Jan 27,2023 07:27

          ఎన్‌ఐఎ, సిబిఐ, ఇడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు, బిజెపి పాలిత రాష్ట్రాల్లోని పోలీసులు సాగిస్తున్న నిర్వాకంతో నిర్దోషులు జైళ్లలో మగ్గుతుంటే నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. పరివార్‌ పాలకులు తమ అనుయాయులకు అనుకూలంగా దర్యాప్తులను ప్రభావితం చేస్తున్న తీరు, తమను ప్రశ్నించేవారిని హింసిస్తున్న కక్షపూరిత వైఖరి దారుణంగా ఉన్నాయి. గుజరాత్‌ 2002 మత ఘర్షణల్లో పట్టపగలు వేలాది మంది ముస్లిం మైనార్టీలపై హత్యాకాండ సాగింది. ఈ ఘటనల్లో అరెస్టు చేయబడ్డ నిందితులు.. మెల్ల మెల్లగా నిర్దోషులుగా విడుదలవుతున్నారు. తాజాగా 14మంది నిందితులను నిర్దోషులుగా తేల్చుతూ హాలోల్‌ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్‌ సరైన ఆధారాలు సమర్పించలేదని కేసును కొట్టేసింది. మత ఘర్షణలు 2002లో జరగ్గా, చార్జిషీట్‌ 2004లో నమోదైంది. కోర్టు విచారణ 18 ఏండ్ల తర్వాత మొదలైందంటేనే ఆ రాష్ట్ర ప్రభుత్వ తాత్సారం ఎంతలా ఉందో బోధపడుతుంది. 'నేరం జరిగిన చోట నిందితుల పాత్ర ఉందని నిరూపణ కాలేదు. నిందితులు వాడిన కత్తులు, గొడ్డళ్లు వంటివేవీ కేసు విచారణ జరిపిన పోలీసులు సేకరించలేదు. ఆయుధాలు, పెట్రోల్‌, కిరసనాయల్‌ వంటి పదార్థాలు నేరం జరిగిన చోట వాడినట్టు ఆధారాలు లభ్యం కాలేదనీ కొంతమంది కనిపించలేదనే కారణంతో నిందితుల్ని దోషులుగా నిర్ధారించలేమ'ని న్యాయస్థానం అభిప్రాయపడింది. వీటినిబట్టి దోషులను రక్షించడానికి ప్రాసిక్యూషన్‌ ఎంత పక్షపాతంగా ఉందో విదితమవుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్‌ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు కుమార్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు మధ్యంతర బెయిల్‌ మంజూరయింది. 2021 అక్టోబర్‌ 3న లఖింపూర్‌ ఖేరీ జిల్లాలోని టికునియాలో అప్పటి ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులను ఆశిష్‌ మిశ్రా, తన అనుచరగణం వాహనాలతో తొక్కించడం వల్ల ఎనిమిది మంది రైతులు, జర్నలిస్టు మరణించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌ లభించడం ప్రజలకు ఎటువంటి సంకేతాన్నిస్తుంది? అంతేగాక ఉన్నావో అత్యాచార నిందితులకూ బెయిల్‌ మంజూరయింది.
        మరోవైపు భీమా కోరెగావ్‌ కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు చేయడానికి కేంద్రం ఆధీనంలోని ఎన్‌ఐఎ ఎన్ని వికృత వాదనలు చేస్తోందో లోకానికి తెలియనిది కాదు. పండు ముదుసలి, పార్కిన్‌సన్‌ వ్యాధిగ్రస్తుడైన ఫాదర్‌ స్టాన్‌ స్వామి జైలులోనే మగ్గి తుది శ్వాస విడిచిన దుస్థితి. ద్రవాహారం తీసుకోవడానికి స్ట్రా కూడా ఇవ్వడానికి నిరాకరించిన మహారాష్ట్ర పోలీసును ఏమనుకోవాలి? అలాగే 80 శాతానికి పైగా వైకల్యంతో బాధపడుతున్న ప్రొఫెసర్‌ సాయిబాబా బెయిల్‌ విషయంలో ఎన్‌ఐఎ ఎంత అమానుషంగా వ్యవహరించిందో చూశాం. జర్నలిస్టు సిద్ధికీ కప్పన్‌ కేసు గురించి యావత్‌ ప్రపంచ మీడియా విస్తుపోయిన వైనం మరో ఉదాహరణ. జైళ్లలో చిత్ర హింసలు, బెయిల్‌ నిరాకరణల గురించి ఇంకెన్నో... తప్పుడు కేసులు బనాయించడంలోనూ మన పోలీసులది అందె వేసిన చెయ్యి. సిఎఎ వ్యతిరేక ఆందోళనల సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఢిల్లీ పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో జగద్విదితం.
        భారతీయ దర్యాప్తు సంస్థలు, పోలీసు వ్యవస్థ వృత్తి నైపుణ్యం, సామర్ధ్యంలో పేరెన్నిక గన్నవే. ఎన్నో క్లిష్టమైన కేసుల్ని ఛేదించి ఘరానా మోసగాళ్లను కటకటాల వెనక్కు నెట్టిన ఘన చరిత్ర ఉన్నవే. అలాంటి వారు కొన్ని కేసుల్లో కనీస ఆధారాలు కూడా కోర్టులకు సమర్పించలేదంటే ఎవరూ నమ్మలేరు. ఇలాంటివాటికి నేరస్తులను రక్షించాలన్న ప్రభుత్వాల ఒత్తిళ్లే తప్ప వేరే కారణాలుండబోవు. అదే విధంగా నిర్దోషులు బయటకు రాకుండా నిర్బంధించే అమానుష, కర్కశ వాదనలు చేయడం, విషమ షరతులను విధించడం పాలకులు పోలీసును నిర్దేశించడం వల్లనేన్నది నిర్వివాదాంశం. సాధారణంగా న్యాయ వ్యవస్థ సాక్ష్యాధారాలనుబట్టి వ్యవహరిస్తుంది. కాని, దాన్ని కూడా తన గుప్పెటపెట్టుకోవాలని మోడీ సర్కారు చేస్తున్న కుటిల యత్నాలు చూస్తూనే ఉన్నాం. న్యాయం, ధర్మం నిష్పక్షపాతంగా ఉండాలి. నేరస్తులు జైళ్లలోనూ నిరపరాధులు స్వేచ్ఛగానూ ఉండాలి. ప్రజలు పాలకుల చేష్టలను పసిగట్టి కుట్రలను వమ్ము చేయాలి.