Nov 09,2023 07:33

చట్టం ముందు అందరూ సమానమని, అందరికీ న్యాయం పొందే ప్రాథమిక హక్కు ఉందని భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అధికరణం 14, ఆర్టికల్‌ 22 స్పష్టం చేశాయి. పేదలకు న్యాయం సత్వరమే అందడం లేదని చరిత్ర చెబుతున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని అందరికీ న్యాయ సేవలు, సత్వరమే ఉచిత న్యాయం అందించే విధానపరమైన అంశాల్లో సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా నవంబర్‌ 9న ''జాతీయ న్యాయ సేవల దినం'' పాటిస్తున్నాం. ఈ సందర్భంగా పేద, బడుగు, నిరక్షరాస్యులకు ఉచితంగా సివిల్‌, క్రిమినల్‌, రెవెన్యూ కోర్టులు, ట్రిబ్యునల్స్‌ ద్వారా న్యాయ సేవలు అందించే సదుపాయాలకు సంబంధించిన ప్రచారం జరుగుతుంది. నిరుపేదలకు ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలు, న్యాయ సేవల విస్తరణ, న్యాయ సేవల అవగాహన, లోక్‌ అదాలత్‌ల నిర్వహణ, దీర్ఘకాలిక సమస్యలకు సత్వర పరిష్కారం, హింసా బాధితులకు పరిహారం అందించటం వంటి లక్ష్యాలతో న్యాయ సేవల విస్తరణ జరుగుతోంది. ఉచిత న్యాయ సేవలు పొందేందుకు అర్హత కలిగిన వారిలో పేద మహిళలు, పిల్లలు, అంగ వైకల్యంతో బాధ పడేవారు, ఎస్‌సిలు, ఎస్‌టిలు, పారిశ్రామిక కార్మికులు, కస్టడీలో ఉన్నవారు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు, కుల వివక్షకు గురైన వారు, భిక్షాటన చేసేవారు, మానవ అక్రమ రవాణాకు గురైన వారు, వార్షిక ఆదాయం ఒక లక్ష లోపు ఉన్నవారు వస్తారు. అన్ని వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార సంస్థల్లో జాతీయ న్యాయ సేవా సంస్థ (నల్సా), రాష్ట్ర న్యాయ సేవా సంస్థ, జిల్లా న్యాయ సేవా సంస్థ, సబ్‌డివిజనల్‌ స్థాయి న్యాయ సేవా సంస్థలు వివిధ స్థాయిల్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయ సేవా కమిటీలు తమ విధులను నిర్వహిస్తున్నాయి.
-డా|| బుర్ర మధుసూదన్‌ రెడ్డి,
సెల్‌ : 9949700037