రాఘవుడు, మాధవుడు, సుధర్ముడు చిన్ననాటి నుండి ఒకే గురుకులంలో చదువుకున్నారు. విద్యాభ్యాసం అయ్యాక రాఘవుడు రాచకొలువులో ఉద్యోగం సంపాదించాడు. పట్టణంలో తనకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని మాధవుడు చేపట్టాడు. సుధర్ముడు గ్రామం చేరి, తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకోసాగాడు.
వారివారి పనుల్లో వారు తీరిక లేకుండా గడపడంతో చాలాకాలం ఒకరినొకరు కలుసుకోవడం కుదరలేదు. ఇలావుండగా ఒకసారి మాధవుడు వ్యాపారం పని మీద రాజధాని వెళ్ళి, పని పూర్తయ్యాక రాఘవుడ్ని కలిశాడు. చిన్ననాటి విషయాలన్నీ గుర్తు చేసుకున్నారు. మాటల మధ్యలో సుధర్ముడి విషయం ప్రస్తావనకు వచ్చింది.
'ఏమిటో? సుధర్ముడు ఏ ఉద్యోగమో, వ్యాపారమో చూసుకోక పల్లెకెళ్ళి మట్టి పిసుక్కుంటూ బతుకుతున్నాడు!' అంటూ కాస్త హేళనగా మాట్లాడాడు రాఘవుడు.
రాజోద్యోగం లభించాక రాఘవుడిలో గర్వం కలిగిందని మాధవుడు గమనించాడు అయినా గమనించనట్టే వుండిపోయాడు.
'అవును వాడ్ని చూసి చాలాకాలం అయింది. ఒకసారి వెళ్ళొద్దాం' అన్నాడు మాధవుడు. రాఘవుడు కూడా సరేనన్నాడు.
అనుకున్న రోజుకు రాఘవుడు, మాధవుడు కలిసి సుధర్ముడి ఊరికి వెళ్ళారు. పెద్ద ఖాళీస్థలంలో పూరింట్లో సుధర్ముడు భార్యాపిల్లలతో నివసిస్తున్నాడు. ఖాళీస్థలంలో పశువులు, వాటిని చూసే పనివాళ్ళు వున్నారు. వీరి రాకకు సుదర్శనుడు ఎంతగానో సంతోషించి, అతిథి మర్యాదలు చేశాడు. పాలు, పెరుగులతో పెరట్లో పెరిగిన కాయగూరలతో కమ్మటి భోజనం పెట్టాడు. నగరంలో అలాంటి భోజనం మిత్రులిద్దరు తిని ఎరగరు. ఊడలు దిగిన మర్రిచెట్టు కింద నీడలో కబుర్లు చెప్పుకున్నారు. ఆ ప్రశాంత వాతావరణం, హడావుడి లేని జీవితం మిత్రులిద్దరినీ కట్టిపడేసింది. దాంతో రాఘవుడిలో కాసింత అసూయ కూడా చోటు చేసుకుంది. తనకు అధికారం, ఐశ్వర్యం వుండవచ్చుకానీ ఇంతటి ప్రశాంతత లేదు. ఈ విషయాన్ని సూక్ష్మగ్రాహి అయిన మాధవుడు పసిగట్టాడు. రెండురోజులు సుధర్ముడి ఇంట గడిపిన రాఘవుడు, మాధవుడు తిరిగి ప్రయాణమయ్యారు. ఆ సమయంలో రాఘవుడు సుధర్ముడి మీద తనకున్న అక్కసును వెళ్ళగక్కాడు. ఇదే తగిన సమయం అనుకుని మాధవుడు రాఘవుడితో ఇలా అన్నాడు.
'నువ్వు ఏమీ అనుకోనంటే ఒక విషయం చెబుతాను. మనుషుల్లో కొన్ని బలహీనతలుంటాయి. అందులో ఒకటి తమకంటే ఎవరైనా తక్కువ స్థితిలో వుంటే వారి మీద చులకన భావం ఏర్పడుతుంది. అలానే తనకంటే ఎక్కువ స్థితిలో ఎవరైనా వున్నారనిపిస్తే వారి మీద అసూయ కలుగుతుంది. సుధర్ముడ్ని చూడక ముందు నీలో వాడి మీద చులకన భావం వుండడం నేను గమనించాను. వాడి ప్రశాంత జీవితం చూశాక నీలో అసూయ కలిగింది. అది మంచిది కాదు. మనకంటే తక్కువ వారు కనిపిస్తే జాలిపడాలి. వీలున్నంతలో సహాయపడడానికి ప్రయత్నించాలి. అలానే మనకంటే పై స్థితిలో వున్నవారు కనిపిస్తే అసూయ పడరాదు. వారలా వున్నందుకు ఆనందపడాలి. మనమూ వున్న దాంతో తృప్తిపడాలి లేదా మనకు కావల్సింది కష్టపడ,ి సంపాదించుకోగలగాలి. ఇలాంటి బలహీనతలను జయిస్తే ప్రతి మానవుని జీవితం ఆనందమయం అవు తుంది. లేకపోతే ఎంత వున్నా అశాంతి వెంటాడుతూనే వుంటుంది. ఇవన్నీ నీకు తెలియనివికావు. ఒక్కోసారి సరిగా ఆలోచించ లేకపోతాం అంతే! అందుకని మిత్రధర్మంగా ఇంత చెప్పాను.. ఏమీ అనుకోవని నాకు తెలుసు' అన్నాడు మాధవుడు.
తనలోని బలహీనతను సున్నితంగా ఎత్తి చూపిన మిత్రునికి కృతజ్ఞతలు తెలిపాడు రాఘవుడు. ఆ తరవాత కాలంలో మిత్రుని మంచిమాటలు ఆచరిస్తూ తన జీవితాన్ని ఆనందమయం చేసుకున్నాడు.
డా.గంగిశెట్టి శివకుమార్
9441895348