Feb 15,2023 07:37

          ఈ నెల 16న జరుగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పెద్ద ఎత్తున హింస చెలరేగవచ్చునన్న భయకంపిత వాతావరణం నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం 36 లక్షలు జనాభాగల ఈశాన్య సరిహద్దు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడడంపట్ల ప్రజాతంత్రవాదులు కలత చెందుతున్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల సందర్భంగా బందోబస్తుకు ఆ రాష్ట్ర పోలీసులకు అదనంగా ఇతర ఈశాన్య రాష్ట్రాలవారిని, పారా మిలిటరీని ఉపయోగించేవారు. ఈ ఎన్నికల్లో ఎక్కడో ఉన్న గుజరాత్‌ నుండి పోలీసులను తీసుకురావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. బిజెపి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ నెల 11 రాత్రి ఆ రాష్ట్ర డిజిపితో సహా పోలీసు ఉన్నతాధికారులతో రహస్యంగా సమావేశమవ్వడం ప్రజల భయాందోళనలను మరింతగా పెంచింది. తమ పార్టీ ప్రచారానికి వెళ్లిన పెద్దమనిషి ఆ పని పూర్తి చేసుకోవాలి తప్ప అధికారులతో సమావేశాలెలా జరుపుతారు? ఎన్నికల కోడ్‌ చెబుతున్నదేమిటి? ఇవేవీ అమిత్‌ షా కు తెలియకపోవు. అయినా ఉన్నతాధికారులు బిజెపి కి అనుకూలంగా వ్యవహరించాలని చెప్పడానికే ఆ సమావేశం అన్నది బహిరంగ రహస్యం. నిజాయితీకలిగి, రాజ్యాంగానికి, చట్టానికి లోబడి వ్యవహరించే వారెవరైనా ఉంటే వారిని బెదిరించడమో లేక ప్రలోభపర్చడమూ జరగవచ్చు. మొత్తం వ్యవహారాలు చూస్తుంటే త్రిపుర ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని తన అధికారాన్ని బిజెపి నిస్సిగ్గుగా ఉపయోగిస్తోందన్నది సుస్పష్టం.
          ఇటీవల త్రిపురలోకి పెద్ద సంఖ్యలో మోటార్‌ సైకిళ్లు దిగుమతి అయ్యాయి. ఆ మోటార్‌ సైకిళ్లను నడుపుతూ కిరాయి మూకలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నిస్తాయి. తద్వారా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్లను బిజెపి భయపెడుతుంది. ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇతర బెదిరింపు పద్ధతులు కూడా ఉపయోగిస్తున్నారు. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బిజెపి త్రిపురలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసింది. సిపిఎం నాయకులు, కార్యకర్తలపై తీవ్ర నిర్బంధకాండ సాగించింది. 2018 నుండి 2021 మధ్య 667 వామపక్ష పార్టీల కార్యాలయాలను బిజెపి ముష్కరులు ధ్వంసం చేశారు. గత సెప్టెంబర్‌ 7, 8 తేదీల్లోనే 42 సిపిఎం కార్యాలయాలను తగులబెట్టారు. సిపిఎం సభ్యులకు చెందిన 3363 ఇళ్లు, 1500 చేపల కుంటలను ధ్వంసం చేశారు. ఇంతటి విధ్వంసం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారేతప్ప దుండగులను కనీసం అదుపులోకి కూడా తీసుకోకపోవడం అధికార పార్టీ ఆగడాలకు నిదర్శనం. అక్రమాలకు అలవాటుపడ్డ బిజెపి ఈ ఎన్నికలను తొత్తడం చేయాలని అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. వామపక్షాలు 47 స్థానాల్లోను, మిగిలిన 13 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తున్నాయి. బిజెపిని ఓడించాలన్న లక్ష్యంతో పరస్పర పోటీ నివారణ ఒడంబడిక జరిగింది. మరోవైపున తిప్రా మోర్చా కూడా పోటీలో ఉంది. కొన్ని చోట్ల త్రిముఖం, ఇంకొన్ని చోట్ల బహుముఖ పోటీ జరిగే పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేస్తే బిజెపి ఓడిపోవడం ఖాయమని తేలిపోయిన నేపథ్యంలో ఎన్నికల అక్రమాలకు ఆ పార్టీ నేతలు యత్నిస్తున్నారు.
          ఇటువంటి పరిస్థితుల్లో, శాంతియుతమైన, సానుకూలమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ సకల చర్యలు చేపట్టాలి. భారత రాజ్యాంగం ఎన్నికల కమిషన్‌కు విశేషాధికారాలను కల్పించింది. వాటిని ఉపయోగించి ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పోలీసు, పారా మిలిటరీ బలగాలు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చూడాలి. ఫ్లాగ్‌ మార్చ్‌్‌లతో సహా ప్రజల్లో విశ్వాస పునరుద్ధరణ చర్యలు తీసుకోవడం అవసరం. ఫ్లాగ్‌ మార్చ్‌్‌లు ప్రధాన రహదారులకు మాత్రమే పరిమితం కాకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా చేపట్టాలి. అధికార పార్టీ అక్రమాలపై ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు సిపిఎం, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రతినిధి బృందాలు కలిసి ప్రత్యక్షంగా తెలియజేయడం, లేఖలు రాయడం జరుగుతోంది. ఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయా సందర్భాల్లో ఎన్నికల కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులూ హామీ ఇస్తున్నారు. అయితే, ఆచరణ ఎలా ఉంటుందో గురువారంనాడు తెలుస్తుంది.