Sep 10,2022 06:53

జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం హర్షణీయం. 'ఒక పౌరుడికి ఉన్న స్వేచ్ఛలన్నిటినీ కాలరాసి బలవంతంగా చీకటి గదిలో నిర్బంధించిన సిద్ధిఖీ కప్పన్‌ కుమార్తెను నేను. 75 ఏళ్లుగా మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వతంత్య్రాలు గాంధీజీ, నెహ్రూ, భగత్‌ సింగ్‌ వంటి స్వాతంత్రయోద్యమ నేతల త్యాగాల ఫలితం. భావ ప్రకటనా స్వేచ్ఛ మనందరి హక్కు. మా నాన్నకు స్వేచ్ఛ నివ్వండి' అంటూ పద్రాగస్టు రోజున పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో సిద్ధిఖీ తొమ్మిదేళ్ల కుమార్తె మెహ్నాజ్‌ కప్పన్‌ ఆకాంక్ష ఇది. సిద్ధిఖీ నిర్బంధాన్ని ఖండిస్తూ అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాదాపు రెండేళ్లుగా ఉత్తరప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం ఆయనను వేధిస్తూ వచ్చింది. అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడమే కాకుండా బెయిల్‌ రాకుండా పదేపదే అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలోనూ పసలేని అభ్యంతరాలతో బెయిల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన యోగి సర్కార్‌కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు లలిత్‌, జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌తో కూడిన ధర్మాసనం మొట్టికాయలు వేసింది. ప్రతి పౌరుడికీీ భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ఒకటుంటుందనే విషయాన్ని గుర్తించండని తలంటింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెత్మలానీ ధర్మాసనం నిలదీతలతో ఉక్కిరిబిక్కిరి అవ్వకతప్పలేదు.
     కప్పన్‌ ఒక పాత్రికేయుడు. నిజాలను నిర్బయంగా రాసే తెగువున్న యువకుడు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో రెండేళ్ల కిందట ఒక దళిత బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన పెత్తందారి దుండగులను రక్షించేందుకు అక్కడి అధికార యంత్రాంగం ఆ బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా సమాచారమివ్వకుండా దహనం చేసింది. అమానవీయమైన, అత్యంత హేయమైన ఈ దురాగతాన్ని ఆధార సహితంగా వెలుగులోకి తీసుకొచ్చిన పాత్రికేయుల్లో కప్పన్‌ ఒకరు. అందుకనే ఆయనపై బిజెపి సర్కార్‌కు అంతటి పగ. దళిత బాలికకు న్యాయం దక్కాలని కోరుకున్న ఆయనపై 'దేశద్రోహ'ముద్ర వేసేందుకు యోగి సర్కార్‌ విఫలయత్నం చేసింది. తీవ్రవాద సంస్థ అయిన పిఎఫ్‌ఐతో సంబంధాలున్నాయంటూ యుఎపిఎ (ఉపా), ఐపిసిలోని సెక్షన్‌ 120బి, 153ఎ, 295ఎ వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు బనాయించి వేధింపులకు గురి చేసింది. ఈ కేసుల్లోనూ వేటికీ కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవు. సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఇదే అంశాన్ని నిలదీయగా..ఒక కరపత్రాన్ని యోగి సర్కార్‌ సాక్ష్యంగా పేర్కొంది. అది కూడా అత్యాచారానికి గురైన దళిత బాలికకు న్యాయం చేయాలని కోరుతూ నిరసనలకు సంబంధించిన ప్రచారపత్రం. ఇంతటి తీవ్రమైన నేరాలకు మీరు సేకరించిన సాక్ష్యం ఒక ఐడి కార్డు..ఒక కరపత్రమా అంటూ ధర్మాసనమే విస్మయం వ్యక్తం చేసింది. నిరసనలకు పిలుపునివ్వడమే నేరమా? అంటూ నిలదీసింది. యోగి సర్కార్‌కు తలంటుతూనే భావ ప్రకటాన స్వేచ్ఛ ప్రాధాన్యతను సుప్రీం ధర్మాసనం నొక్కి చెప్పింది. 2012లో నిర్బయ ఘటన సందర్భంగా ఇండియా గేటు వద్ద పోటెత్తిన నిరసనలను ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. ఈ నిరసనల తర్వాతే మనం చట్టాలు మార్చుకున్నామనే సంగతినీ గుర్తు చేసింది. గొంతుక లేనివారి పక్షాన గొంతెత్తితే తప్పేంటని కడిగిపారేసింది.
    కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ సంస్థలను బిజెపి సర్కార్‌ నిర్వీర్యం చేస్తూ వస్తోంది. పౌరుల హక్కులను, భావ ప్రకటనా స్వేచ్ఛనూ హరించివేస్తోంది. సామ, దాన, దండోపాయాలతో మీడియాను తన అనుచరుల గుప్పిట్లో ఉండేలా కుట్రలు చేస్తోంది. మోడీ క్రోనీ మిత్రుడు గౌతం అదానీ ఎన్‌డిటివిని చేజిక్కించుకునేందుకు ఎంతటి అనైతిక కుట్రలకు పాల్పడ్డాడో చూశాం. ద వైర్‌, న్యూస్‌క్లిక్‌, ఆల్ట్‌న్యూస్‌ వంటి స్వతంత్ర మీడియా సంస్థలను కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి వేధింపులకు గురి చేసిన వైనాన్ని చూశాం. జనానాన్ని తప్పుదారి పట్టించేందుకే ప్రత్యామ్నాయ మీడియా సంస్థలను, భావ ప్రకటనా స్వేచ్ఛను బిజెపి హరిస్తోంది. స్వేచ్ఛా స్వతంత్రాల కోసం పోరుసల్ఫుతున్న ప్రజాస్వామ్య గొంతులకు సుప్రీం ఇచ్చిన తీర్పు గొప్ప ఊరడింపు. భావ ప్రకటనా స్వేచ్ఛ వర్దిల్లాలి.