇవ్వాలి. పండ్ల తోటలకు అనుబంధంగా స్థానికంగా జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలి. చీనీ మార్కెట్‌లో ఈనామ్ వ్యవస్ధను రద్దు చేసి, వేలం పాట ద్వారా అమ్మకాలు జరపాలి. రైతు భరోసా కేంద్రాలలో అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో వుంచి 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలి. డ్రిప్, స్ప్రింకర్లపై జిఎస్టీ రద్దు చేసి, దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలి. పంట నష్టం పరిహారం నిబంధనల జీవో సవరించాలి. నేలరాలిన పండ్లకు పరిహారం ఇచ్చే విధంగా జీవో సవరించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పరిహారం ఇవ్వాలి. పండ్లతోటల రైతులు సంఘటితమై సమస్యల పరిష్కారానికి పోరాడాలి. అందుకు విశాల ఐక్య రైతు ఉద్యమం నేటి అవసరం.
( వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు )
వి. రాంభూపాల్