అపుడెపుడో గీసుకున్న బొమ్మలు
ఆవిరిగీతిని ఆలపిస్తున్నాయి..
వేళ్ల వెంట జారిపోయిన వర్ణాలు
నేల బారున కన్నీటి నదులైనాయి!
కొత్త కాన్వాసు ఒకటి
ఖరీదు చేయమని చెప్పాలి గుండెకి!
రాత్రి పారేసుకున్న నక్షత్రాలు
ఎద మోటబావిలో మునుగుతూ తేలుతూ ఉన్నాయి..
వొలికిపోయిన వెన్నెల్లు
నాచుగోడలపై వేళ్లాడుతున్నాయి!
కొత్తాకాశమొకటి కనమని విన్నవించాలి కాలానికి!
బాటలకిరువైపులా గొంతుతెగి
గడ్డిపూలన్నీ బావురుమంటున్నాయి..
దోచుకోబడ్డ హరితం
దావానలమై మండుతున్నది!
కొత్త వనమొకటి కూర్చమని
విజ్ఞతల తోటమాలికి కబురుచేయాలి!
అలవాటుగా మొన్న నడిచెళ్లిన తోవలో
నిన్న ముళ్ళు పరిచారెవరో...
అనుభవాల నిండా ముళ్లు దిగబడి
గత విజయాలన్నీ రక్తసిక్తమయ్యాయి!
పాత పాత్రలో ఇమడని
వ్యూహపుద్రవమేదో
అంచుల వెంబడి పొర్లి
బతుకు పొయ్యిని ఆర్పేసింది!
ముళ్లను మెట్లుగా చేసే
ఆలోచనా దారేదో తవ్వుకెళ్లాలి...
మెదడుపలుగుని బయటికి తియ్యి!
చప్పగా చతికిలబడ్డ కుంపటిని
రాజేయాలి
ప్రయత్ననిప్పుని దుయ్యి!
నేనొక పురాతన దారైతే
నువ్వో నూతన ద్వారమై
నీలోకి నేను...
నా వెంట నువ్వూ....
కొత్త దారుల కోసం
కలిసి పయనిద్దాం!
నిరాశలోనే ఆశ ఉంది!
నిశీధిలోనే ఉషోదయముందని
నిరూపిద్దాం!
డి.నాగజ్యోతి శేఖర్
94921 64193