న్యూఢిల్లీ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పథకాన్ని ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఇప్పటివరకు కిలో మూడు రూపాయలకు ఇస్తున్న బియ్యాన్ని ఇకనుండి ఏడాది పాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. జనవరి ఒకటవ తేది నుండి ఈ పథకం అమలులోకి వస్తుంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశానంతరం కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌గోయల్ మీడియాతో మాట్లాడుతూ ప్రియార్టీ హౌస్ హోల్డ్ప్ (పిహెచ్‌హెచ్) పరిధిలోకి వచ్చే వారికి ఒక్కొక్కరికి ఐదు కిలోలు, అంత్యోదయ అన్నయోజన పథకం లబ్ధిదారులకు కుటుంబానికి 35 కిలోల వంతున ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా 81.35 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని, కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. పిహెచ్‌హెచ్ కార్డు పరిధిలోకి ట్రాన్స్‌జెండర్లు, 40శాతంపైన అంగవైకల్యం ఉన్నవారు, ట్రైబల్‌గ్రూపులు, నిలువ నీడలేని వారు, విడో పెన్షనర్లు, యాచనతో జీవనం సాగించేవారు వస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకాన్ని రద్దు చేశారు.










