
వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమాను ... ఏ రాష్ట్రంలో అమలు చేయలేనన్ని పంటలకు, వివిధ రకాల భూములకు అమలు చేస్తున్నామని చెప్పుకునే
రాష్ట్ర ప్రభుత్వం... ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.1600 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నది. గత అక్టోబర్ నుండి ఈ మార్చి చివరకు రకరకాల విపత్తులకు లక్షల మంది రైతులు పంటలు నష్టపోయారు. పాత పద్ధతిలో ఇస్తే ఎకరానికి చాలా కొద్ది మొత్తం మాత్రమే పొందుతారు. వాణిజ్య పంటలకు లక్షలలో ఖర్చు పెడుతున్నారు. పొగాకు, మిర్చి, చెరకు లాంటి పంటల నుంచి కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. కాని రైతు కష్టాలను, అవసరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్నది రైతుల ఆవేదన.
వ్యవసాయ రంగ, సాగు అనుబంధ కార్యకలాపాలపై రైతులకు మద్దతు కల్పించేందుకు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్.బి.కె) స్థాపించబడ్డాయి. నాణ్యమైన ఉత్పాదకాలను (విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మొదలైనవి) రైతులకు అందుబాటులోకి తేవడం, పండిన పంటలు కొనడం వాటి బాధ్యత.
డా|| వై.ఎస్.ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని 2020 ఖరీఫ్ నుండి అమలు చేస్తున్నారు. బీమా పథకం ద్వారా ఎంపిక కాబడిన పంటలను సాగు చేసి ఈ-క్రాప్ ద్వారా పంట నమోదు పూర్తయి ఆధార్ బయోమెట్రిక్ ఇ.కె.వై.సి పూర్తి చేసిన రైతులందరికీ బీమా రక్షణ కల్పించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు.
ఏదైనా విపత్తు వల్ల పంట నష్టం సంబóవించి దిగుబడి నష్టం జరిగిన సందర్భంలో డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా అర్హులకు బీమా పరిహారం అందించబడుతుంది. ఈ-క్రాప్ బుకింగ్ పంట కోత ప్రయోగాల ద్వారా దిగుబడి అంచనా మొదలైన వాటికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఆర్.బి.కె ల చేత అమలు చేయబడుతున్నాయని ప్రభుత్వం చెబుతున్నది. అంతేకాక ఈ-క్రాప్ బుకింగ్ జాబితాలు, పంట బీమా లబ్ధిదారుల జాబితాలు, సామాజిక తనిఖీ కోసం ఆర్.బి.కె స్థాయిలో ప్రదర్శించబడతాయని, ఫిర్యాదులను పరిష్కరిం చడంలో సహాయ పడుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రకటించారు.
వాస్తవాలను పరిశీలిస్తే పంటల బీమా అమలు గతం కన్నా మెరుగ్గా ఉన్నా...రాష్ట్రంలో అమలులో చాలా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్ర వ్యవసాయంలో వస్తున్న ఒడిదుడుకులకు, ప్రభుత్వం అమలు చేస్తున్నామన్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. రైతుల బాధలను పరిష్కరించ లేకున్నది.
ఆర్.బి.కె లు సర్వరోగ నివారణ కేంద్రాలుగా పనిచేస్తున్నాయనే భ్రమలో ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తున్నది. కానీ 10 శాతం ఆర్.బి.కె లు కూడా పనిలో లేవు. అద్దె కట్టే వారు లేరు. తలుపులు తీసిన వారు లేరు. దుమ్ము దులిపేవారు లేరు. విత్తనాలు, ఎరువులు టైముకు రావడంలేదు. అడిగిన క్వాలిటీ ఉండడం లేదు. ముఖ్యంగా లబ్ధిదారుల జాబితాలో పాలక పార్టీ వారి పేర్లు కనిపిస్తుంటాయి. ఇక పంటలు కొనుగోలు ఒక ప్రహసనమే. ఆర్‌బికె పుస్తకాలలో రైతుల పేర్లు ఉంటాయి. ప్రభుత్వ మద్దతు ధరలకే కొన్నట్లుగా ఉంటాయి. మిల్లర్లకు నిజంగా ఎమ్.ఎస్.పి కి కొన్న దానికన్నా అదనపు మొత్తాలను రైతులు వెనక్కి చెల్లిస్తున్నారు.
పంటల బీమా పథకంలో కేంద్ర ప్రభుత్వం కూడా చేరినట్లు మంత్రి గారు నర్మగర్భంగా చెప్పారు. ప్రస్తుతం పంటల బీమా రెండు ముక్కలైంది. ఒకటి, వాతావరణ ఆధారిత బీమా (డాక్టర్ వైయస్సార్ ఎఫ్.సి.ఐ వెదర్ బేస్డ్). రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి కొన్ని పంటలకు (26 జిల్లాల్లో) బీమా ఇస్తుంది. రెండు, దిగుబడి ఆధారిత బీమా (ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన). కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి బాధ్యత వహించి కొన్ని పంటలకు (26 జిల్లాల్లో) బీమా ఇస్తాయి. కొన్ని జిల్లాల్లో కొన్న పంటలకు ప్రైవేటు బీమా కంపెనీలను కటబెట్టడం జరిగింది. పంటల బీమాలో కేంద్రం వాటా 1/3 శాతం రావడానికి ఈ సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా వాస్తవంగా చూస్తే రిలయన్స్ వంటి కార్పోరేట్ కంపెనీలను రాష్ట్రంపై ఒత్తిడి చేసి మరీ కేంద్రం చేర్పించింది.
పంటల బీమా అమలు కత్తి మీద సాము లాంటిది. అందులో ముఖ్యంగా వాతావరణ బీమా నిర్ధారణ చాలా కష్టతరమైనది. సున్నితమైన వాతావరణ మార్పులను (గాలి వేగంలో మార్పులు, గాలి తేమలో మార్పులు, గాలిలో వేడిని) ప్రతి సెకనుకు రికార్డు చేయగలిగిన నూతన యంత్రాలు వచ్చాయి. వాటి ఆధారంగా పంట నష్టాన్ని లెక్కవేస్తున్నారు. ఆచరణలో పంటల దిగుబడి చాలా తక్కువగా ఉంటున్నది. ఒకటి రెండు రోజుల పాటు వాతావరణంలో వచ్చిన మార్పులతో పంట దిగుబడిపై చాలా ప్రభావం ఏర్పడుతుంది. రైతులకు నష్టపరిహారాన్ని లెక్కించడానికి ఏ పద్ధతి అవలంభించాం అనేది ప్రధానం కాదు. నిజంగా పంట నష్టపోయిన రైతులకు ఏం ఒరిగిందనేది ముఖ్యం. రైతుల పంట నష్టాన్ని ఖచ్చితంగా గుర్తించగలిగే యంత్రాంగాలు, విధానాలు అభివృద్ధి కాలేదని అర్థమవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సమాచార పత్రాన్ని పరిశీలిస్తే ... ఒక పంటకు ఓ జిల్లాలో వర్షాధారమైన పంటల బీమా వర్తిస్తుంది. అదే పంటకి ఇంకొక జిల్లాలో వర్తించదు. ఎండు మిర్చి ఎక్కువగా పండే పల్నాడు జిల్లాలో నీటిపారుదల సౌకర్యం ఉందని గత సంవత్సరం రెండు లక్షల ఎకరాల్లో పంటల బీమా అమలు కాలేదు. అదే జిల్లాలో అదే పంటకు వర్షాధార మండలాలకు బీమా అమలైంది. ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతం అని వర్షాధారమని జె పంగులూరు మండలంలో పంటల బీమా మిర్చి పంటకు వచ్చింది. దాని పక్కనే ఉన్న ఇంకొల్లు మండలంలో పది వేల ఎకరాల మిర్చి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా రాలేదు. కారణం! ఇంకొల్లు మండలంలో నీటిపారుదల సౌకర్యం ఉంది. పంగులూరు మండలంలో లేదట. ఎంత విడ్డూరం? మిర్చి పంట కనీసం మూడు లేదా నాలుగు తడుపుల నీరు పారాల్సిందే. కాలువలు, బావులు, చెరువులు లేకపోతే పండదు. ఈ వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించనందుకు రైతులు నష్టపోతున్నారు.
ఏలూరు జిల్లాలో పత్తి వర్షాధార ఆధారితం. అదే పత్తి పంటకు ఎన్టీఆర్ జిల్లాలో దిగుబడి ఆధారిత పద్ధతి బీమా ఉంది. ఎండు మిరప ఎన్టీఆర్ జిల్లాలో నీటిపారుదల ఆధారిత లిస్టులో ఉంది. మిరప గుంటూరు జిల్లాలో వర్షాధార ఆధారితంలో ఉంది. ఈ సంవత్సరం ఆంధ్ర రాయలసీమ జిల్లాల్లో అధిక వర్షాలకు ఎకరానికి 10 క్వింటాళ్ళకు పైగా దిగుబడి రావాల్సింది. ఐదు క్వింటాళ్ల లోపుగా వచ్చింది. ఒక ఎకరానికి రూ.50,000 పైన ఖర్చులు అయినాయి. నాసిరకం విత్తనాలతో లక్షలాది ఎకరాల్లో పత్తి పంట దిగుబడి రాక రైతులు నష్టపోయారు. నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకు ఫలితం లేదు.
ప్రకాశం జిల్లాలో ఒక లక్షా ఇరవై వేల ఎకరాల్లో పొగాకు వేశారు. పంట బాగా పెరిగి ఆకు కోసే సమయానికి సిద్ధమైన దశలో (50 రోజులు) వర్షాల వల్ల 50,000 ఎకరాల పంట పీకవలసి వచ్చింది. ఆ రైతులకు పంటల బీమా రాలేదు. ఈ సంవత్సరం మామిడి పంటకు నల్లి తెగులు వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో గాని విజయనగరం జిల్లాలో గాని వేలాది ఎకరాల్లో మామిడి పంట నాశనం అయ్యింది. ప్రభుత్వ విధానంలో మామిడికి బీమా లేదు. వ్యవసాయ అధికారులకు, మంత్రులుకు నివేదించుకున్నా ఫలితం కనబడడం లేదు.
బాపట్ల జిల్లాలో మిరప, శెనగ, మొక్కజొన్న లాంటి పంటలు అధిక వర్షాలకు దెబ్బతిన్నాయి. రెండు మూడు సార్లు అదే పొలంలో పంటలు వేయాల్సి వచ్చింది. గోడు వినిపించుకునే అధికారులు కనబడడం లేదు. మార్చి నెలలో వచ్చిన అకాల వర్షాలకు నాలుగు లక్షల ఎకరాలలో వేలాది కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. ఈ దఫా రాష్ట్ర బడ్జెట్‌లో ప్రకృతి విపత్తుల కోసం రూ.2000 కోట్లు కేటాయించినా దానికి ఇంతవరకు అతీగతీ లేకున్నది. పెరిగే ఖర్చులను ప్రకృతిలో వచ్చే ఒడిదుడుకులను రైతులు తట్టుకొని నిలబడగలిగే పంటల విధానాన్ని రూపొందించాల్సి ఉంది. ప్రభుత్వం తమకు అండగా ఉంటుందనే నమ్మకాన్ని రైతులు కోల్పోతున్నారు. పంట దెబ్బతిన్నప్పుడు, మిగిలిన పంటకు మార్కెట్‌లో సరసమైన ధరలు రావడానికి బడ్జెట్‌లో రూ.3000 కోట్లు కేటాయింపులున్నా తమ గోడు పట్టించుకునేవారు లేరనే ఆవేదనలో, అసంతృప్తిలో రైతు ఉన్నాడు.
వై.ఎస్.ఆర్ ఉచిత పంటల బీమాను...ఏ రాష్ట్రంలో అమలు చేయలేనన్ని పంటలకు, వివిధ రకాల భూములకు అమలు చేస్తున్నామని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం...ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1600 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నది. గత అక్టోబర్ నుండి ఈ మార్చి చివరకు రకరకాల విపత్తులకు లక్షల మంది రైతులు పంటలు నష్టపోయారు. పాత పద్ధతిలో ఇస్తే ఎకరానికి చాలా కొద్ది మొత్తం మాత్రమే పొందుతారు. వాణిజ్య పంటలకు లక్షలలో ఖర్చు పెడుతున్నారు. పొగాకు, మిర్చి, చెరకు లాంటి పంటల నుంచి కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. కాని రైతు కష్టాలను, అవసరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్నది రైతుల ఆవేదన.
/ వ్యాసకర్త ఎ.పి రైతుసంఘం అధ్యక్షులు,
సెల్ : 9090499000 /
వి. కృష్ణయ్య