Jul 16,2023 08:40
  • ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రభృతుల శుభాకాంక్షలు : మదురై కామరాజ్‌ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌

చెన్నయ్ : స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు దిగ్గజ నేత ఎన్‌ శంకరయ్య 102 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మదురై కామరాజ్‌ విశ్వవిద్యాలయం ఎన్‌ శంకరయ్యకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనుందని ఈ సందర్భంగా స్టాలిన్‌ ప్రకటించారు. మదురైలోని అమెరికన్‌ కాలేజీలో శంకరయ్య చదువుకున్నారని, అయితే ఆయనను బ్రిటీష్‌ ప్రభుత్వం అరెస్టు చేయడంతో పరీక్షలు రాయలేకపోయారని స్టాలిన్‌ తెలిపారు. తమిళుల సమాజోద్ధరణకు, పేదల అభ్యున్నతి కోసం జీవితాతం నిర్వీరామంగా కృషి చేస్తున్న శంకరయ్యకు గౌరవ డాక్టర్‌ అందజేయాలని ప్రజల నుంచి తమకు ఎన్నో వినతులు వచ్చాయని, వారి ఆకాంక్షలను గౌరవించి శంకరయ్యకు మదురై కామరాజ్‌ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నట్లు స్టాలిన్‌ తెలిపారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు జి రామకృష్ణన్‌, ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్‌ కూడా శంకరయ్య నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిపిఎం వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ శంకరయ్యను మదురైలోని అమెరికన్‌ కాలేజీలో ఆఖరి సంవత్సరం విద్యార్థిగా ఉండగానే 1941లో తొలిసారి అరెస్టు చేశారు. భారతావని స్వాతంత్రం సాధించుకున్న 1947 ఆగస్టు 15కు 12 గంటల ముందు మాత్రమే ఆయనను విడుదల చేశారు. ఎనిమిదేళ్ల జైలు జీవితంతో పాటు దాదాపు ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘకాలంగా శంకరయ్య రాజకీయ రంగంలో సేవలందిస్తూవున్నారు. 1967, 1977, 1980 ఎన్నికల్లో ఆయన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2021లో శత వసంతాలు పూర్తి చేసుకున్న శంకరన్‌కు తమిళనాడు ప్రభుత్వం 'థగైసాల్‌ తమిళ్‌' పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది. పురస్కారం కింద రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక అందజేసి సంత్కరించింది. అయితే శంకరయ్య ఆ నగదు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.