
- కన్నెత్తి చూడని అధికారులు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి/ఆదోని రూరల్ : కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో పత్తి తూకాల్లో మోసాలు చోటు చేసుకుటుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కో పత్తి బోరెంలో (దాదాపు 300 కిలోల నుంచి 500 కిలోల వరకు సంచిని బట్టి) ఐదు కిలోల నుంచి ఎనిమిది కిలోల వరకు తూకాల్లో తక్కువ చూపించి మోసగిస్తున్నారు. రాయలసీమలో పేరుగాంచిన ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొందరు వేమెన్‌లు (కాటాదారులు) మోసాలకు పాల్పడుతున్నారు. ఆదోని మార్కెట్ యార్డుకు కర్నూలు జిల్లా రైతులేగాక అనంతపురం, తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా, కర్నాటక రాష్ట్రం సిరుగుప్ప, బళ్లారి జిల్లాల నుంచి నిత్యం వందలాది మంది రైతులు పత్తి పంటను తీసుకువస్తారు. రోజు వెయ్యి నుంచి మూడు వేల క్వింటాళ్ల వరకు యార్డుకు విక్రయానికి వస్తాయి. సీజన్‌లో అయితే రోజుకు నాలుగు వేల క్వింటాళ్లకు పైగా పత్తి యార్డుకు వస్తుంది.
యార్డులో 355 పైగా దుకాణాలు ఉన్నాయి. దుకాణానికి ఐదు నుంచి పది మంది వేమెన్‌లను పత్తిని తూకం వేసేందుకు కేటాయించారు. టెండర్ పూర్తైన వెంటనే వారికి కేటాయించిన కమీషన్ ఏజెంట్ వద్ద తూకాలు వేయడం, రోజూ ఎన్ని క్వింటాళ్లు తూకాలు వేశారో ఆ వివరాలను మార్కెట్ కమిటీకి కాటాదారులు అందించాల్సి ఉంటుంది. వ్యాపారులు ఇచ్చే డబ్బులకు ఆశపడి కొందరు కాటాదారులు తక్కువ తూకం చూపి రైతులను దగా చేస్తున్నారు.
ఎలక్టాన్రిక్ కాటా ఉన్నా.. తూకాల్లో పారదర్శకత కోసం ఎనిమిదేళ్ల క్రితం ఎలక్ట్రానిక్ కాటాలను ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రవేశపెట్టారు. అక్రమాలు బయటపడతాయని ఎలక్ట్రానిక్ కాటాలను అప్పుడు కొంత మంది వ్యతిరేకించినా విజయవంతంగా అమలు చేశారు. అయినా కొంత మంది అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. రోజుకు పది వేల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వస్తే అందులో దాదాపు 500 కిలోలు రైతులు నష్టపోతున్నారు. ఆదోని పట్టణంలో రహదారులకు ఇరువైపులా రోడ్డు పైనే వ్యాపారాలు జోరందుకున్నాయి. తూనికలు కొలతల శాఖ నుంచి అనుమతి లేకుండా కాటాలు వినియోగిస్తున్నారు. పలు చోట్ల నేటికీ పాతకాలపు రాళ్లతోనే తూకాలు వేస్తూ రైతులను మోసగిస్తున్నారు. తూకాల్లో మోసాల వైపు మార్కెట్ యార్డు, తూనికలు కొలతల శాఖ అధికారులు చూడడం లేదని రైతులు వాపోతున్నారు.
తరచూ తనిఖీలు
వ్యవసాయ మార్కెట్ యార్డులో పంట దిగుబడుల తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు మైక్ ద్వారా మోసాల గురించి అనౌన్స్ చేస్తూనే ఉన్నాం. తరచూ తనిఖీలు కూడా చేస్తున్నాం.
- శ్రీకాంత్ రెడ్డి, ఆదోని మార్కెట్ యార్డ్ కార్యదర్శి.